ఇన్‌స్టాగ్రామ్‌ ఆ వీడియో పోస్ట్‌.. ముగ్గురి అరెస్ట్‌ | Three held in Chhattisgarh after Instagram video | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ ఆ వీడియో పోస్ట్‌.. ముగ్గురి అరెస్ట్‌

Aug 27 2026 9:22 PM | Updated on Aug 27 2026 9:22 PM

Three held in Chhattisgarh after Instagram video

ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు యువకులు పోస్ట్‌ చేసిన ఓ వీడియో బాగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఉడుమును చంపి, వండి తింటున్నట్లు కనిపించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను గురువారం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

వీడియో వైరల్ అయిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఆ ముగ్గురి ఆచూకీని గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన మోటార్‌సైకిల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగింది. బచేలి రేంజర్‌ ప్రితేశ్‌ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను హుంగా (30), కోసా పాయం (39), నంద రామ్‌ ఓయామి (36)గా గుర్తించారు. వీరంతా జిల్లాలోని కువకొండ ప్రాంతంలోని ఖుటేపాల్‌ గ్రామానికి చెందినవారు.

అటవీ శాఖ అధికారుల ప్రకారం.. వారం రోజుల క్రితం ఈ ముగ్గురు పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లారు. అక్కడ వారికి ఉడుము కనిపించింది. దానిని పట్టుకుని చంపినట్లు, వేట దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఆ ఖాతాను అనుసరించి నిందితులను గుర్తించే ప్రయత్నం ప్రారంభించారు. వేటలో ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న 3 బండ తుపాకులు, 2 విల్లంబులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముగ్గురిపై 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టంలోని షెడ్యూల్‌ 1లో ఉడుమును చేర్చారు. రక్షిత జాతిని వేటాడితే 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

షెడ్యూల్‌ 1 అంటే అత్యధిక రక్షణ కల్పించే వన్యప్రాణుల జాబితా. ఈ జాబితాలో ఉన్న జంతువులను వేటాడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. నిందితులను గురువారం దంతేవాడ కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement