న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ ఫిన్‌టెక్ విభాగం ‘ఎయిర్‌టెల్ మనీ’ అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎల్‌ఎస్‌ఈ)లో లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన షేర్ల ధర శ్రేణి, ఇష్యూ పరిమాణంతో పాటు ఇతర పూర్తి వివరాలను అక్టోబర్‌లో సమర్పించే ముసాయిదా పత్రాల్లో వెల్లడిస్తామని ‘ఎల్‌ఎస్‌ఈ’ ఫైలింగ్‌లో తెలిపింది. అక్టోబర్ మూడో వారంలో ఐపీఓ తుది ధరను ఖరారు చేయనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ప్రస్తుత షేర్ హోల్డర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించనున్నారు
ఐఎఫ్‌సీతో ప్రమోటర్ ఒప్పందం
ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) సంస్థ ఎయిర్‌టెల్ మనీతో ‘ముందస్తు పెట్టుబడి ఒప్పందం’ కుదుర్చుకుంది. ఐపీఓలో ఖరారయ్యే ముగింపు ధర వద్ద.. ప్రస్తుత షేర్ హోల్డర్ల నుంచి దాదాపు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ.750 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఐఎఫ్‌సీ అంగీకరించింది.
ఆఫ్రికాలో ఎయిర్‌టెల్ మనీ హవా
ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌గా ‘ఎయిర్‌టెల్ మనీ’ నిలిచిందని కంపెనీ సీఈవో ఇయాన్ ఫెర్రావో తెలిపారు. ‘‘ప్రస్తుతం నెలకు 5.3 కోట్ల మంది డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇది కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచింది. 2031 నాటికి డిజిటల్ లావాదేవీల పరిమాణం అయిదు రెట్లు పెరుగుతుంది. ఎయిర్‌టెల్ ఆఫ్రికా సబ్‌స్రైబర్లను తమ డిజిటల్ యాప్ వైపు మళ్లించడం ద్వారా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాము’’ అని ఫెర్రావో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆఫ్రికా సంస్థకు ఎయిర్‌టెల్ మనీలో 77.85 శాతం వాటా ఉంది. 2021లో టీపీజీ, మాస్టర్‌కార్డ్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ సంస్థలు ఇందులో 550 మిలియన్ డాలర్ల మైనారిటీ వాటాలను దక్కించుకున్నాయి. లిస్టింగ్ తర్వాత కూడా ఎయిర్‌టెల్ ఆఫ్రికానే ప్రధాన వ్యూహాత్మక వాటాదారుగా కొనసాగనుంది.


