ఎన్విడియా సీఈఓ జాకెట్‌ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర | Nvidia CEO Jensen Huang Black Leather Jacket Sells $960000 Auction | Sakshi
Sakshi News home page

ఎన్విడియా సీఈఓ జాకెట్‌ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర

Jul 18 2026 8:19 AM | Updated on Jul 18 2026 8:49 AM

Nvidia CEO Jensen Huang Black Leather Jacket Sells $960000 Auction

ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సెన్ హువాంగ్ ధరించిన సిగ్నేచర్ నల్లటి టామ్ ఫోర్డ్ (Tom Ford) లెదర్ జాకెట్ వేలంలో సంచలన ధర పలికింది. న్యూయార్క్‌లో ప్రముఖ వేలంపాట సంస్థ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఈ జాకెట్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ.9.2 కోట్లు)కు అమ్ముడైంది. ఇది ముందుగా అంచనా వేసిన 40,000–60,000 డాలర్ల విలువ కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.

సోథెబీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాకెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 మంది పోటీపడ్డారు. సంస్థ ఆధునిక కలెక్టిబుల్స్ విభాగం అధిపతి బ్రహ్మ్ వాచ్టర్ దీన్ని "ఏఐ యుగాన్ని నిర్వచించిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరితో అత్యంత సన్నిహితంగా ముడిపడిన అరుదైన స్మారక వస్తువు"గా అభివర్ణించారు.

జెన్సెన్ హువాంగ్ నల్లటి లెదర్ జాకెట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి నల్లటి టర్టిల్‌నెక్ స్వెటర్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కి బూడిదరంగు టీ-షర్టు ఎలాగో హువాంగ్‌కు ఈ బ్లాక్‌ జాకెట్‌ అలాగే. ఆయన 
దాదాపు ప్రతి కీలక ఉత్పత్తి ఆవిష్కరణ, డెవలపర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ వేదికలపై ఇదే తరహా జాకెట్‌లో కనిపిస్తుంటారు. 2021లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపైనా ఇదే నలుపు జాకెట్‌తో మెరిశారు. వేలానికి వచ్చిన జాకెట్‌ను ఆయన 2023 అక్టోబర్‌లో తైవాన్‌లో జరిగిన హాన్ హై (ఫాక్స్‌కాన్) టెక్ డే కార్యక్రమంలో ధరించినదేనని ఫోటో మ్యాచింగ్ ద్వారా ధ్రువీకరించారు. జాకెట్‌పై హువాంగ్ సంతకాన్ని కూడా నిపుణులు ప్రామాణికంగా నిర్ధారించారు.

ఎన్విడియా నాయకత్వంలో జెన్సెన్ హువాంగ్ కంపెనీని కృత్రిమ మేధ (AI) విప్లవానికి కేంద్రబిందువుగా నిలబెట్టారు. ఏఐ చిప్‌లకు పెరిగిన భారీ డిమాండ్‌తో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ కంపెనీగా ఎదిగింది.

ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎడ్జ్ ఇన్‌స్టిట్యూట్ అనే లాభాపేక్షలేని సంస్థకు అందజేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞానం, విద్య రంగాల్లో యువ ఆవిష్కర్తలకు ఫెలోషిప్‌లు, గ్రాంట్లు, పరిశోధన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement