లోక్‌సభ స్పీకర్‌కూ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డ సుప్రీంకోర్టు
సొలిసిటర్ జనరల్ హామీతో వెనక్కి తగ్గిన న్యాయమూర్తులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు లేవదీసి తర్వాత మరో పార్టీకి మద్దతు ప్రకటించిన 20 మంది ఎంపీలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని సవాల్ చేస్తూ టీఎంపీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడానికి ధర్మాసనం సిద్ధపడింది. అయితే స్పీకర్ తరఫున తాను కోర్టులో వాదనలు విన్పిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇవ్వడంతో నోటీసులు ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని ధర్మాసనం ఉపసంహరించుకుంది.
‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా మేము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. కానీ, నిర్ణిత కాలవ్యవధిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి అయ్యేలా చూడటమే మా ప్రధాన ఉద్దేశం’’అని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ అన్నారు. తిరుగుబావుటా ఎగరేసిన 20 మంది నేతలు టీఎంసీ టికెట్‌పై గెలుపొందారు. టీఎంసీ అధికారం కోల్పోగానే ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తెల్సిందే.


