న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా?
ఈ ప్రతిపాదిత దళం భారత్‌లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్‌లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.
స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు?
సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి రంగాలకు ఈ బాధ్యతలు విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించే వరకు ఇవి మోదీ ప్రతిపాదించిన దళంలో ఖరారైన విధులుగా కాకుండా సాధ్యమైన విధులుగా మాత్రమే చూడాలి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది?
పాకిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దించారు. ఆరోగ్యం, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పశుసంపద నిర్వహణ, నిత్యావసర వస్తువుల సరఫరాలో 2,818 మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2025 మే 7న 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ కృత్రిమ విన్యాసాలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, విద్యుత్ దీపాల ఆర్పివేత, ప్రజల తరలింపు, అగ్నిమాపక చర్యలు, గాలింపు, రక్షణ చర్యలు, క్షతగాత్రుల తరలింపు, అత్యవసర వైద్య ఏర్పాట్లను ఈ విన్యాసాల్లో పరీక్షించారు.
ఇది ఎన్‌సీసీకి ఎలా భిన్నం?
జాతీయ సేవలో పౌరులు లేదా స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసే సంస్థలు భారత్‌లో ఇప్పటికే ఉన్నాయి. అయితే వాటి ఉద్దేశాలు వేర్వేరుగా ఉంటాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రధానంగా యువతకు సంబంధించిన సంస్థ. 1948 ఎన్‌సీసీ చట్టం కింద ఏర్పాటైన ఈ సంస్థ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవా భావాన్ని పెంపొందించే శిక్షణ అందిస్తుంది.
ఎన్‌సీసీ క్యాడెట్లు సామాజిక సేవ, విపత్తు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అయితే ఎన్‌సీసీ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే దళం కాదు. యువత అభివృద్ధి, శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది. మరోవైపు సివిల్ డిఫెన్స్ ను ప్రత్యేకంగా పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత కోసం రూపొందించారు.
హోమ్ గార్డులు, టెరిటోరియల్ ఆర్మీ సంగతేంటి?
పోలీసులకు సహాయం చేసేందుకు హోమ్ గార్డులను 1946లో తొలిసారిగా స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేశారు. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మరింత ఏకరీతి హోమ్ గార్డుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించింది. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు పోలీసులకు సహాయం చేయడంతో పాటు అధికారులకు తోడ్పడవచ్చు. వారు సివిల్ డిఫెన్స్ విధులను కూడా నిర్వహించవచ్చు.
హోమ్ గార్డులు ప్రధానంగా పోలీసులకు సహాయక దళంగా పనిచేస్తారు. సివిల్ డిఫెన్స్ మాత్రం పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతపై దృష్టి పెడుతుంది. అలాగే హోమ్ గార్డులు వేతనం పొందే స్వచ్ఛంద సేవకుల దళం. అయితే విధులకు పిలిచిన రోజులకు మాత్రమే గౌరవ వేతనం లేదా కూలీ అందుతుంది.
టెరిటోరియల్ ఆర్మీ కూడా పౌరులు స్వచ్ఛందంగా జాతీయ భద్రతా బాధ్యతలు చేపట్టే మరో ఉదాహరణ. అయితే ఇది సివిల్ డిఫెన్స్‌కు పూర్తిగా భిన్నమైనది. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది సాధారణంగా తమ తమ వృత్తుల్లో పౌరులుగా ఉంటారు. అయితే వారు సైనిక శిక్షణ పొందుతారు. సైనిక సేవకు పిలిచినప్పుడు విధులు నిర్వర్తించవచ్చు. వారు సైనిక రిజర్వ్ వ్యవస్థలో భాగంగా ఉంటారు. అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి సహాయం చేయవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందికి నెలవారీ స్థిర వేతనం ఉండదు. అయితే శిక్షణ సమయంలో, విధుల్లో ఉన్నప్పుడు అదే హోదాలోని సైనిక అధికారికి లభించే వేతనం, భత్యాల స్థాయిలో చెల్లింపులు అందుతాయి. దీనికి భిన్నంగా సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులు సైనికులు కాదు. అలాగే వారు హోమ్ గార్డులకు పూర్తిగా సమానమైన వారు కూడా కాదు.
కొత్త స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారా?
ప్రతిపాదిత సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారని మోదీ ప్రకటనలో ఎలాంటి సూచన లేదు. సివిల్ డిఫెన్స్ ఉద్దేశం పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, సంక్షోభ సమయంలో కీలక సేవలను కొనసాగించడం. ఇది మరో సాయుధ దళం కాదు. అమెరికా దీనికి ఉదాహరణ. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ఆయుధాలను కలిగి ఉండే, ధరించే హక్కును రక్షిస్తూ “క్రమబద్ధమైన మిలీషియా” గురించి ప్రస్తావిస్తుంది. ఆ మిలీషియా ప్రస్తావన తొలినాటి అమెరికాలోని పౌర సైనిక దళాల వ్యవస్థను ప్రతిబింబించింది. తరువాత వ్యక్తిగతంగా తుపాకులు కలిగి ఉండే హక్కుపై అమెరికాలో జరుగుతున్న రాజ్యాంగపరమైన చర్చలో ఈ నిబంధన కీలకంగా మారింది.
మొత్తానికి సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ముందస్తు సన్నద్ధత కల్పించే వ్యవస్థ.


