కైలాష్ యాత్రలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సద్గురు | Sadhguru Breaks Down As 80 Of Isha Group Missing In Nepal Flood | Sakshi
Sakshi News home page

కైలాష్ యాత్రలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సద్గురు

Aug 28 2026 12:10 AM | Updated on Aug 28 2026 1:14 AM

Sadhguru Breaks Down As 80 Of Isha Group Missing In Nepal Flood

కైలాష్ మానస సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన బృందం విషాదంలో చిక్కుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వరద రావడంతో తమ బృందంలోని 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్ఘీ వాసుదేవ్ తెలిపారు. టిబెట్‌లోని సాగాలో ఈ ఘటన గురించి అనుచరులకు వివరిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

వరదకు ముందు చివరి సందేశం
సద్గురు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న S3 బృందం గైరాంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ భవనానికి చేరుకుంది. ఉదయం 9:05 గంటలకు బృంద నాయకుడు తాము ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని చివరిసారిగా సందేశం పంపారు. ఆ తర్వాత కేవలం తొమ్మిది నిమిషాలకు, అంటే 9:14 గంటల సమయంలో భారీ వరద సంభవించినట్లు సద్గురు చెప్పారు. ఈ బృందంలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారు. వీరంతా వివిధ దేశాలకు చెందిన వారు అని తెలిపారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడి ఆచూకీ కూడా తెలియడం లేదని సద్గురు పేర్కొన్నారు.

గల్లంతైన వారి సంఖ్యపై ఆందోళన
నేపాల్ వైపు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయని సద్గురు పేర్కొన్నారు. భారతీయ మీడియా కథనాలను ఉటంకిస్తూ నేపాల్ వైపు 484 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్ వైపు మాత్రం పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. మొత్తం గల్లంతైన వారి సంఖ్య 1,500కు పైగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఖ్య ఎంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

సహాయక చర్యలకు సవాళ్లు
వరద ప్రభావిత ప్రాంతంలో రహదారులు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని సద్గురు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత, చైనా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామని, అమెరికా రాయబార కార్యాలయం కూడా సహకరిస్తోందని చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమవారి సమాచారం కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement