ప్రముఖ చిత్రకారుడు జోగెన్‌ చౌదరి కన్నుమూత  | Artist and former Rajya Sabha MP Jogen Chowdhury passes away | Sakshi
Sakshi News home page

ప్రముఖ చిత్రకారుడు జోగెన్‌ చౌదరి కన్నుమూత 

Oct 26 2026 2:12 AM | Updated on Oct 26 2026 2:12 AM

Artist and former Rajya Sabha MP Jogen Chowdhury passes away

కోల్‌కతా: ప్రముఖ చిత్రకారుడు, రాజ్యసభ మాజీ ఎంపీ జోగెన్‌ చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన.. అక్టోబర్‌ 16న ఇన్ఫెక్షన్‌ కారణంగా కోల్‌కతాలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారతీయ కళా రంగానికి తీరని లోటని, ఆయన కళాఖండాలు శాతాబ్దాలపాటు నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. 

తల్లి ముగ్గుల ప్రేరణతో..  
జోగెన్‌ చౌదరి 1939 ఫిబ్రవరి 16న, అప్పటి అవిభక్త బెంగాల్‌లోని ఫరీద్‌పూర్‌లో జన్మించారు. బెంగాలీ సాంప్రదాయ చిత్రకళ, ముగ్గుల్లో ఒకరకమైన ‘అల్పన’లో నైపుణ్యం కలిగిన తన తల్లి ప్రభావంతో చిన్న వయసులోనే కళపై ఆసక్తిని పెంచుకున్నారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం కోల్‌కతాకు వచ్చింది. అక్కడి ’గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌’లో చదువుకుని, హౌరా జిల్లా పాఠశాలలో ఆర్ట్‌ టీచర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1960ల చివరలో పారిస్‌ వెళ్లి ఎకోల్‌ నేషనల్‌ సుపీరియర్‌ డెస్‌ బ్యూక్స్‌–ఆర్ట్స్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 

భారత్, యూరప్‌ కళా ఉద్యమాల ప్రేరణతో భారత్‌కు తిరిగొచ్చాక విలక్షణమైన సొంత శైలిని సృష్టించుకున్నారు. 1962లో కలకత్తా హ్యాండ్లూమ్‌ బోర్డులో డిజైనర్‌గా చేరారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని కళాభవన్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. ఆయనకు శాంతినికేతన్‌లో ఒక ఇల్లు కూడా ఉండేది. అక్కడి ఎర్రమట్టి, ప్రకృతి ఆయన కళాకృతులకు మరింత స్ఫూర్తినిచ్చాయి. 2001లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కాళిదాస్‌ సమ్మాన్‌ అందుకున్నారు. ఆయన కళా సేవకు గుర్తింపుగా బెంగాల్‌ ప్రభుత్వం 2012లో రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన బంగా బిభూషణ్‌ను ఇచ్చి గౌరవించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement