మన కళ్లముందే సమాజం ఎంతగా పతనమవుతున్నదో చెప్పటానికి ఈ నెల 11న నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యోదంతమే ఉదాహరణ. కేరళలోని అలప్పుజ జిల్లాలో గత శనివారం ఒక వృద్ధుణ్ణి చంపిన ఘటన సైతం దీన్నే పోలివుండటం యాదృచ్ఛికం కాదు. ఆదాయం పేరు చెప్పి ప్రభుత్వాలు మద్యాన్ని విక్రయిస్తున్నాయి. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించటంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇవన్నీ ఏ వయసు వారికైనా సులభంగా లభ్యమవుతున్నాయి. హత్యలు చేయడానికి ఎన్ని మార్గాలుంటాయి, ఎలా తప్పించుకోవచ్చు అనే ప్రశ్నలకు సామాజిక మాధ్యమాల్లో సవాలక్ష సమాధానాలు క్షణాల్లో దొరుకుతాయి. డబ్బుంటే అందుబాటులోకొచ్చే ఖరీదైన ఉపకరణాలు, జల్సాల గురించిన కోట్లాది వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఇన్ని ప్రలోభాలు కళ్ల ముందుంటే, ఏం చేసినా ఎవరికీ దొరక్కుండా తప్పించుకోగలమన్న భరోసా కనిపిస్తుంటే... పర్యవసానాలేమిటన్న స్పృహ కొరవడిన తెలిసీతెలియని వయసు పిల్లలు నేరాలవైపు మొగ్గటంలో ఆశ్చర్యమేముంది? హంతకులిద్దరూ పదో తరగతి పిల్లలంటే, ఎనిమిదో తరగతికే వారికి దురలవాట్లు సోకాయంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. తొమ్మిదో తరగతిలోనే ఆ పిల్లలు గోవా పోయి జల్సాలు చేసుకున్నారని కూడా చెబుతున్నారు.
ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఆ ఇద్దరు టీనేజర్ల దగ్గర సెల్‌ఫోన్లుండటాన్ని, వారు తరచు ఎవరితోనో సంభాషిస్తుండటాన్ని సకాలంలోనే గమనించారు. తల్లిదండ్రుల్ని పిలిపించి వారి దృష్టికి తీసుకొచ్చారు. హాస్టల్ నుంచి పంపించేశారు. పాఠశాలలో ఆ పిల్లలు మత్తు పదార్థాలు తీసుకొంటుండగా ఫొటోలు తీశారు. మళ్లీ తల్లిదండ్రులకు చెప్పిచూశారు. చదువుకుని, ఉన్నతోద్యోగాలు వెలగబెడుతున్నవారికే అలాంటి పిల్లల ప్రవర్తన ఎటు దారితీయగలదన్న స్పృహ కొరవడుతున్నప్పుడు, కూలీనాలీ చేసుకునేవారికి ఏం అర్థమవుతుంది? ఆ క్షణంలో మందలించినా, వారిని సన్మార్గంలో పెట్టడానికి ఎవరిని సంప్రదించాలో తెలిసేదెలా? బాధ్యతను గుర్తించేదెలా? రూపారెడ్డి హత్యోదంతం ప్రముఖంగా వచ్చినరోజే హైదరాబాద్‌లో ద్విచక్రవాహనంపై అయిదుగురు మైనర్లు పెనువేగంతో వెళ్తూ ఇతరుల్ని హడలెత్తించారని మీడియా తెలిపింది. రోడ్డుపైకి వెళ్తే రోజుకి కనీసం ఒకటి రెండుచోట్ల ఇలాంటివారు తారసపడుతుంటారు. అదుపాజ్ఞల్లో ఉంచటం కాదు... ఆ పిల్లలు బడిలో ఏం నేర్చుకుంటున్నారో, వారికి ఏయే అంశాల్లో ఆసక్తి ఉందో నిత్యం గమనించటం తల్లిదండ్రుల బాధ్యత. ఇది కొరవడటంతో పిల్లలు క్రమేపీ హింసాత్మక ప్రవృత్తివైపు జారుకుంటున్నారు. సమాజానికి ఉపద్రవంగా పరిణమిస్తున్నారు.
కేరళ ఉదంతంలోనూ దాదాపు ఇవే ఆనవాళ్లు కనబడతాయి. పదమూడేళ్ల బాలిక తన ఫోన్ వాడకంపైనా, మగపిల్లలతో మాట్లాడటంపైనా ఆంక్షలు విధించిన తాతపై కక్ష పెంచుకుంది. అమ్మ, అమ్మమ్మ లేకపోవటం చూసుకుని గత శనివారం రాత్రి స్నేహితురాలింట్లో చదువుకోవాలంటూ తాతకు చెప్పి వెళ్లింది. ముగ్గురు మగపిల్లలకు ఇంట్లోకెలా ప్రవేశించవచ్చునో, ఎక్కడేం ఉంటాయో ముందే చెప్పివుంచింది. వారతన్ని హతమార్చగా, ఆ మర్నాడు ఏం ఎరగనట్టు రెండుసార్లు ఇంటికెళ్లింది. తలుపుకొట్టింది. ఇరుగుపొరుగును పిల్చి తలుపులు బద్దలుకొట్టించింది. నల్లగొండ జిల్లా ఉదంతం మాదిరే ఇక్కడ కూడా తప్పించుకొనేందుకు పిల్లలు గ్లోవ్స్ కొనుక్కున్నారు. కేరళ ఉదంతంలో తమ ఉనికి పోలీసు జాగిలాలు పసిగట్టకుండా కారంపొడి చల్లారు.
ప్రశ్నించటాన్ని నేరంగా చూసే ప్రభుత్వాలకు ఇన్ని దుర్వ్యసనాలు పిల్లలకు అందుబాటులోకొస్తున్నాయన్న స్పృహ లేదు. చదువుతోపాటు పిల్లల్ని ఆలోచింపజేసే, ఉత్సాహ పరిచే కార్యకలాపాలేవీ బడుల్లో ఉండవు. తొమ్మిదో తరగతి చదివే పిల్లలు గోవా క్యాసినోల్లో, బీచ్‌లలో గడిపినా వారిని పసిగట్టలేకపోయిన అక్కడి ప్రభుత్వం సిగ్గుపడాలి. గోవాను స్ఫూర్తిగా తీసుకుని వైజాగ్ బీచ్‌కి అలాంటి ‘సరదాలు’ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. పిల్లలు, యువత నాశనం కావటానికి తోడ్పడేవన్నీ అందుబాటులోకి తెచ్చే ప్రభుత్వాలున్నచోట ఇంటిపెద్దలైనా, ఉపాధ్యాయులైనా నిస్సహాయులుగా మిగలకేం చేస్తారు?


