లాటిన్ అమెరికా దేశాల్లో నియంతలను గద్దెనెక్కించిన గతకాలపు పోకడలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ మొదటివారం బ్రెజిల్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత దేశాధ్యక్షుడు, మధ్యేవాద వామపక్ష నేత లూలా డి సిల్వాను ఓడించి మితవాద పక్ష నాయకుడు ఫ్లేవియో బోల్సోనారో అధికారంలోకి రాలేనట్టయితే సైనిక జోక్యం చేసుకోవటానికి పథక రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు నేరస్త ముఠాలు సీవీ, పీసీసీలను ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది.
వీరినుంచి అమెరికాకు ఏర్పడిన ముప్పును తొలగించటంలో బ్రెజిల్ విఫలమైందన్న సాకుతో సైనిక దాడి చేయటమే ఈ పథకం ఆంతర్యం. వెనిజులాలో సైతం నిరుడు ట్రంప్ ఇదే తరహా డ్రామా నడిపించారు. మాదకద్రవ్య ముఠాలు అమెరికా భద్రతకు ముప్పుగా మారాయనీ, వాటిని అధ్యక్షుడు మదురో ప్రోత్సహిస్తున్నారనీ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో మదురో దంపతుల్ని కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికా కోర్టులో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
లాటిన్ అమెరికా దేశాలన్నిటా 1964 మొదలుకొని రెండు దశాబ్దాలపాటు అమెరికా ఇలాంటి దుర్మార్గాలకే పాల్పడింది. ఇదే బ్రెజిల్‌లో 1964లో వామపక్ష ప్రభుత్వాధినేత జివావో గౌలార్ట్‌ను సైనిక కుట్రలో తొలగించి హుంబెర్టో కాస్టిలోను గద్దెనెక్కించింది. అదే సంవత్సరం బొలీవియాపై సైతం ఇదే కుట్ర కొనసాగించింది. చిలీలో 1973లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సోషలిస్టు నాయకుడు సాల్వెడార్ అలెండీని సైనిక తిరుగుబాటులో హతమార్చి అగస్టో పినోచెట్‌ను అధినేతగా కూర్చోబెట్టింది.
ఇలా ఉరుగ్వే, అర్జెంటీనా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా దేశాల్లో సైతం 1985 వరకూ ఈ కుట్రలు సాగుతూనే వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తన పొరుగున ఆనాటి సోవియట్ ప్రభావం పడితే తన ప్రాభవం కొడిగడుతుందన్న భయాందోళనలే ఈ కుట్రలకు కారణం. నియంతల రాకతో లాటిన్ అమెరికా దేశాల ప్రజానీకం భయానక పాలన చవిచూశారు. ఒక్క అర్జెంటీనాలోనే ‘డర్టీ వార్’ పేరుతో పదివేలమంది ప్రాణాలు తీశారు. చిలీలో, ఎల్‌సాల్వెడార్‌లో, గ్వాటెమాలాలో సాగించిన నరమేధాలు దాదాపు యాభైవేలమంది ఉసురుతీశాయి.
మళ్లీ ఇన్నాళ్లకు అమెరికా అస్తిత్వ ఆందోళనలో పడింది. మొన్న మే నెలలో జరిగిన కొలంబియా ఎన్నికల్లో ట్రంప్ తెరవెనక సాగించిన కుట్రల ఫలితంగా ఆయన అనుకూలుడు ఎబెలార్డో ఎస్ప్రియెల్లా స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకొచ్చారు. అందుకే బ్రెజిల్‌లో సైతం ఆ పాచిక పారుతుందనుకుంటున్నారు. లూలా బ్రిక్స్ కూటమిలో చురుగ్గా పాలుపంచుకోవటం, చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవటం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవటం ట్రంప్‌కు కంటగింపుగా మారాయి. తన కీలుబొమ్మ జైర్ బోల్సొనారో 2023 ఎన్నికల్లో పదవీభ్రష్టుడు కావటంనుంచే ట్రంప్ బుసలుకొడుతున్నారు.
తిరుగుబాటు కుట్రలో బోల్సొనారోను శిక్షిస్తే తీవ్ర పరిణామాలుంటాయని న్యాయవ్యవస్థను సైతం హెచ్చరించారు. కానీ ఈ ఏడాది మొదట్లో బోల్సొనారోకు 27 యేళ్ల ఖైదు పడింది. ప్రస్తుతం డి సిల్వాతో తలపడేందుకు రంగంలో 13 మంది అభ్యర్థులున్నారు. ఆయనకు 40 శాతం మద్దతుంటే, సమీప ప్రత్యర్థి ఫ్లేవియో 28 శాతంవద్ద ఆగిపోయారు. దీన్నెలాగైనా తారుమారు చేయటానికి అమెరికా పడరాని పాట్లు పడుతోంది. బ్రెజిల్ పాత్రికేయులకూ, వివిధ మాధ్యమాల్లో ప్రభావం చూపగల వారికీ ఉదారంగా వీసాలు మంజూరుచేసి ‘భావప్రకటనా స్వేచ్ఛ’పై పాఠాలు చెబుతోంది. తప్పుడు ప్రచారాలు సాగిస్తోంది. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో కొత్త ఎత్తుకు తెరలేపింది.
ఇరాన్‌లో ఓటమి ఎదురుకావటం, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటం, డాలర్ మనుగడకు ముప్పు ఏర్పడటం ట్రంప్‌ను వేధిస్తున్నాయి. ఇప్పటికే పెరూ, ఎల్‌సాల్వెడార్ దేశాల్లో మితవాదులు గెలిచారు. బ్రెజిల్‌ను సైతం లోబరుచుకోగలిగితే దేశంలో తన కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయని ట్రంప్ భావిస్తున్నారు. పొరుగు దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంలాంటి అనాగరిక పోకడలకు అమెరికా ఇకనైనా స్వస్తిచెప్పాలి.


