కొన్ని జీవితాలు సినిమాటిక్‌గా ఉంటాయి.. మరికొన్ని జీవితాలే ఓ కథగా మారుతాయి. బ్రిటన్ ప్రముఖ రచయిత జెఫ్రీ ఆర్చర్ జీవితం రెండో కోవకు చెందుతుంది. రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే ఎంపీగా అడుగుపెట్టి.. సెక్స్ స్కాండల్‌తో కెరీర్ దెబ్బతిని.. జైలుకెళ్లి.. చివరికి ఆ జైలు జీవితం నుంచే ప్రపంచాన్ని తన కథలతో కట్టిపడేసిన స్టార్ రైటర్‌గా ఎదిగారు. అలాంటి రచయిత చివరికి తన చివరి నవల విడుదలకు ఒక్కరోజు ముందు కన్నుమూశారు.
దిగ్గజ నవలా రచయిత జెఫ్రీ ఆర్చర్ (jeffrey archer) సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. ఇంట్లో రచనా పనిలో ఉండగానే “అకస్మాత్తుగా, ప్రశాంతంగా” మృతి చెందినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ తెలిపింది. ఆయన నవల అడమ్ అండ్ ఈవ్ అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఈలోపే మహా కథకుడి ప్రయాణం ముగియడంతో.. సాహిత్య ప్రపంచం విషాదంలో మునిగింది.
అప్పుడు జెఫ్రీ ఆర్చర్ వయసు 29 సంవత్సరాలు. బ్రిటన్ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన లౌత్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అప్పటికే అతనిలో రాజకీయ నాయకుడి కంటే పెద్ద లక్ష్యాలు కనిపించేవి. ప్రసంగాలు, పరిచయాలు, నిధుల సేకరణలో ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ రాజకీయ జీవితం ఎక్కువకాలం సాగలేదు. కెనడాకు చెందిన ఓ పారిశ్రామిక కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు దివాళా అంచుకు చేరుకున్నారు. చివరకు 1974లో పార్లమెంట్‌ను వీడాల్సి వచ్చింది. అక్కడితో కథ ముగిసిపోయి ఉంటే.. జెఫ్రీ ఆర్చర్ పేరు ఇవాళ ఎవరికీ తెలియకపోయేదేమో.

డబ్బుల్లేవు.. అప్పులు మాత్రం భారీగా
ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. రాయాలి. తన అప్పులు తీర్చుకోవడానికి రచయితగా మారారు. 1976లో వచ్చిన తొలి నవల నాట్ ఏ పెన్నీ మోర్.. నాట్ ఏ పెన్నీ లెస్ Not a Penny More, Not a Penny Less ఆయన జీవితాన్నే మలుపుతిప్పింది. విమర్శకులు పెద్దగా పట్టించుకోకపోయినా పాఠకులు మాత్రం పట్టించుకున్నారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.

ఆ తర్వాత వచ్చిన కేన్ అండ్ ఎబెల్(Kane & Abel) ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఇద్దరు వ్యక్తులు.. రెండు భిన్న ప్రపంచాలు.. డబ్బు, అధికారం, ఆశయం, ప్రతీకారం.. ఆర్చర్ కథల్లో కనిపించే ఈ అంశాలన్నీ పాఠకులను కట్టిపడేశాయి. కాలక్రమంలో ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ఆయన రచనలు 47కుపైగా భాషల్లో, 100కుపైగా దేశాల్లో పాఠకులను చేరుకున్నాయి.
రచయితగా ఎదిగినకొద్దీ.. రాజకీయ ఆశలు కూడా
ఆర్చర్ రాజకీయాలను పూర్తిగా వదిలేయలేదు. 1980లలో మళ్లీ కన్జర్వేటివ్ పార్టీలో కీలకంగా ఎదిగారు. 1985లో అప్పటి ప్రధాని మార్గరెట్ థాచర్ ఆయనను పార్టీ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఒకప్పుడు ఆర్థికంగా కుప్పకూలిన వ్యక్తి.. ఇప్పుడు అధికార పార్టీలో అగ్రస్థానానికి చేరువయ్యారు. కానీ ఈసారి సమస్య డబ్బు కాదు.
ఒక మహిళతో సంబంధానికి సంబంధించిన ఆరోపణ ఆయన రాజకీయ జీవితాన్ని మరోసారి కుదిపేశాయి. డైలీ స్టార్ పత్రికపై పరువు నష్టం దావా వేసి భారీ మొత్తంలో పరిహారం కూడా గెలుచుకున్నారు. ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే కొన్నేళ్ల తర్వాత అదే వ్యవహారం ఆయన జీవితంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారింది.
లండన్ మేయర్ కల, కానీ..
1990ల చివర్లో జెఫ్రీ ఆర్చర్ లక్ష్యం మరింత పెద్దదైంది. లండన్ తొలి ఎన్నికైన మేయర్ కావాలి. 1999లో కన్జర్వేటివ్ పార్టీ ఆయనను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాజకీయంగా తిరిగి పుంజుకున్నానని అనుకుంటున్న సమయంలో పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 1987లో డైలీ స్టార్‌పై వేసిన పరువు నష్టం కేసులో తనకు అనుకూలంగా తప్పుడు అలీబీ సృష్టించేందుకు స్నేహితుడిని ఉపయోగించుకున్నారన్న విషయం బయటపడింది. ఇక రాజకీయ పునరాగమనం అక్కడితో ఆగిపోయింది.

కోర్టులో అబద్ధం.. జైలు
2001లో జెఫ్రీ ఆర్చర్ పర్జరీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి కుట్ర చేసిన నేరాల్లో దోషిగా తేలారు. ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2003లో పెరోల్‌పై విడుదలయ్యారు. సుమారు రెండేళ్లు జైలులో గడిపారు. ఇక్కడే ఆర్చర్ జీవితంలో మరో అసాధారణ అధ్యాయం మొదలైంది. జైలులో కూడా రాశారు.
తన జైలు అనుభవాలనే ఏ ప్రిజన్ డైరీ(A Prison Diary)గా మూడు భాగాలుగా(.. Hell, Purgatory, Heaven) రాశారు. అంటే.. ఒకప్పుడు తన కథల్లో జైలు, కోర్టు, రాజకీయాలు, కుట్రలు రాసిన రచయిత.. ఇప్పుడు వాటినే స్వయంగా అనుభవించి రాశారు.
జైలు అతన్ని ఆపలేదు
సాధారణంగా ఇలాంటి కుంభకోణం తర్వాత ఒక ప్రజా వ్యక్తి పేరు కనుమరుగవుతుంది. ఆర్చర్ విషయంలో అలా జరగలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాయడం కొనసాగించారు. A Prisoner of Birth, Paths of Glory, The Clifton Chronicles, William Warwick సిరీస్ వంటి రచనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు ఆయన వెంట నడిచారు. ఆయన జీవితంలోని ఓ విచిత్రమైన విషయం ఏమిటంటే.. తనను కూల్చిన అనుభవాలనే కథలుగా మార్చుకుని మళ్లీ పాఠకుల ముందుకు రావడం. ఆర్థిక పతనం ఆయనకు తొలి నవలను ఇచ్చింది. రాజకీయాలు ఆయనకు పాత్రలను ఇచ్చాయి. కోర్టు, జైలు ఆయనకు మరో ప్రపంచాన్ని ఇచ్చాయి.
భార్య మేరీ.. ప్రతి మలుపులోనూ తోడుగా
జెఫ్రీ ఆర్చర్ జీవితంలో మరో ముఖ్యమైన పాత్ర ఆయన భార్య డేమ్ మేరీ ఆర్చర్‌ది. భర్త ఎదుర్కొన్న రాజకీయ ఆరోపణలు, కోర్టు కేసులు, జైలు.. అన్నింటి మధ్యా ఆమె ఆయనకు అండగా నిలిచారు. శాస్త్రవేత్త అయిన మేరీ ఆర్చర్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ చాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు. ఆర్చర్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నప్పటికీ.. కుటుంబ జీవితం పూర్తిగా విచ్ఛిన్నం కాలేదు.

30 కోట్లకు పైగా.. ఒక విచిత్రమైన రికార్డు
ఆర్చర్ గురించి చెప్పేటప్పుడు ఒక సంఖ్య తప్పక చెప్పాలి. 300 మిలియన్లకు(30 కోట్లకు) పైగా. అంతటి స్థాయిలో పుస్తకాలు అమ్ముడైన రచయిత ఆయన. అంతేకాదు.. ఆయన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఫిక్షన్, షార్ట్ స్టోరీస్, నాన్-ఫిక్షన్ మూడు విభాగాల్లోనూ నంబర్ వన్ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచిన ఏకైక రచయితగా ఆయన రికార్డు పేర్కొంటారు. అతని కథల్లో వేగం ఉంటుంది. మలుపులు ఉంటాయి. అధికారాన్ని కోరుకునే వ్యక్తులు ఉంటారు. డబ్బు కోసం పోరాటం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ద్రోహం ఉంటుంది. విచిత్రమేమిటంటే.. ఆయన స్వయంగా అలాంటి కథలో ప్రధాన పాత్రలా జీవించారు.
86 ఏళ్ల వయసులోనూ.. రాయడం ఆపలేదు
జెఫ్రీ ఆర్చర్ చివరి దశ వరకు రచన కొనసాగించారు. Adam & Eveను తన చివరి నవలగా ప్రకటించారు. 50 ఏళ్ల కథా రచనా ప్రయాణానికి ముగింపు పలుకుతున్నానని స్వయంగా చెప్పారు. ఈ నవల అక్టోబర్ 6న విడుదల కావాల్సి ఉంది(అయ్యింది కూడా).
నవల కథ కూడా ఆయనకు ఇష్టమైన భారీ కాన్వాస్‌లోనే సాగుతుంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు. ఒకరు కౌంట్ కుమార్తె, మరొకరు గొర్రెల కాపరి కుమారుడు. వారి జీవితాలు, ప్రేమ, రెండో ప్రపంచ యుద్ధం.. కథ ముందుకు సాగుతుంది. ఇక ఆ పుస్తకం విడుదలకు ఒక్కరోజు ముందు.. జెఫ్రీ ఆర్చర్ చనిపోయారు. ఇంతకంటే విచిత్రమైన ముగింపు ఒక రచయిత జీవితానికి దొరకడం కష్టం.

భారత్‌లోనూ జెఫ్రీ ఆర్చర్‌కు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ‘కేన్ అండ్ ఏబెల్’, ‘నాట్ ఎ పెన్నీ మోర్, నాట్ ఎ పెన్నీ లెస్’, ‘ది క్లిఫ్టన్ క్రానికల్స్’ వంటి రచనలు ఇక్కడ విశేష ఆదరణ పొందాయి. 2019లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయనను వినేందుకు ఏకంగా 7,500 మంది తరలివచ్చారు. భారతీయులు, తాను సహజమైన స్నేహితుల్లాంటివారమని ఆర్చర్ చెప్పేవారు. ఆయన పుస్తకాలకు ఉన్న డిమాండ్ కారణంగా కొన్ని సందర్భాల్లో బ్రిటన్ కంటే ముందే భారత్‌లో విడుదల చేసేవారు. ‘క్లిఫ్టన్ క్రానికల్స్’లో భారత్ నేపథ్యం, భారతీయ పాత్రలు కనిపించడంతోపాటు.. ఆర్.కె. నారాయణ్ రచనలను కూడా ఆయన అభిమానించేవారు. అందుకే భారత్ ఆయనకు కేవలం ఓ మార్కెట్ కాదు.. ప్రత్యేకమైన పాఠకుల ప్రపంచం.
::వెబ్‌డెస్క్ ప్రత్యేకం


