జనాభా లెక్కల ప్రశ్నావళిని రద్దు చేయాలి
రాజకీయ పక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలి
ఆ తర్వాతే కొత్త విధానాన్నఖరారు చేయాలి
ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ
కచ్చితమైన వివరాల కోసం ‘డ్రాప్–డౌన్’ పద్ధతి అమలు చేయాలని సూచన
తెలంగాణ, బిహార్ విధానాలను అనుసరించాలని వెల్లడి
తప్పుడు డేటాతో ఓబీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ (స్వేచ్ఛగా కులం పేరును నమోదు చేసే) విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాలు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారు.
తప్పుడు డేటాకు ఆస్కారం
జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఎలాంటి కచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ‘ఓపెన్–ఎండెడ్’ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్‌లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేర్వేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుందని తేల్చిచెప్పారు.
‘డ్రాప్–డౌన్’ జాబితాయే పరిష్కారం
ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా ‘డ్రాప్–డౌన్’జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే, రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జన గణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎస్‌ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్–డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనల్లో ఈ డ్రాప్–డౌన్ విధానాన్నే అనుసరించారని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితా కాపీలను ప్రధానికి రాసిన లేఖకు
జతచేశారు.
ప్రశ్నావళిలో ‘వెనుకబడిన తరగతి’ పదం ఏదీ?
కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రశ్నావళిలో కనీసం ’వెనుకబడిన తరగతి’అనే పదం కూడా లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే అత్యంత నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే..
కులగణన కచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే, రాహుల్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మండల్ కమిషన్ దేశంలో 3,743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 42 శాతం, ఇతరులు 27 శాతం ఉన్నారు.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్)–2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 46 శాతం, ఇతరులు 24 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఓపెన్ ఫార్మాట్’విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ తప్పులతడకగా మారిపోయే ముప్పు ఉందని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి, కుల గణన ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.


