జంట హత్యల కేసు సుదీర్ఘ విచారణ
1981లో నేరం, ఆరుగురిపై కేసు
ఛార్జ్‌షిట్‌కు ముందే ఇద్దరి మరణం
12 ఏళ్ల తరువాత శిక్ష ఖరారు, హైకోర్టులో అప్పీల్
అప్పీల్ 20 ఏళ్లు పెండింగ్, ముగ్గురు నిందితుల మరణం
మిగిలిన ఏకైక నిందితుడి శిక్ష నిలిపివేసిన సుప్రీం
కేసు తేలేందుకు 45 ఏళ్లు పట్టడం న్యాయ వ్యవస్థ వైఫల్యమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ‘‘కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడు’’అంటారు. దేశంలో కోర్టు కేసులు తేలేందుకు ఏళ్లు పూళ్లవుతున్న నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ నానుడి తాజాగా ఇంకోసారి రుజువైంది. జంట హత్యల కేసులో ఓ వ్యక్తి యాభై ఏళ్లుగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిపై దేశ అత్యున్నత న్యాయస్థానమూ చలించిపోయింది. డెబ్ఫై ఏళ్ల ఆ నిందితుడు సైమన్ సోరేన్ శిక్షను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం’’ఈ ఉదంతమని జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
ఇరవై ఏళ్లుగా ఈ కేసును తేల్చని జార్ఖండ్ హైకోర్టు తీరును కూడా న్యాయమూర్తులు ఆక్షేపించారు. కోర్టులో వినిపించిన వాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యల ప్రకారం... 1981, అక్టోబర్ 18న బిభూతి, బనార్సీ, క్షీర్‌సాగర్ మండల్‌లు, మేనల్లుళ్లు జగదీశ్, సత్యనారాయణ్‌లతో కలిసి వరి కోతల కోసం దుమ్కా జిల్లాలోని భురుండియా గ్రామానికి వెళ్లారు. అదేరోజు కొంతమంది సంతాల్ గిరిజనులు డప్పులు కొడుతూ విల్లు, బాణాలతో, గొడ్డళ్లతో మండల్ కుటుంబీకులు పనిచేస్తున్న పొలాల వద్దకు వచ్చారు. ఈ గిరిజనులు మండల్ కుటుంబ సభ్యులను చంపాలంటూ పిలుపునిచ్చారు. పారిపోతూండగా వెంటబడ్డ జేథున్ సోరేన్, సైమన్ సొరేన్ పేరున్న గిరిజనులు బిభూతి మండల్, బనార్సీ మండల్‌లపై బాణాలతో దాడి చేశారు.
ఆ తరువాత బిభూతి, బనార్సీ మండల్‌లు ఇద్దరూ కిందపడిపోగా జెథున్, సైమన్‌లు వారిని నరికి చంపారని ప్రత్యక్ష సాక్షులు జగదీశ్, సత్యనారాయణలు తెలిపారు. ఈ ఘర్షణ, జంట హత్యలపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు గిరిజనులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అభియోగాలు నమోదు చేయకముందే ఇద్దరు నిందితులు మరణించారు. ఆ తరువాత విచారన పూర్తయ్యేందుకు ఏకంగా పన్నెండేళ్లు పట్టింది. 1991లో ఛార్జ్‌షిట్ నమోదైతే 2002లో శిక్షలు ఖరారయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ కేసు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ఐదుసార్లు బదిలీ అయింది. నిందితులు కొందరు ఆరేళ్లపాటు పరారీలో ఉండటమూ తోడై విచారణలో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే ఈ పన్నెండేళ్లను మినహాయిస్తే మిగిలిన సమయంలోనైనా కేసు విచారణ ఎందుకు ఒక కొలిక్కి రాలేదన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
విచారణ పూర్తయిన తరువాత ట్రయల్ కోర్టు 2002లో జీవించి ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షగా విధించింది. నిందితులు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు కానీ.. కేసు అక్కడ పెండింగ్‌లో ఉండగానే ముగ్గురు మరణించారు. దీంతో సైమన్ సోరేన్ ఒక్కడే మిగిలిపోయాడు. సుమారు 22 ఏళ్ల తరువాత జార్ఖండ్ హైకోర్టు 2024 అక్టోబరు 28న సైమన్ సోరేన్ అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్‌కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. అప్పటికి సోరేన్ వయసు దాదాపు డెబ్భై ఏళ్లు! అనేక అనారోగ్యాలతో బాధపడుతూ జైలు ఆసుపత్రిలో చికిత్స
పొందుతున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీలోకి వెళ్లారు.
కస్టడీలో రెండేళ్లు మాత్రమే
సైమన్ సోరేన్‌కు శిక్ష ఖరారైన తరువాత కస్టడీలో ఉన్నది కేవలం రెండేళ్ల నాలుగు నెలలు, 12 రోజులు మాత్రమేనని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు 19న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్‌ల ధర్మాసనం తుది తీర్పునిస్తూ... దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని’’ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. నేరానికి శిక్ష పడేందుకు విచారణ పేరుతో 22 ఏళ్లు పడితే.. అప్పీళ్లలో ఇంకో 22 ఏళ్లు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. సైమన్ సోరెన్ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరానికి పాల్పడకూడదనే షరతుతో, వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెపె్టంబరు 18కి వాయిదా వేసింది.


