నటి కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై విమర్శలు రావడంతో ఆమెకు రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటూ ‘స్మాష్ ద ప్యాట్రియార్కీ’ (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. దీనిపై మరో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో.. బ్రో.. కాస్త ఆగండి. భారత్ ‘మాతా’ కీ జై.. ప్రారంభిద్దాం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాతా(తల్లి)ని హైలైట్ చేస్తూ.. రాహుల్‌కు కంగనా వెటకారంగా కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఓ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై మొదలైన వివాదం.. రాహుల్ జోక్యంతో రాజకీయ చర్చగా మారగా, కంగనా తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారింది.

రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. అందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. కృతి ధరించిన దుస్తులు, ప్రకటనలో పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ‘ఇంటెన్షనల్లీ క్రీపీ’(ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికరంగా చూపించారు)గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కంగనా–కృతి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదన మొదలైంది.

తనపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆమె ధరించే దుస్తులతోనే ఎందుకు అంచనా వేయాలని ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా వాటి వెనుక ఉన్న అనుబంధం, విలువల్లో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. అలాగే కుక్కకు రాఖీ కట్టడంపైనా స్పందిస్తూ.. రక్షాబంధన్ తమ కుటుంబంలో సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ప్రేమకు ప్రతీక అని కృతి వివరించారు. తన సోదరి, తాను ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటామని.. ఆ బంధంలో సోదరుడు మాత్రమే రక్షించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
కృతి స్పందనను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఎంపిక. తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ‘Smash the Patriarchy’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు.
ఇక్కడే ఎంట్రీ ఇచ్చిన కంగనా
రాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే కంగనా తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ‘భారత్ మాతాకీ జై.. ప్రారంభిద్దాం’ అని పేర్కొనడం ద్వారా రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: అన్నాచెల్లెళ్ల ఆలయంలో.. రాఖీ వేడుకలు


