క్విక్‌ కామర్స్‌ సంస్థల ఫుడ్‌ లైసెన్సులు సస్పెండ్‌ | Amazon Instamart BigBasket Food Licences Suspended Datura Sales Karnataka | Sakshi
Sakshi News home page

అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌ ఫుడ్‌ లైసెన్సులు సస్పెండ్‌

Aug 25 2026 7:45 AM | Updated on Aug 25 2026 7:57 AM

Amazon Instamart BigBasket Food Licences Suspended Datura Sales Karnataka

క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై విషపూరిత దతూర (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అనువైన ఆహార ఉత్పత్తులుగా విక్రయించినట్లు గుర్తించిన కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విషపూరిత ఉత్పత్తులను క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు దతూర ఉత్పత్తుల విక్రయం, ఆన్‌లైన్‌ లిస్టింగ్‌లపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో దతూర పండ్లు, విత్తనాలు ఆహార ఉత్పత్తులుగా కనిపించడంతో పాటు వాటిపై FSSAI ఫుడ్‌ లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లను గిడ్డంగుల్లో నిల్వ ఉంచి ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడైంది.

తింటే తీవ్ర ఆరోగ్య ముప్పు

దతూరను సాధారణంగా ‘థోర్న్‌ యాపిల్‌’గా పిలుస్తారు. ఇందులో సహజంగా విషపూరిత ఆల్కలాయిడ్లు ఉండటంతో దీనిని తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అధికారులు ప్రత్యేకంగా శుద్ధి చేయని దతూరను వినియోగించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తీవ్రమైన విషప్రభావం ఏర్పడితే కోమా వంటి పరిస్థితులు, అత్యంత తీవ్ర సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యపరమైన హెచ్చరికలు ఉన్నాయి.

కంపెనీల వివరణలపై అసంతృప్తి

ఈ వ్యవహారంపై సంబంధిత సంస్థల ప్రతినిధులు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉత్తర్వుల ప్రకారం, అమెజాన్‌ తన వివరణను సమర్పించలేదు. ఇన్‌స్టామార్ట్‌ తనవైపు తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం కోరింది. మరోవైపు బిగ్‌బాస్కెట్‌ దతూర పండ్ల ఆన్‌లైన్‌ విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపై ‘మానవ వినియోగానికి కాదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించేలా లేబులింగ్‌ను సరిచేస్తామని పేర్కొంది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా విభాగం తేల్చింది.

సెల్లర్లపైనా చర్యలు

దతూరను ఆహారంగా నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల ఫుడ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే దతూర పండ్లు లేదా విత్తనాలను ఆహారం/మానవ వినియోగం కోసం అందిస్తున్న అన్ని ఆన్‌లైన్‌ లిస్టింగ్‌లు, ప్రకటనలను తొలగించాలని లేదా నిలిపివేయాలని సంబంధిత ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఈ జలుబు మందులు బ్యాన్‌.. నిషేధించిన కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement