మెటాకు మరమ్మత్తు! | Sakshi Editorial On Meta | Sakshi
Sakshi News home page

మెటాకు మరమ్మత్తు!

Sep 1 2026 1:16 AM | Updated on Sep 1 2026 1:16 AM

Sakshi Editorial On Meta

సామాజిక మాధ్యమ టెక్‌ కంపెనీల్లో అగ్రభాగాన వున్న మెటా సంస్థ తనపై న్యాయ స్థానంలో దాఖలైన కేసుల్లో రాజీకొచ్చి 1,800 కోట్ల డాలర్లు చెల్లించటానికి అంగీకరించటం కీలకమైన పరిణామం. దీంతో గత నెల 18న ఓక్‌లాండ్‌ న్యాయస్థానంలో మొదలైన విచారణ అసంపూర్ణంగా నిలిచి పోయినట్టయింది. అదే జరిగుంటే మెటా చీఫ్‌ మార్క్‌ జూకర్‌బర్గ్‌ కోర్టు బోనెక్కి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పిల్లలకూ, టీనేజర్లకూ హాని కలిగించే విధానాలను అవలంబిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. న్యాయవాదులు ఒక్కో ఉదంతమే వివరించి, ఆ సంస్థలు పసిమనసుల్ని ఎంత కలుషితం చేశాయో సోదాహరణంగా వివరిస్తూ, నిలదీస్తుంటే ఆయనకు ముచ్చెమటలు పట్టేవి. అమెరికాలోని 48 రాష్ట్రాలు, కొలంబియా జిల్లా, మరో మూడు ప్రాంతాలూ ఈ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఇంతవరకూ వచ్చిన తీర్పుల్ని చూస్తే కోర్టు వెలుపల కుదిరిన ఈ రాజీ ఒప్పందం పర్యవసానంగా మెటా చెల్లించవలసిన మొత్తం చాలా పెద్దగానే కనబడుతుంది. భద్రత విషయంలో పక్కదోవపట్టించిన కేసులో న్యూమెక్సికో న్యాయస్థానం ఆదేశించిన 37.5 కోట్ల డాలర్ల పరిహారమే ఇంత వరకూ అతి పెద్ద మొత్తం. 

అయితే దాదాపు లక్షన్నర కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువగల మెటా సంస్థ నిరుటి వార్షికాదాయం 20,097 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఏటా ఈ ఆదాయం 24 శాతం వరకూ పెరుగుతోంది. ఇప్పుడు చెల్లించదల్చుకున్న మొత్తానికి కూడా బోలెడు మెలికలున్నాయి. వచ్చే పదేళ్లకాల వ్యవధిలో ఈ పరిహారం చెల్లిస్తుందట. ఈ వాయిదాలను 15 శాతం డిస్కౌంట్‌తో లెక్కిస్తే ప్రస్తుత విలువ ప్రకారం మెటా సంస్థపై పడే భారం 800 కోట్ల డాలర్లకన్నా తక్కువే ఉంటుందని ఒక ఆర్థిక రంగ నిపుణుడు లెక్కగట్టారు. అత్యధిక జరిమానాలు చెల్లించిన టాప్‌–20 కంపెనీల జాబితాలో కూడా మెటా ఉండకపోవచ్చన్నది ఆయన విశ్లేషణ. అన్నిటికన్నా వింతైన విషయం–మెటా చెల్లించాల్సిన పరిహారంలో 530 కోట్ల డాలర్ల మొత్తానికి ఉన్న మెలిక. తన ప్రత్యర్థి సంస్థలు టిక్‌టాక్, యూట్యూబ్‌లు సైతం తన మాదిరే టీనేజర్లు యాప్‌లో గడిపే సమయాన్ని పరిమితం చేసుకుంటేనే... అవి కూడా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తేనే ఈ పరిహారం బాధ్యత నెరవేరుస్తానని చెప్పడం తోకే కుక్కను ఆడించిన చందంగా కనబడుతోంది.

మెటా సంస్థ మాజీ ఉద్యోగులూ, విజిల్‌బ్లోయర్‌లూ దానిపై చేసిన ఆరోపణలు చిన్నవేమీ కాదు. వీరు న్యాయస్థానాల్లోనూ, పార్లమెంటరీ కమిటీల ఎదుటా ఎన్నో అంశాలు ఏకరువు పెట్టారు. తన ఉత్పత్తుల్ని సురక్షితంగా మార్చటానికి అంతర్గతంగా అవకాశాలున్నా... వినియోగదారులు అధిక సమయం గడిపేలా చూసేందుకే సంస్థ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. లాభార్జనే ముఖ్యమనుకున్నదని వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల టీనేజ్‌ బాలికలు తమ శరీరాకృతిపై తీవ్ర ఆందోళన చెందటం, అనోరెక్సియా(ఆకలి చంపుకోవటం) అనే తీవ్ర మానసిక రుగ్మత బారిన పడటం, మానసిక ఒత్తిళ్లకు లోనుకావటం వంటివి సంభవిస్తున్నాయని అంతర్గత సర్వేల్లో బయటపడినా వెల్లడి కానీయలేదన్నది వారి ఆరోపణ. అలాగే 13 యేళ్లలోపు పిల్లల డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించటమంటే... ఆన్‌లైన్‌ వేధింపులకూ, నేరగాళ్లు వలవేయటానికి తోడ్పడే వాతావరణంలోకి వారిని నెట్టడమేనని చెప్పారు. టీనేజర్లు ఏమేరకు హానికర విషయాల ప్రభావంలో పడ్డారన్న గణాంకాలను తగ్గించిచూపే ప్రయత్నాలు జరిగాయని సాక్ష్యాధారాలు సమర్పించారు. సంస్థ తీసుకునే భద్రతా చర్యలు అతి స్వల్పమని తెలిపారు. వీటిని ఎత్తిచూపిన సిబ్బందిపై వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డారని కూడా చెప్పారు. ఇవన్నీ న్యాయస్థానంలో నిగ్గుదేలితే సామాజిక మాధ్యమాలు సక్రమంగా వ్యవహరించకతప్పని స్థితి ఏర్పడేది. 

అయితే ఈ రాజీ ఒప్పందం పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు సంబంధించి సరైన చట్టం ఏర్పడని మనలాంటి దేశాలకు నమూనాగా ఉపయోగపడుతుంది. తగిన కట్టుదిట్టాలతో మెరుగైన చట్టం రూపొందించటానికి పనికొస్తుంది. ఇప్పుడు మెటా విషయంలో కుదిరిన ఒప్పందం సామాజిక మాధ్యమాల చరిత్రలో తొలి అడుగే. కాలక్రమంలో ఇది మరింత పదునుదేరితే వాటి ఆగడాలకు కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement