చిన్నారావు (ఫైల్) , మహాలక్ష్మి (ఫైల్)
గొంతు కోసి హతమార్చిన ప్రేమోన్మాది
పెళ్లికి నిరాకరిస్తోందనే అక్కసుతో దారుణం
తప్పించుకునేందుకు భవనం పై నుంచి దూకడంతో ప్రేమోన్మాది సైతం మృతి..
విజయవాడ న్యూఆర్‌ఆర్ పేటలో ఘటన
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరిస్తోందనే అక్కసుతో యువతిని కొడవలితో గొంతుకోసి చంపేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుంచి దూకడంతో అతడు కూడా మృత్యువాతపడ్డాడు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ న్యూరాజరాజేశ్వరిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరీపేటలోని మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పడవల మహాలక్ష్మి (19) పదో తరగతి వరకు చదువుకుంది.
ఆ తరువాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసినా ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసి ఓ వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. రెండేళ్ల వయసులోనే మహాలక్ష్మి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో మహాలక్ష్మిని నాయనమ్మ శాంతమ్మ పెంచి పెద్దచేసింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మంకు చిన్నారావు అలియాస్ చిన్నా (22) అనే యువకుడు రాజరాజేశ్వరి పేటలో తన అన్నయ్య మహేష్ వద్ద ఉంటూ అప్పుడప్పుడూ ఫ్లవర్ డెకరేషన్ పనులకు వెళ్తుంటాడు.
కొడవలితో గొంతుకోసి..
ఇంటి సమీపంలోనే ఉండే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా చిన్నా ఒత్తిడి చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతడి ప్రవర్తన నచ్చని మహాలక్ష్మి ‘ముందు నీ ప్రవర్తన మార్చుకో’ అని చెబుతోంది. మహాలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నా ఓర్చుకోలేని చిన్నా ఆమెను తిట్టడం.. కొట్టడం చేస్తున్నాడు. ఇటీవల ఇంటి సమీపంలో జరిగిన అన్నసమారాధనకు వెళ్లిన మహాలక్ష్మిని దుర్భాషలాడి కొట్టాడు. దీంతో మహాలక్ష్మి నాయనమ్మ శాంతమ్మ చిన్నాను పిలిచి ఇలా అయితే నీకు మహాలక్ష్మిని ఇచ్చి అస్సలు పెళ్లిచేయబోమని చెప్పింది. దీంతో అక్కసు పెంచుకున్న చిన్నా మహాలక్ష్మిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
శనివారం ఉదయం మహాలక్ష్మి నాయనమ్మ శాంతమ్మ టిఫిన్ తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లగా.. కొడవలితో ఆ ఇంట్లోకి చొరబడిన చిన్నా తలుపులు మూసేసి మహాలక్ష్మిపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతి వేళ్లు నరికేసి.. గొంతుకోసి అత్యంత కిరాతకంగా గాయపరిచాడు. మహాలక్ష్మి కేకలు విన్న స్థానికులు ఇంటి తలుపులు పగులకొట్టే ప్రయత్నం చేయగా.. చిన్నా ఆ ఇంటి వెనుక తలుపు తీసుకుని అదే భవనం పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా చిన్నా అక్కడికక్కడే మృతిచెందగా.. మహాలక్ష్మి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా దాదాపు ఏడు గంటల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన చిన్నారావు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ పేరు కూడా సైకో చిన్నా అనే పెట్టుకున్నాడు. నిజంగానే అతడు సైకోలా ప్రవర్తిస్తాడని.. పనీపాట లేకుండా తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.


