‘రాఖీ’ వీడియోపై కృతిసనన్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాఖీ కట్టే సమయంలో సంప్రదాయేతర దుస్తులు ధరించిందంటూ నటి కృతి సనన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ’లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికెళ్లాలి అనేవి ఆమె సొంత ప్రాధమ్యాలు. స్వేచ్ఛగా నచ్చిన పని చేసే మహిళల్ని వేధించడం, ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి.
పితృస్వామ్య భావజాలం నశించాలి’’అని రాహుల్ అన్నారు. ఒక వజ్రాభరణాల సంస్థకు సంబంధించిన 36 సెకన్ల వాణిజ్య ప్రకటన వీడియోలో తన సోదరునికి రాఖీ కట్టే సమయంలో కృతిసనన్ ధరించిన డ్రెస్ మరీ కురచగా ఉందంటూ బీజేపీ మహిళా ఎంపీ కంగనా రనౌత్ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై కృతిసనన్ తనదైన రీతిలో దీటుగా బదులిచ్చింది. సంస్కృతి, సంప్రదాయం అనేవి మనసులో ఉంటాయి. మెడ దగ్గర ఉండవు. ఇకనైనా మహిళలు ఈ దుస్తులే ధరించాలని చెప్పే సంస్కృతి ఎప్పుడు పోతుందో? అని ఆమె అసహనం వ్యక్తంచేశారు.
‘‘సంప్రదాయక వస్త్రధారణలో శతాబ్దాల్లో ఎంతో మార్పు వచ్చింది. కానీ మన సంప్రదాయాలకు మహిళ ఏపాటి విలువ ఇస్తుందనేది ఆమె దుస్తులను చూసే లెక్కించడం బాధాకరం. పండగల అంతరార్థం మహిళ ధరించే దుస్తుల్లో ఉండదు. సంప్రదాయాలను పట్టి ఉంచే భావోద్వేగాల్లో ఉంటుంది. నా సోదరి, నేను కూడా రాఖీ కట్టుకుంటాం. సోదరుడి కంటే ఎక్కువగా ఒకరికొకరు మేం రక్షించుకుంటాం’’ అని ఆమె అన్నారు.


