సాంకేతికతలో వేగంగా వస్తున్న మార్పులు వయోవృద్ధులలో చాలామందికి తెలియడం లేదు. సరికొత్త గ్యాడ్జెట్లు, మొబైల్ అప్లికేషన్‌లు, కొత్త స్మార్ట్‌ఫోన్‌లు... మొదలైనవి తమకు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా మారింది. ఈ ప్రతికూలత వృద్ధులను మెయిన్ స్ట్రీమ్‌కు దూరం చేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘హెల్ప్‌ఏజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వృద్ధులను ఆన్‌లైన్ ప్రపంచంలోకి తీసుకురావడంతోపాటు అక్కడ సురక్షితంగా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా చెబుతోంది.
ప్రాజెక్ట్ సురక్షిత్
వృద్ధుల కోసం ‘హెల్ప్ ఏజ్’ సంస్థ దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. జీవనోపాధి మార్గాలకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు గ్రామీణ భారతదేశంలోని వృద్ధులకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘హెల్ప్‌ఏజ్’ గ్రామీణ ప్రాంతాలలోని వృద్ధుల కోసం డిజిటల్ సాధికారత కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ మోసాలు, స్కామ్‌ల నుండి వృద్ధులను రక్షించడానికి ‘హెల్ప్ ఏజ్’ సంస్థ ‘ప్రాజెక్ట్ సురక్షిత్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ భద్రతా నైపుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తరాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ‘డిజిటల్ గురుకుల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులే డిజిటల్ గురువులై వృద్ధులకు శిక్షణ ఇస్తారు.
సులువైన లక్ష్యాలుగా...
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్‌లు, నకిలీ కేవైసీ అప్‌డేట్‌లు, బ్యాంక్‌ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అని చెప్పే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించి అన్ని వయసుల వారు బాధితులుగా ఉన్నప్పటికీ తక్కువ డిజిటల్ అక్షరాస్యత కారణంగా వృద్ధులు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారు.
డిజిటల్ మోసాల వల్ల ఆర్థిక నష్టాలే కాదు తీవ్రమైన మానసిక క్షోభకూ గురవుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. మోసాలను నివారించే తొలి అడుగు అవగాహన. మోసాలను ఎలా గుర్తించాలి, సమాచారాన్ని ఎలా ధ్రువీకరించుకోవాలి, అనుమానాస్పద ఫోన్ సంభాషణలకు సురక్షితంగా ఎలా స్పందించాలి... మొదలైన విషయాలను వృద్ధులకు నేర్పించే లెర్నింగ్ మాడ్యూల్స్‌లో ఏజ్–టెక్ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడి పెడుతున్నాయి. రోజువారీ డిజిటల్ లావాదేవీలలో భద్రతను పెంపొందిస్తున్నాయి.
సులువుగా... సౌకర్యంగా...
సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్, బయోమెట్రిక్ సెక్యూరిటీ, రియల్–టైమ్ అలర్ట్‌లు, అథెంటికేషన్‌లాంటి ఫీచర్‌లు వయోవృద్ధులకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కాపాడుతున్నాయి. వయోవృద్ధులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సౌకర్యంగా ఉండడానికి వీలైన డిజైన్‌లపై దృష్టి పెడుతున్నాయి టెక్ కంపెనీలు. ఉదాహరణకు... చదవడానికి స్పష్టమైన, సులభంగా ఉండే ఫాంట్‌లు, సహజ నావిగేషన్, వాయిస్ కమాండ్ వంటి ఫీచర్లు.
‘ఏజ్–టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఈ డిజిటల్ యుగంలో నివసిస్తున్న వృద్ధులను మోసాల బారిన పడకుండా కాపాడడమే కాదు వారి జ్ఞానాన్ని విస్తరిస్తున్నాయి. భద్రతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నాయి..
ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్
టెక్నాలజీ అనేది వయోవృద్ధులకు సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను అందిస్తోంది. డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సులభతరం చేశాయి. పెట్టుబడులకు సంబంధించి ఈ ప్లాట్‌ఫామ్‌లు సమగ్రమైన సమాచారాన్ని, సులభంగా ఉపయోగించుకోగల ఇంటర్‌ఫేస్‌లను అందిస్తున్నాయి.
హెల్తీ గ్యాడ్జెట్స్
వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని రకరకాల గ్యాడ్జెట్‌లను రూపొందిస్తున్నాయి టెక్ కంపెనీలు. ఎస్‌వోఎస్ హెచ్చరికలతో కూడిన స్మార్ట్ వాకింగ్í Ü్టక్‌ల నుండి ఇంట్లో శారీరక శ్రమను తగ్గించే రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ల వరకు వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. ఆరోగ్యంపై దృష్టి సారింటచే వేరబుల్స్, వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్‌లు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దినచర్యలను స్వతంత్రంగా నిర్వహించుకోవడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్‌లలో చాలా వరకు మన దేశంలోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్‌ల ద్వారా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.
వయసు పైబడడం అంటే ఒంటరితనానికి దగ్గర కావడం కాదు. గతంలో కంటే వంద రెట్లు ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయడం. ఆ ఉత్సాహం ఉండాలంటే... యాక్టివ్ లైఫ్‌స్టైల్ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో సాంకేతికతకు దగ్గర కావడం కూడా ఒకటి. ఏ కొద్దిమందికో తప్ప చాలామంది వృద్ధులకు సాంకేతికత చాలా దూరంగా ఉంది. ‘డిజిటల్ నిరక్షరాస్యత’ వల్ల వృద్ధులు ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధునిక సాంకేతికతను వయో వృద్ధులకు దగ్గరచేసే కార్యక్రమాలు చేపడుతున్నాయి...


