ఒంటరి మానవుడికి మాటతో పనిలేదు. కానీ మరో మనిషితో కలిసి సాగినప్పుడు మాటలాంటిదేదో కావాలి. చూపు, శబ్దం, చేతి కదలిక, ముఖ కవళిక– ఇవన్నీ తొలి సంభాషణా సాధనాలై ఉండాలి. చిరునవ్వు, తల ఊపు, భయం, బిడియం, కన్నీరు, కన్నెర్ర– వాటికి కొనసాగింపుగా మారివుండాలి. అయితే మనుషులు ప్రేమలో పడినప్పుడు అక్కరకొచ్చే మూగబాసలు, మూతివిరుపులది వేరే కథ. వేల ఏళ్ల పరిణామంలో మనుషులు గుంపులుగా పోగయినకొద్దీ, వారి అనుభవాలు విస్తరించిన కొద్దీ, సంకేతాలకు అందని సంక్లిష్టతలు అందులోకి వచ్చిచేరినకొద్దీ భాషలు రూపుదిద్దుకోవడం మొదలై ఉంటుంది. ఎక్కడి సమాజం అక్కడి భాషను, అందులోని పద సంపదను, దానిదైన వ్యక్తీకరణ రీతిని తీర్చిదిద్దుకున్నాయి. అయితే ఈ భాషకు లిపిని కూర్చుకున్నాక మానవ నాగరికత మహత్తరమైన మలుపు తిరిగింది. ఒక తరం సంపాదించిన సమస్త వివేక సారాన్ని మరో తరానికి బదిలీ చేయడం సులభమైపోయింది.
భాష అనేది మానవుడి అడుగుజాడ. వేల ఏళ్ల నాగరికతకు సజీవ సాక్ష్యం. భాష మనిషిని తన గతంతో పెనవేస్తుంది. అదే సమయంలో భవిష్యత్తును నిర్మించే సాధనంగానూ ఉపకరిస్తుంది. ప్రాచీన ప్రపంచంలో ఒకప్పుడు 30,000 నుంచి 75,000 భాషల వరకు ఉండేవని ఒక పరిశోధన తెలియజేస్తోంది. కానీ మనుషుల గుంపుల ఏకీకరణ జరిగినకొలదీ, సమాజాలు పెరిగినకొలదీ, రాజ్యాలు విస్తరించిన కొలదీ, ఎన్నో రాజకీయ ఆర్థిక, అణచివేత కారణాల వల్ల కొన్ని భాషలు పెరిగాయి, కొన్ని తరిగాయి, ఇంకొన్ని సమూలంగా అంతరించిపోయాయి. ప్రపంచంలో అది ఎంత చిన్న సమూహమైనా సరే దానికే ప్రత్యేకమైన ఒక భాషను మాట్లాడింది. అంతెందుకు, 19వ శతాబ్దం వరకూ ఠగ్గులు తమదైన రామసీ లేదా రామసీన అనే భాషను మాట్లాడేవారట. వీళ్లు యాత్రికులుగా వెళ్తున్న కాలిబాట ప్రయాణీకుల్లో కలిసిపోయి, వారి నమ్మకం సంపాదించి, సరైన క్షణంలో వాళ్లను చంపి సొమ్ములు ఎత్తుకుని పారిపోయేవారు.
‘రామసీన ఆర్ ఎ వొకాబ్యులరీ ఆఫ్ ద పెక్యులర్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ద ఠగ్స్’ పేరుతో డబ్ల్యూ.హెచ్.స్లీమన్ అనే ఆంగ్లేయుడు 1836లో ఏకంగా ఒక పుస్తకం కూడా వెలువరించాడు. ఇప్పుడు ప్రపంచంలో 7,500 భాషలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. కానీ ఇందులో కేవలం పది శాతం భాషల్లోనే సుమారు 90 శాతం ప్రపంచ జనాభా సంభాషిస్తోంది. దానికదే భాషలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయో తెలియజేస్తోంది. ఒక భాష అంతరిస్తే మాయమయ్యేది పదాలు కాదు, ఒక ప్రపంచ దృష్టికోణం. ఒక జాతి పాడుకున్న పాట ఇంకెవరికీ వినబడకపోవచ్చు. మరో ప్రాంతం చెప్పుకున్న కథ మరెవరికీ తెలియకపోవచ్చు. అయితే, ఈ సమస్య భాషకా, మనిషికా; అసలు సమస్యేనా అన్నది కొత్త డైలమా.
ఆధునిక మానవుడు ఇప్పుడు విచిత్రమైన చౌరస్తాలో నిలబడివున్నాడు. ఇది చరిత్రలో ఎన్నడూ ఎదురవ్వని సందర్భం. భాషతోనే మానవ నాగరికత వర్ధిల్లింది. అయితే ఈ భాష అనే మేతను తింటూనే కృత్రిమ మేధ(ఏఐ) అనే బ్రహ్మరాక్షసి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడున్న స్థితిలో ఈ భాషలను రూపొందించు కోవడానికి మనుషులు వేల ఏళ్లు తపస్సు చేశారు. కానీ నెలల వ్యవధిలోనే వీటన్నింటినీ ఒక్క పెట్టున ఏఐ మింగుతోంది. కృత్రిమ మేధకు మనుషులు బానిసలుగా మారి పోతారేమోననే భయాందోళనలను మహామహా టెక్‌పండితులే వ్యక్తపరుస్తున్నారు. ఈ స్థితిలో భాషలకు మించి ఏదైనా సామర్థ్యం మనుషులు సంపాదించుకుంటే తప్ప మనుగడ సాగించలేరని ఆధునిక తత్వవేత్త యువల్ నోవా హరారీ హెచ్చరిస్తున్నారు.
ఇది ఇంకోరకంగా భాషల పూర్వయుగంలోకి మనుషులను తీసుకుపోనుందా? నాగరికతను మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడమా లేక మరింత ఉత్కృష్ట స్థితిలోకి భాషను తీసుకుపోవడమా? కృత్రిమ మేధకు అందకుండా మనిషి ఇంకో మనిషితో చేయగలిగే సంభాషణ ఎలా ఉండగలదు? బహుశా అది ప్రేమరూపంలో ఉండొచ్చు, కరుణరూపంలో ఉండొచ్చు. కానీ వివేకం అంతరిస్తున్న కాలంలో, యుద్ధోన్మాదం పెరుగుతున్న యుగంలో అదే చాలా కష్టమైనదేమో! సరికొత్త ‘అక్షరమాల’తో మొదలు పెట్టాల్సివుంటుందేమో!


