సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్‌స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం డబ్బును ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. భవిష్యత్తులో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు.
తాను, తన భార్య రుచి కలిసి పాటిస్తున్న ఐదు మనీ రూల్స్‌ను అంకుర్ వారికూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము సంపన్న కుటుంబాల నుంచి రాలేదని, తమ జీవితంలో నిజమైన ఆర్థిక స్థిరత్వం గత 6-7 ఏళ్లలోనే వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఐదు అలవాట్లు తమ కుటుంబం డబ్బును చూసే విధానాన్ని మార్చాయని తెలిపారు.
మొదటి నియమం - డబ్బున్నవారిలా కనిపించడానికి ఖర్చు చేయకూడదు
ఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనడం కంటే.. భవిష్యత్తులో సంపదను పెంచే ఆస్తులపై డబ్బు పెట్టాలని ఆయన చెబుతున్నారు. అందుకే.. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతామని చెప్పారు. కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే ఉందని, కారు కూడా సొంతంగా కొనకుండా అద్దెకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.
రెండో నియమం - ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయడం
ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదనేది వారి ఆలోచన. నాణ్యమైన ఆహారం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటామని అంకుర్ చెప్పారు. తమ కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించే అద్దె పొలం ఉందని, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.
మూడో నియమం - వస్తువుల కంటే జ్ఞాపకాలను సంపాదించుకోవడం
ఖరీదైన వస్తువులు కొనడం కంటే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, క్రీడా కార్యక్రమాలకు వెళ్లడం, మ్యూజియంలు చూడటం వంటి అనుభవాలకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది తమ కుటుంబం ఏకంగా 116 రోజులు ప్రయాణించిందని చెప్పారు. తాము వెళ్లే ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి.. అవసరమైతే చరిత్రకారులను కూడా వెంట తీసుకెళ్తామని తెలిపారు.
నాలుగో నియమం - ఖర్చు చేసే ముందు పెట్టుబడి పెట్టడం
ఆదాయం వచ్చిన రోజే ముందుగా పెట్టుబడి పెడతామని అంకుర్ చెప్పారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేస్తామని తెలిపారు. అంటే ముందుగా పెట్టుబడి.. ఆ తర్వాత ఖర్చు అన్నమాట. దీంతో నెలాఖరుకు చేతిలో కొన్ని వేల రూపాయలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన డబ్బంతా అప్పటికే పెట్టుబడిగా మారిపోయి ఉంటుందని వివరించారు.
ఐదో నియమం - నేర్చుకోవడానికి ఎలాంటి పరిమితి పెట్టుకోకపోవడం
పుస్తకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ కుటుంబంలో ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టుకోలేదని ఆయన చెప్పారు. వారి ఇంట్లో లివింగ్ రూమ్ కూడా లైబ్రరీలా ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని నలుగురూ పుస్తకాలు చదవడంతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పారు. పాటరీ, పియానో నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ వరకు వివిధ కోర్సులు, క్లాసులకు హాజరవుతున్నట్లు తెలిపారు.
అయితే ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదని అంకుర్ స్పష్టం చేశారు. ఇవి తమ కుటుంబం పాటిస్తున్న నియమాలు మాత్రమే అని చెప్పారు. అయితే అందరూ.. తమ ఆదాయం, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు తగ్గట్టుగా సొంత మనీ రూల్స్ పెట్టుకోవాలని సూచించారు.


