బెట్టుచేయొద్దు సర్‌! | Sakshi Editorial On Supreme Court Examines CEC Decision Powers | Sakshi
Sakshi News home page

బెట్టుచేయొద్దు సర్‌!

Oct 6 2026 12:04 AM | Updated on Oct 6 2026 12:04 AM

Sakshi Editorial On Supreme Court Examines CEC Decision Powers

‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే... చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’ని నానుడి. ఇప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) వాలకం అలాగే ఉంది. ఓటర్ల జాబితాల్లో చాటుమాటుగా, ఏకపక్షంగా తీసివేతలు, కూడికలు చేసిన వైనం బట్టబయలయ్యాక నిరసనలు వేయినాల్కలు చాచి దహిస్తుంటే ఈసీకి కాళ్లూ చేతులూ ఆడటం లేదు. అందుకే కావొచ్చు... స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) పేరిట ఇంతవరకూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘మినహాయించిన’ ఓటర్లను తిరిగి చేర్చుకోవటానికి ‘ప్రత్యేక చొరవ’ మొదలెట్టాలని ఆయా ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు(సీఈఓ) గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలిచ్చింది.

ఈ ‘ప్రత్యేక చొరవ’ కోసం ఫామ్‌–6ను ఉపయోగించాలని కోరింది. నిజానికిది సాంకేతికంగా చెల్లదు. తొలిసారి ఓటర్ల కోసం నిర్దేశించిన ఫామ్‌ను తొలగించిన ఓటర్లకు ఎలా వినియోగిస్తారు? వారిని చేర్చదల్చుకుంటే అందుకు మరో నిబంధనేమైనా ఉందేమో అన్వేషించాలి. లేదా ‘సర్‌’కు ముందున్న ఓటర్ల జాబితాను యధాతథంగా ఆమోదించాలి. మరో ఆసక్తికరమైన విషయమేమంటే... 2002నాటి ‘సర్‌’లో ఉన్న తండ్రి/తల్లి/ తాత వగైరాలతో అనుసంధానం అయితేనే ఓటు ఉంటుందన్న ఫామ్‌–6 సవరణకు పూర్తిగా స్వస్తి చెప్పారు. అంతేకాదు... ఇంటింటికీ వెళ్లి ఓట్లును విచారణ చేసుకుంటారట. ఎంత వినయం! ఎంత రాజ్యాంగ విధేయత!! ఇదంతా ఇన్నేళ్లుగా ఎటు పోయినట్టు?

‘చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయింద’న్నట్టు ఈసీ సాగించిన ఈ తెరచాటు వ్యవహారాలు తెలియక 13 కోట్లకుపైగా జనం మౌనంగా ఈతిబాధలు అనుభవిస్తుంటే ఈసీ దాన్ని చేతగానితనంగా తీసుకుంది. అసలు ఈసీ రాజ్యాంగాతీత శక్తి కాదనీ, నిబంధనలు బేఖాతరుచేసి దానికదే ఏ నిర్ణయమూ తీసుకోవటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫామ్‌–6 సవరణపై తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యానం దిగ్భ్రాంతిలో పడేసింది.

ఆ మార్పును సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించిందంటూ ఈసీ చెప్పడాన్ని ప్రస్తావించి, తాము ఏ సవరణకూ ఆమోదం తెలపలేదని ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ వివరణనిచ్చారు. ఇదే వ్యవహారంపై ఆ ముందురోజే సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వ్యాఖ్యానిస్తూ ‘ఓటు హక్కు పౌరసత్వానికి అసలైన ప్రాణం. దాన్ని తొలగించటం రాజ్యాంగద్రోహం’ అనటం గమనించదగింది. ఇవి చాలు...ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణం నిష్క్రమించడానికి! ఆ పదవిలో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారు. 

గాంధీ జయంతినుంచి ఢిల్లీ, ముంబైవంటి నగరాల్లో జ్ఞానేశ్‌ తప్పుకోవాలంటూ యువత రోడ్లపైకొస్తున్నారు. పోలీసులు రోజూ యాతన పడుతున్నారు. ఆడ, మగ తేడా పాటించకుండా పోలీసు వ్యాన్లలోకి ఈడ్చుకెడుతున్నారు. ఒక మహిళా జర్నలిస్టుపట్ల ఏసీపీ స్థాయి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన వైనం వీడియో సాక్షిగా బయటికొచ్చింది. తప్పు మీద తప్పు చేస్తూ కోట్లాదిమంది ఓటుకు ఎగనామం పెట్టిన పెద్దమనిషి మాత్రం తనను కానట్టు వ్యవహరిస్తున్నారు. నేరం బయటపడ్డాక స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది పోయి, యువఘోష మిన్నంటుతున్నా బధిరాంధత్వం సంప్రాప్తించినట్టు ఆయన ఉండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటు. 

‘సర్‌’ ప్రక్రియలో ఓట్ల తొలగింపు అక్రమాలేమిటో ఇప్పుడు కర్ణాటక, తెలంగాణల్లో బయటపడిన వ్యవహారాలు చెబుతున్నాయి. ఫలానా ఓటు తొలగించమని దరఖాస్తులు అందిందే తడవుగా అడ్డగోలుగా తీసేశారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘సర్‌’ ప్రక్రియలో చోటుచేసుకున్న చట్టవిరుద్ధతలు, వాటి పర్యవసానాలపై ఆందోళన సాగుతోంది.

మరి 2024నాటి ఎన్నికలనుంచీ చోటుచేసుకున్న అక్రమాల మాటేమిటి? చట్టం ఆసరావున్నా మిగతా ఇద్దరు కమిషనర్లూ ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఆంధ్రప్రదేశ్‌ వరకూ తీసుకుంటే అప్పట్లో 3,500 పైగా పోలింగ్‌ కేంద్రాల్లో అర్ధరాత్రి దాటాక లక్షలమంది ఎలా ఓట్లెలావేశారు? ఆ ప్రక్రియకు సంబంధించిన వీవీప్యాట్‌లూ, సీసీ టీవీ ఫుటేజ్‌లూ నిబంధనల్ని కాదని ముందే ఎందుకు తొలగించారు? ఎవరి ఆదేశాల పర్యవసానమిది? ఇవన్నీ తేలాలిప్పుడు. దానికి ముందు, బెట్టుచేయటానికి ఇక స్వస్తిపలికి జ్ఞానేశ్‌ తక్షణం వైదొలగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement