షావుకారు జానకి మృతి పట్ల ప్రముఖుల నివాళి | Condolences on the passing of South Indian star Sowcar Janaki | Sakshi
Sakshi News home page

షావుకారు జానకి మృతి పట్ల ప్రముఖుల నివాళి

Aug 22 2026 5:22 AM | Updated on Aug 22 2026 5:22 AM

Condolences on the passing of South Indian star Sowcar Janaki

షావుకారు జానకి మృతి పట్ల పలువురు దక్షిణాది స్టార్స్‌ తమ సంతాపం వ్యక్తం చేశారు.

→ షావుకారు జానకిగారు నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాల పాటు మేం ఎన్నో సినిమాల్లో కలిసి పని చేశాం. ఆనాటి హీరోలందరితోనూ నటించిన ఘనత జానకిగారిది. నా గురువు కె. బాలచందర్‌కు ఆమె అంటే ఎంతో గౌరవం.  ఆమెకు నా కన్నీటి వీడ్కోలు.      
– కమల్‌హాసన్‌

→ లెజండరీ నటి షావుకారు జానకిగారితో కలిసి ‘సూర్య మానసం’ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. ఆ సినిమా సమయంలోని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. 
    – మమ్ముట్టి

→ తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకిగారి మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. జానకిగారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.                
– ఎన్టీఆర్‌

→ ‘షావుకారు’ చిత్రంతో మొదలైన జానకిగారి సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె..
– చిరంజీవి

→ మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటప్రస్థానం చూసిన ఆర్టిస్ట్‌ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటున్నాను. మా నాన్నగారు హీరోగా నటించిన  ‘షావుకారు’తోనే ఆమె షావుకారు జానకిగా సుప్రసిద్ధులయ్యారు. మా బ్యానర్లో పలు చిత్రాల్లో నటించారు.  ‘రామ్‌ – రహీమ్, వేములవాడ భీమకవి’ చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది.  
– బాలకృష్ణ

→ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకిగారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు.      
– పవన్‌ కళ్యాణ్‌

→ దిగ్గజ నటి షావుకారు జానకిగారి మరణం ఎంతో బాధాకరం. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ నిలిచిపోతాయి. ఆమెది ఎంత గొప్ప వ్యక్తిత్వమో నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలి.                 
– మంచు విష్ణు  

→ జానకమ్మగారితో కలిసి పని చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. బలమైన భావాలున్న మనిషి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఓ లెజెండ్‌.     
– రాధిక

→ దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కన్నడ, తమిళ, తెలుగు పరిశ్రమలలో ప్రేక్షకులను అలరించి, అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు జానకిగారు. ఆమె నిష్క్రమణతో సినిమా రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది.                       
– సుమలత అంబరీష్‌

→ ఇండియన్  సినిమా గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ.. అత్యంత వృత్తి నైపుణ్యంగల కళాకారిణి అయిన జానకి గారితో కలిసి పని చేయడం నా అదృష్టం. ఆమె తన మాటల్లో ఎంతటి స్పష్టత, పరిపూర్ణతను ప్రదర్శించేవారో, తన పనులను కూడా అంతే అద్భుతంగా చేస్తూనే మాకు కథలు చెప్పేవారు, వంట చేసి వడ్డించేవారు. çముక్కుసూటిగా మాట్లాడేవారు.  అమ్మా, మీ ప్రయాణంలో ఒక చిన్న భాగాన్ని పంచుకునే భాగ్యం మాకు కలిగింది. వీడ్కోలు.                 
– నందినీ రెడ్డి

– సినిమా డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement