బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తలకిందులైన రేట్లు! | Gold Price Weekly Analysis Jumps 7% can hit $5000 | Sakshi
Sakshi News home page

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తలకిందులైన రేట్లు!

Aug 8 2026 4:51 PM | Updated on Aug 8 2026 5:05 PM

Gold Price Weekly Analysis Jumps 7% can hit $5000

బంగారం ధరలు ఈ వారం మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి, ఎనిమిది నెలల్లోనే అత్యుత్తమ వారపు పనితీరును నమోదు చేసింది. స్పాట్‌ గోల్డ్‌ ఔన్సుకు సుమారు 4,336 డాలర్లకు చేరగా, ట్రేడింగ్‌లో 4,350 డాలర్ల సమీపంలో ఏడు వారాల గరిష్ఠాన్ని తాకింది. బలహీనమైన అమెరికా ఉద్యోగాల డేటా, తగ్గుతున్న ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు పసిడి ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

బంగారానికి పెరిగిన డిమాండ్‌

అమెరికా జూలై నాన్‌-ఫార్మ్‌ పేరోల్స్‌ అనూహ్యంగా 23 వేల ఉద్యోగాలు తగ్గడం మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్‌ గణాంకాలను కూడా దిగువకు సవరించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ సమీప సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగినప్పుడు బాండ్లపై రాబడులు, డాలర్‌ బలహీనపడే అవకాశం ఉండటంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్‌ పెరుగుతుంది.

మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం కూడా బంగారానికి కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ‘హయ్యర్‌ ఫర్‌ లాంగర్‌’ వడ్డీ రేట్ల అంచనాలు బలహీనపడతాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న నిధులు పసిడి ధరలకు అదనపు మద్దతు ఇస్తున్నాయి.

సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ప్రస్తుత ర్యాలీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంకులు 288.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 62 శాతం పెరుగుదల. దక్షిణ కొరియా సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా 13 ఏళ్ల విరామం తర్వాత తిరిగి బంగారం కొనుగోలు చేయడం అధికారిక రంగంలో పసిడిపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందన్న సంకేతాలను ఇస్తోంది.

పెరిగింది రూ.8వేలు పైనే..

ఇక హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,39,650గా నమోదైంది. వారం ప్రారంభంలో అంటే ఆగస్టు 1న 24 క్యారెట్ల ధర రూ.1,44,220, 22 క్యారెట్ల ధర రూ.1,32,200గా ఉండగా.. వారం రోజుల్లో 24 క్యారెట్లపై రూ.8,130, 22 క్యారెట్లపై రూ.7,450 పెరిగింది.

మరో భారీ బుల్‌రన్‌ అవుతుందా?

అయితే ఈ ర్యాలీని నేరుగా మరో భారీ బుల్‌రన్‌గా నిర్ధారించడం తొందరపాటు అవుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి బలంగా కొనసాగడం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, మార్కెట్లలో రిస్క్‌ అప్పటైట్‌ తిరిగి రావడం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొంతకాలం పరిమిత శ్రేణిలో కదలవచ్చని పేర్కొంది.

అదే సమయంలో ఆర్థిక మందగమనం, కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు లేదా ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కలిసి వస్తే బంగారం మళ్లీ 4,500 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ర్యాలీకి దీర్ఘకాలిక బలం ఉన్నప్పటికీ, మధ్యలో ధరల కరెక్షన్‌, లాభాల స్వీకరణ వంటి పరిణామాలు తప్పక చూడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement