ప్రవర్తన
‘‘పిల్లలకు ఏదైనా మంచి చెబితే వినే రోజులు కావు ఇవి..’’
‘‘అంతా ఫోన్ల వల్లే, ఇలా తయారవుతున్నారు..’’
‘‘జల్సాలకు అలవాటు పడ్డారు.
అందుకే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు..’’
ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు
సంబంధించి ఇలాంటి మాటలు.. తరచూ వింటున్నాం.
ఈ మాటలను బలపరుస్తూ...
ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్‌ని విద్యార్థులే అతి దారుణంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం, భక్తి.. స్థానంలో కక్షపూరితమైన ఆలోచన ఎలా వచ్చింది? మైనర్ పిల్లల్లో అంతటి హింసాత్మక ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటని.. నివ్వెరపోయారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకోవడానికి గల కారణాలు.. మరో సంఘటనకు తావు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు..
‘సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల చదువులో ర్యాంకులే చూస్తున్నాం. కానీ, వారి ప్రవర్తన లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామా.. అనేది ప్రశ్నించుకోవాలి. నేటి తరాన్ని మార్చేది శిక్ష రూపంలో కాదు.. ప్రేమ, శ్రద్ధ, అవగాహనయే ప్రధానంగా చూపాల్సింది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు డాక్టర్ జ్యోతిరాజ.
ఒకప్పుడు పిల్లల ప్రపంచం చదువు, ఆటలు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయంతో నిండి ఉండేది. కానీ నేటిరోజులు అరచేతిలో రంగుల ప్రపంచాన్ని చూపే సోషల్ మీడియా, ఖరీదైన వస్తువులపై ఆకర్షణ, ఏదో ఒక దారిలో త్వరగా డబ్బు సంపాదించి ఆనందించాలనే ఆలోచన, వ్యసనాలు.. పిల్లల మెదళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. కష్టపడటం కన్నా తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటిని అందుకోవడంవైపే మొగ్గుచూపుతున్నారు. కారణాలు ఏవైనా కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. దీనివల్ల పిల్లల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను పసిగట్టలేకపోతున్నారు. ఫలితంగా సరిదిద్దలేకపోతున్నారు.
ఇలాంటి క్రమంలో...
ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తోటివాళ్లముందు ‘ఈ పిల్లవాడు చెడ్డవాడు’, ‘సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ తప్పదు...’ అనే హెచ్చరికలు సమస్యకు పరిష్కారాన్ని చూపవు.
పిల్లలు స్కూల్‌కి సరిగా రావడం లేదు, చదవడం లేదు అని ఎప్పటికప్పుడు టీచర్లు తల్లిదండ్రులకు తెలియజేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దండనతో కాకుండా ‘వారి ప్రవర్తన వెనుక కారణం ఏమిటో..’ తెలుసుకోవాలి. ప్రేమతోనే మార్పును తీసుకురావాలి.
స్కూళ్లలో చదువు మాత్రమే కాకుండా విలువలు నేర్పేలా ప్రవర్తనకు సంబంధించి నిపుణులచే కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాలి.
పిల్లలు శారీరకంగా అలసిపోయేలా క్రీడలు ఉండాలి, అలాగే మానసిక వికాసం పెంపొందే వాతావరణమూ వారి చుట్టూతా ఉండాలి.
వదిలేయకూడదు...
కుటుంబంలో సరైన శ్రద్ధ చూపకపోవడం, స్కూల్లో వేధింపులు, స్నేహితుల ప్రభావం, ఫోన్లలో హింసాత్మక కంటెంట్ ఎక్కువ చూడటం, పదే పదే అవమానించబడుతున్నాననే భావన.. ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంటాయి. పిల్లల్లో తీవ్రమైన కోపావేశాలు, స్కూల్లో గొడవలు, వస్తువులను పగలగొట్టడం, ఇతరులను గాయపరచడం, వ్యసనాలు.. ఇలాంటివి గుర్తిస్తాం. కానీ, పెద్దయ్యాక వాళ్లే మారుతారులే అని వదిలేయకూడదు. మార్పు తీసుకురాలేకపోతున్నాం అనిపిస్తే తల్లిదండ్రులు, టీచర్లు... నిపుణులను సంప్రదించాలి.
– డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్
పిల్లలు చెప్పేది ముందుగా వినాలి...
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు వెంటనే అరుస్తారు లేదా కొట్టడం, అవమానించడం కూడా చేస్తుంటారు. దానికి బదులుగా ...
‘‘నువ్వు ఇలా ఎందుకు చేశావు?’’,
‘‘ఆ సమయంలో నీకు ఎలా అనిపించింది?’’,
‘‘ఇలా చేయడం వల్ల ఇంకొకరికి ఎలా అనిపించి ఉండొచ్చు?’’..
అనే ప్రశ్నలు ప్రైమరీ పాఠశాల స్థాయి నుంచే పిల్లలను అడుగుతూ ఉండటం, సమాధానాలు రాబట్టడం వల్ల వారిలో ఆత్మపరిశీలన, బాధ్యత, దయ పెరుగుతాయి.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నేరుగా వారిని కాకుండా తప్పుడు ప్రవర్తనను విమర్శించాలి. ‘నువ్వు చెడ్డవాడివి’ అని చెప్పడం అంటే ఆ వ్యక్తిని రెచ్చగొట్టడమే అవుతుంది. ‘నువ్వు చేసిన పని తప్పు, నువ్వు కాదు. దీనిని సరిదిద్దుకునే అవకాశం ఉంది..’ అని చెప్పే మాటలు మరింత ప్రభావ వంతంగా పనిచేస్తాయి.
నెగెటివిటీని ఎలా మార్చాలంటే...
పిల్లలలో వచ్చే ప్రతి నెగెటివ్ ఆలోచనను బలవంతంగా ఆపాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని, దాన్ని సరైన దిశలోకి మళ్లించాలి. ఉదాహరణకు...
‘నాకు చేతకాదు’ అంటే – ‘ప్రయత్నిస్తే నువ్వూ నేర్చుకోగలవు.’
‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అంటే – ‘నీ భావాలను మాతో స్వేచ్ఛగా పంచుకోవచ్చు.’
‘‘అందరూ చేస్తున్నారు కాబట్టి నేనూ చేస్తాను’’ అంటే –
‘‘అందరూ చేసే పని సరైనదే కావాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం పెద్ద కష్టమైనది ఏమీ కాదు.. అని చెప్పగలగాలి.
పాఠశాల అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే కాదు అది వ్యక్విత్వాన్ని నిర్మించే కేంద్రాలు కూడా. పిల్లలు ఒంటరిగా గడపడం, చదువు పట్ల అనాసక్తి, కోపం,
అసహనం.. వంటివి గమనించాలి. మామూలే అని
వదిలేయకుండా సీరియస్‌గా తీసుకోవాలి. తల్లిదండ్రుల
మద్దతుతో కౌన్సెలింగ్ ఇవ్వాలి. తప్పుడు దారుల్లోకి వెళ్లకుండా కాపాడగలగాలి. అప్పుడే రేపటి తరం భవిష్యత్తు అంధకారం కాకుండా చూడగలం.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇవి చదవండి: ఏజ్–టెక్‌తో స్కామ్స్‌పై ఎటాక్


