హిమవత్పర్వత శ్రేణి రాళ్లూ రప్పల సమూహం కాదు... అది ప్రకృతి చెక్కిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఈ సౌందర్యం కాస్తా రెప్పపాటులో మృత్యుగీతం ఆలపిస్తుంది. జనావాసాలను క్షణంలో శ్మశాన వాటికలుగా మారుస్తుంది. బుధవారం నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో అతి పెద్ద మంచుఖండం విరిగి భోటే కోశీ నదిలో పడటంతో మెరుపు వరదలు సంభవించి 350 మంది వరకూ మరణించారని అంటున్నారు. 30కిపైగా దేశాలకు చెందిన 1,300 మంది గల్లంతయ్యారు. వారిలో 290 మంది భారతీయులు. నది దిగువనవున్న అనేక జనావాసాలు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదార్లు కొట్టుకు పోయాయి. హిమాలయాల్లో ఇలాంటి ఉదంతాలు రివాజుగా మారినా, ఈసారి ఉత్పాతం అతి పెద్దదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ దారుణానికి కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించటంవల్లే ఇలా జరిగిందని తొలుత వార్తలొచ్చాయి. అయితే దాన్ని నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలేమీ లేకపోవటంతో తీవ్ర వాతావరణ స్థితిగతులవల్లే మంచుఖండం కరిగి విరిగిపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగటంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది. కాలుష్యకారక దేశాల్లో తొలి స్థానం అమెరికాది. అటు తర్వాత స్థానం చైనాది కాగా, మూడో స్థానం మనది. నాలుగో స్థానం యూరోప్ దేశాలది. కర్బన ఉద్గారాల విడుదలలో నేపాల్ స్థానం 95. అంటే ప్రపంచాన విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఒక శాతంలో పదో వంతు వాటా మాత్రమే నేపాల్‌ది. వాతావరణ మార్పుల తాకిడికి నష్టపోయే దేశాల్లో మాత్రం ఆ దేశానిది ఆరో స్థానం. అతి తక్కువ కాలుష్యానికి కారణమవుతూ అతి ఎక్కువ మూల్యం చెల్లిస్తున్న దేశంగా నేపాల్‌ను చెబుతారు. ఇప్పుడంటే సూపర్ ఎల్‌నినో వచ్చిపడిందిగానీ... గత దశాబ్దకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వేధిస్తూనే ఉన్నాయి. వాటిని ముందుగా పసిగట్టే సాంకేతికతలు అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోయినా, గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన ఉపకరణాలు అమెరికా, చైనాలవద్ద ఉన్నాయి. తమ కారణంగా యేటా భారీ నష్టాన్ని చవిచూస్తున్న నేపాల్‌కు ఆ సాంకేతికతల్ని ఉచితంగా ఇచ్చి ఆదుకోవటం తమ నైతిక ధర్మమని అవి రెండూ అనుకోవు. ఫలితంగా చెప్పాపెట్టకుండా మెరుపు వరదలు విరుచుకుపడటం నేపాల్‌లో మామూలు విషయంగా మారింది.
భోటే కోశి నది టిబెట్‌లో మొదలవుతుంది. కొడారి దగ్గర ఒక పాయ, రసువా దగ్గర మరో పాయ నేపాల్‌లోకి ప్రవేశిస్తాయి. నిరుడు సైతం ఆ నదికి ఇలాగే వరదలొచ్చాయి. గత నెల 8న రసువా దగ్గరొచ్చిన వరదల్లో 18 మంది చనిపోగా, అనేక జలవిద్యుత్ ప్రాజె క్టులు, వంతెనలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వర్షపాతం, వరదనీటి ప్రవాహాల గురించిన డేటా చైనా ఎప్పటికప్పుడు అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించే వీలుంటుంది. దేశంలోకి వరద నీరు ప్రవేశించటం మొదలయ్యాకే పౌరుల్ని హెచ్చరించే స్థితి ఉండటం నేపాల్‌కి విషాదం మిగులుస్తోంది. కొన్నిసార్లు మంచుపలకలు విరిగి భోటే కోశి ప్రవాహ మార్గాన్ని కప్పేస్తాయి. అప్పుడు దిగువన నేపాల్‌లో నది నిండుకుంటుంది. దాన్నొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటారు. ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం తప్పదు. నిరుడు బేత్రావతి–రసువాగడి కారిడార్‌ను వరదలు ముంచెత్తి భారీ నష్టం జరిగింది.
అతి కష్టంపై వాటన్నిటినీ పునర్నిర్మించారు. అవన్నీ తాజా వరదల్లో మళ్లీ కొట్టుకు పోయాయి. పదిపదిహేనేళ్ల డేటా అందుబాటులో ఉండి అధ్యయనం చేయగలిగితే నది నడత అంచనాకు, దానికి అనుగుణంగా కనిష్ఠ స్థాయి నష్టం మాత్రమే ఉండేలా నిర్మాణాలు చేపట్టడానికి కొంతవరకూ వీలవుతుంది. భారీ జననష్టం, ఆస్తినష్టం కలగజేసే వైపరీత్య సమాచారం సైతం సరిహద్దుల ఆవలే నిలిచిపోతే మానవాళి సాధించిన అభివృద్ధికి అర్థం ఉండదు. దానికన్నా ముందు సంపన్న దేశాలు తమ అభివృద్ధి నమూనాలను మార్చుకోవాలి. వైపరీత్యం వచ్చిపడ్డాక సాయం చేయటానికి ముందుకు రావటం మెచ్చదగిందే అయినా, దాని నివారణకు తమ వంతు చేయాల్సిందేమిటో అవి గుర్తెరగాలి. బాధ్యతారహిత ప్రవర్తన ఏదో ఒకరోజు తమను కూడా ధ్వంసించగలదని తెలుసుకోవాలి.


