‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత, ఆర్థిక వ్యాఖ్యాత, ఇన్వెస్ట్‌మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ఫేస్‌బుక్ పోస్టులో ఆర్థిక విజయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చాలా మంది ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని చదివి, అందులోని విషయాలను అంగీకరించినప్పటికీ.. ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
తనకు తన ‘రిచ్ డాడ్’ పుస్తకాలు ఇవ్వలేదని, అనుభవాల ద్వారా నేర్పించారని కియోసాకి గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే తన స్టోర్‌లో ఉచితంగా పని చేయించారని, సరుకుల లెక్కలు చూసుకోవడం, కస్టమర్లను గమనించడం, డబ్బు ఎలా చేతులు మారుతుందో తెలుసుకోవడం వంటి విషయాలను నేర్పించారని తెలిపారు. నిజ జీవితంలో తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా తన ఆలోచనా విధానం మారిందని చెప్పారు.
ఆర్థిక విద్యలో ఎక్కువ భాగం పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలు, సెమినార్ల వంటి వాటి ద్వారా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆర్థిక సమాచారాన్ని వినోదంలా నిష్క్రియాత్మకంగా తీసుకుంటున్నారని, కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల వారి జీవితాల్లో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని ప్రజలకు అన్ని సమాధానాలు చెప్పేందుకు కాకుండా.. సరైన ప్రశ్నలు ఎలా అడగాలో ఆలోచింపజేసేందుకు రాశానని కియోసాకి తెలిపారు. పుస్తకం కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన ఆర్థిక విద్య అనుభవాల నుంచే మొదలవుతుందని చెప్పారు. మొదటి ఆస్తిని కొనుగోలు చేసి తప్పు చేయడం, వ్యాపారం ప్రారంభించి ఆదాయం గురించి భయపడటం, బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నించి తిరస్కరణ ఎదుర్కోవడం, ఆర్థిక నివేదికను చదవలేకపోవడం వంటి అనుభవాలే ఎక్కువగా నేర్పిస్తాయని వివరించారు.
పెట్టుబడుల గురించి కేవలం చదవడం ఆపి.. చిన్న మొత్తాలతో అయినా పెట్టుబడులు ప్రారంభించాలని కియోసాకి సూచించారు. పెద్ద మొత్తాలతో తప్పులు చేసే ముందు చిన్న మొత్తాలతో అనుభవం సంపాదించాలని పేర్కొన్నారు. చదవడం కంటే ఆచరణ ద్వారా నేర్చుకున్న విషయాలే ఎక్కువకాలం గుర్తుంటాయని ఆయన తన పోస్టులో వెల్లడించారు.


