ప్రాసెసర్ పనితీరు, డిస్‌ప్లే నాణ్యతలకే తొలి ప్రాధాన్యత
టెక్ ప్రియులకు ఏఐపై పెరుగుతున్నమక్కువ
ల్యాప్‌ట్యాబ్, ట్యాబ్లెట్ కొనుగోలుదారుల మనోగతం
అమెజాన్ ‘బెస్ట్ ఇన్ టెక్’ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారిలో 87 శాతం మంది ప్రాసెసర్ పనితీరుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మంగళవారం విడుదల చేసిన ‘బెస్ట్ ఇన్ టెక్’ సర్వే వెల్లడించింది. ట్యాబ్లెట్ కొనేవారిలో 74 శాతం డిప్‌ప్లే నాణ్యతకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. సుమారు 40,000 మందికి పైగా వినియోగదారుల స్పందనల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. కొనుగోలుదారులు బ్రాండ్‌ల కంటే స్పేసిఫికేషన్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు
⇒ కొనుగోలుదారులు ఏఐ ఫీచర్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దాదాపు 58 శాతం మంది రాబోయే ఏఐ ఫీచర్లు తమ ఉత్పాదకతను పెంచడంలో ‘‘ఎంతో ఉపయోగపడతాయని’’ భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆన్–డివైస్ ఏఐ అసిస్టెంట్లు (28%), ఏఐ–ప్రాసెసింగ్ చిప్‌లు (25%) మొదటి స్థానంలో నిలిచాయి.
⇒ బ్రాండ్ల కంటే స్పెసిఫికేషన్లకే ఓటు వేస్తున్నారు. 53 శాతం మంది వినియోగదారులు ఒకే ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు లభిస్తే వేరే బ్రాండ్‌కు మారడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిబట్టి బ్రాండ్ కంటే సాంకేతిక ఫీచర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.
⇒ ప్రతి నలుగురిలో ముగ్గురు ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు రూ. 40,000 కంటే ఎక్కువ ధర ఉన్న డివైజ్‌లను పరిశీలిస్తున్నారు. వీరిలో 50 శాతం మంది రూ. 40,000 నుండి రూ. 80,000 బడ్జెట్‌ను, 26 శాతం మంది రూ. 80,000 కంటే ఎక్కువ ఉన్న ప్రీమియం కేటగిరీని ఎంచుకుంటున్నారు.
⇒ కొనుగోలు చేసేముందు ప్రాడెక్టుల గురించి సు«దీర్ఘమైన రీసెర్చ్ చేస్తున్నారు. పావువంతు (25%) మంది కొనుగోలుదారులు ల్యాప్‌టాప్ కొనే ముందు రెండు నెలలకు పైగా రీసెర్చ్ చేస్తున్నారు. 48 శాతం మంది కనీసం రెండు నుండి మూడు బ్రాండ్లను సరిపోల్చి చూసుకుంటున్నారు.
ట్యాబ్ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు ఇవి...
ట్యాబ్‌ల విషయంలో 74 శాతం మందికి డిస్‌ప్లే సైజు, క్వాలిటీయే ప్రధాన అంశంగా మారింది. ధర (12%), ప్రాసెసర్ (9%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దాదాపు 59 శాతం మంది రూ. 20,000 నుండి రూ. 35,000 బడ్జెట్‌లో ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వీటిని ప్రధానంగా ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా (29%), మీడియా కన్సప్షన్ (21%), తేలికగా తీసుకెళ్లే సదుపాయం (17%) కోసం ఎంచుకుంటున్నారు.
‘‘కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ‘ల్యాప్‌టాప్‌లు’ అధిక ధర కలిగిన ఉత్పత్తులు కావడంతో కొనుగోలుదారులు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. తమ అవసరాలు, వినియోగానికి అనుగుణంగా నిర్దిష్ట స్పెసిఫికేషన్లు, సామర్థ్యాలను కోరుకుంటారు. అంతేకాకుండా, ల్యాప్‌టాప్‌లను ఎక్కువ కాలం పాటు ఉపయోగిస్తారు కావున కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా భిన్న బ్రాండ్లతో సరిపోల్చి చూసుకుంటారు. కొనుగోలుదారులకు బ్రాండ్ పేరు కంటే స్పెసిఫికేషన్లే అత్యంత ముఖ్యమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఇది ప్రతీ ల్యాప్‌టాప్ తయారీదారు సంస్థకు ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు’’ అని అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జుబాఖాన్ తెలిపారు.


