కేంద్ర విద్యామంత్రి రాజీనామా కోరుతూ వినూత్న తరహా నిరసనలతో, నిరాహార దీక్షలతో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఊహించని విజయం సాధించిన జెన్ జీ... రాంచీలో సైతం ఘన విజయం సాధించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (జేఎస్‌ఎస్‌సీ–సీజీఎల్) పరీక్షను రద్దు చేయటానికి ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటనతో ఉద్యమకారుల శిబిరం ఆనందోత్సాహాలతో పొంగిపోగా... రాష్ట్రంలో గత పన్నెండేళ్ల నుంచీ జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయనీ, వాటిపై కూడా చర్యలు తీసుకోబోతున్నామనీ ఆయన చెప్పటం వేలాదిమంది ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది. ఆ నియామకాలన్నీ రద్దు చేస్తారా... చేస్తే దానికి అనుసరించే విధానమేమిటన్న ప్రశ్న ఇప్పుడందర్నీ వేధిస్తోంది. వీరుగాక తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారున్నారు. అన్నీ పూర్తయి నియామకాల కోసం ఎదురుచూస్తున్న మరో 1,975 మంది వీరికి అదనం.
తగిన విద్యార్హతలు గలవారంతా ప్రభుత్వోద్యోగం కోసం వెంపర్లాడతారు. ప్రయత్నం ఫలిస్తే జీవితంలో శాశ్వతంగా స్థిరపడిపోవచ్చని ఆశపడతారు. ఆ ఉద్యోగ భద్రత అలాంటిది మరి. కానీ ప్రభుత్వోద్యోగాలు వందల్లో ఉంటే, పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. అందుకే తమ చదువులు ఎంతవరకూ పనికొస్తాయన్న భయాందోళనలు అభ్యర్థుల్లో సహజంగానే ఉంటాయి. ఈ పరిస్థితిని శిక్షణ సంస్థలు సొమ్ముచేసుకుంటాయి. లక్షలమంది వేలకు వేలు ఖర్చుచేస్తారు. తీరా ప్రశ్నపత్రాలు లీకయ్యాయని తెలిశాక అలాంటివారి గుండె రగిలిపోదా? ఈ ఆగ్రహావేశాలనుంచే జెన్ జీ ఉద్యమం పురుడు పోసుకుంది. కేంద్ర స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష అయినా, ఇప్పుడు జార్ఖండ్‌లో జరిగిన ఉద్యోగ నియామకాలైనా వివాదాస్పదంగా మారింది అందుకే. సమాజంలో, జీవితంలో అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో అన్యాయం జరిగిందనుకున్నప్పుడు ఉద్యమాలు పోటెత్తడం అనివార్యమని గ్రహించక, యువత డిమాండ్లను అవగాహన చేసుకోక తమకు అలవాటైన పద్ధతుల్లో ఉద్యమాల్ని అణిచేద్దామని ఢిల్లీలోనూ, రాంచీలోనూ పాలకులు ప్రయత్నించారు. రెండుచోట్లా పాలక కూటములు వేర్వేరు. అవి పరస్పరం ప్రత్యర్థి పక్షాలు. అయినా వారి చర్యల్లో సారూప్యత కనబడటం గమనించదగ్గది. రెండుచోట్లా చివరకు పాలకులు వాస్తవం గ్రహించక తప్పలేదు.
జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పోటీ పరీక్షలన్నిటినీ టీఎస్సార్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేటు లిమిటెడ్(టీడీపీఎల్) నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) కోసం ఇంతవరకూ 10 పరీక్షలు, జెఎస్‌ఎస్‌సీకి 5 నిర్వహించింది. వీటిద్వారా బ్లాక్ సప్లయ్ ఆఫీసర్ మొదలుకొని డిప్యూటీ కలెక్టర్, టీచర్, సివిల్ జడ్జీ, ప్రాసిక్యూటర్ వరకూ అనేక పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్రిశంకు స్వర్గంలో పడ్డామనీ, జనం దృష్టిలో నేరగాళ్లుగా మిగులుతామనీ వారంతా గొల్లుమంటున్నారు. తమ నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు కుమ్మక్కుతో యువత ఆశయాలపై చన్నీళ్లు చల్లుతున్నామని పాలకులు గుర్తించటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది. టీడీపీ నేతలు క్రీడా ధ్రువీకరణ పత్రాలివ్వటం, సర్కారు ఉద్యోగాలు పంచడం వింత. జాతీయస్థాయి పతక గ్రహీతలు కూడా వారిముందు బలాదూరే! కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ కళ్లు మూసుకుంది. జార్ఖండ్‌లో ఉద్యమవీరుల పార్టీగా ప్రతిష్ఠ పొందేందుకు నానారకాల ప్రయత్నం చేసిన పక్షమే అక్రమాలెక్కడంటూ దబాయింపులకు దిగుతోంది. దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు చానెళ్లలో తమ గోడు వినిపిస్తుంటే... ప్రశ్నపత్రాల లీక్ మొదలుకొని ర్యాంకుల ప్రకటన, నియామకాల వరకూ సర్వం సందేహాలకు తావిస్తుంటే టీడీపీకి ‘తందాన తాన’ పక్షంగా మిగిలింది. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఫస్ట్ ర్యాంకర్ అని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా అతగాడి పేరు డేటానుంచి మాయం చేయటం దేన్ని సూచిస్తోంది? జార్ఖండ్‌ను చూశాకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు గ్రహించక పోతే కూటమి పక్షాలకు ఏపీ జనం టోకున బుద్ధి చెప్పటం ఖాయం.


