దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే.. | She Took Jewellery to Hospital for Safety A Stray Dog Had Other Plans | Sakshi
Sakshi News home page

దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..

Aug 26 2026 10:54 AM | Updated on Aug 26 2026 11:29 AM

She Took Jewellery to Hospital for Safety A Stray Dog Had Other Plans

ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్‌కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.

సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్‌ అయ్యారు. 

సర్జికల్‌ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్‌ ట్రాకింగ్‌ ఆపరేషన్‌’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. 

ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్‌ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్‌ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.

 ఇదీ చదవండి: వైరల్‌ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement