కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సద్గురు.. చేతులూ వణికాయ్‌.. | Sadhguru breaks down gloom at Isha camp | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సద్గురు.. చేతులూ వణికాయ్‌..

Aug 27 2026 5:19 PM | Updated on Aug 27 2026 5:49 PM

Sadhguru breaks down gloom at Isha camp

న్యూఢిల్లీ: నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో తమ సంస్థకు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని భావోద్వేగంతో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రకటించడంతో టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్‌ శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టిబెట్‌లోని సాగాలో ఉన్న శిబిరంలో వాతావరణం విషాదభరితంగా మారింది.

కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, సద్గురు చేతులు వణుకుతుండగా భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. భారీ విధ్వంసం జరిగిన టిబెట్‌లోని గ్యిరోంగ్‌కు వెళ్లి సహాయక చర్యలు, యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత, చైనా రాయబార కార్యాలయాలను కోరారు.

సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం సాగాలో ఉన్నారు. కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందానికి జరిగిన విషాదాన్ని వివరిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. “విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇది భయంకరమైన, అసాధారణమైన ఘటన” అని సద్గురు అన్నారు.

తన అనుచరులను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ.. గురువారం ఉదయం తాను స్వయంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే విపత్తు కారణంగా అక్కడికి వెళ్లే దాదాపు అన్ని మార్గాలు తెగిపోయాయని తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు... కానీ విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి ఏమాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.

సందేశం వచ్చిన 9 నిమిషాల్లోనే సంబంధాలు కట్‌
బృందం గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలో మొత్తం భవనం కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. వరద నీరు భవనాన్ని తాకిన క్షణాన్ని చూపించే భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితమే తాను అదే ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్నానని సద్గురు గుర్తుచేసుకున్నారు. “వారం రోజుల క్రితం మేము ఇమ్మిగ్రేషన్‌ కోసం ఉన్న అదే భవనం... ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది” అని ఆయన అన్నారు.

ఉదయం 9.05 గంటలకు బృందం నాయకుడు ఇషంగా ప్రవీణ్‌ నుంచి ఫౌండేషన్‌కు సందేశం వచ్చిందని సద్గురు తెలిపారు. “వారు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్నారని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత 9.14 గంటలకు ఇది జరిగింది” అని సద్గురు చెప్పారు.

మరోసారి భావోద్వేగం
ప్రవీణ్‌ 20 ఏళ్లకు పైగా ఈశా ఫౌండేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పేటప్పుడు సద్గురు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రవీణ్‌ నేపాల్‌ ఫోన్‌ నంబర్‌ ఆ రోజు పనిచేయడం ప్రారంభించలేదని తమ బృందం గుర్తించిందని సద్గురు తెలిపారు. “అతను సరిహద్దు దాటి ఉంటే, అతని నేపాల్‌ ఫోన్‌ పనిచేయాలి. కానీ అది పనిచేయలేదు” అని సద్గురు అన్నారు.

మంచు చరియలు విరిగిపడటం వల్ల ఈ విషాదం సంభవించి ఉండొచ్చని, విపత్తు తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సద్గురు హెచ్చరించారు. ప్రభావితమైన వారి సంఖ్య 1,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు.

అయితే సద్గురు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఫౌండేషన్‌కు బృందం నుంచి చివరిసారిగా సమాచారం వచ్చి దాదాపు 12 గంటలు గడిచాయని ఆయన తెలిపారు. దీని ఆధారంగా అన్ని ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని మాత్రం ఆయన చెప్పలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌లో ప్రభావిత ప్రాంతానికి సద్గురు, చిన్న బృందం వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వాలని సద్గురు కోరుతున్నారు.

“ఈ విషయంలో భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతమంది వ్యక్తులతో కలిసి నేను అక్కడికి వెళ్లి మనం ఏం చేయగలమో చూసేందుకు అనుమతిస్తారేమో చూస్తున్నాం” అని ఆయన అన్నారు. సద్గురు తన ప్రసంగాన్ని ముగించినా ఈశా శిబిరంలో విషాద వాతావరణం అలాగే కొనసాగింది. నేపథ్యంలో వినిపించిన రోదనలు ఆగలేదు.

నేపాల్ లో జరిగిన విధ్వంసంపై కళ్లనీళ్లు పెట్టుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్

ఇదీ చదవండి: పాకిస్థాన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు

టిబెట్‌కు సరిహద్దుగా ఉన్న నేపాల్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో సుమారు 300 మంది మరణించగా, 1,500 మంది గల్లంతయ్యారు. వరద నీరు వల‍్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది భారతీయులు గల్లంతయ్యారని నేపాల్‌ విదేశాంగ మంత్రి తెలిపారు.

ఈశా సేక్రెడ్‌ వాక్స్‌ సమన్వయకర్త స్పందన
నేపాల్‌లో వరద పరిస్థితుల కారణంగా ఈశా ఫౌండేషన్‌ ‘సేక్రెడ్‌ వాక్స్‌’ (కైలాస మానస సరోవర్‌ యాత్ర)కు వెళ్లిన పలువురు యాత్రికులు, స్వచ్ఛంద సేవకులు గల్లంతు కావడం/చిక్కుకుపోవడంపై ఈశా సేక్రెడ్‌ వాక్స్‌ సమన్వయకర్త మా గంభీరి స్పందించారు “ఊహించని పరిస్థితి ఎదురైంది. బృందం కాఠ్మాండూకు తిరిగి వస్తుండగా చైనా ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉంది. ఉదయం 9.05 గంటలకు వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు, బృందం నాయకుడు ప్రవీణ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నామని, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పారు. 10 నిమిషాల్లోనే మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. 

ఆ 10 నిమిషాల్లోనే ఈ మొత్తం విషాదం జరిగింది. మొత్తం సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో బృందంలోని అందరితో సంబంధాలు తెగిపోయాయి. మేము సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. నేపాల్‌ వైపు అన్ని సమాచార వ్యవస్థలు పనిచేయలేదు. సమాచారం తెలుసుకునేందుకు కొన్ని హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను. నేపాల్‌ వైపు మా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు ఉన్న పట్టణం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 80 మంది ఈ ఘటనతో ప్రభావితమయ్యారు. చైనా అధికారులు త్వరలో, ఆశాజనకంగా రేపు ఉదయం నాటికి ఏదైనా సమాచారం ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. మంచి వార్త వింటామనే ఆశతో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.

నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 77 మంది యాత్రికుల గురించి ఆమె మాట్లాడుతూ.. “వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూరప్‌లోని వివిధ దేశాలు, బ్రిటన్‌ నుంచి వచ్చారు. కొన్ని ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 19 దేశాల నుంచి పాల్గొన్నవారు ఉన్నారు. వారిలో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవారు. భారత్‌, నేపాల్‌లోని మొత్తం 19 రాయబార కార్యాలయాలను సంప్రదించాం. వారితో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మాకు ఎలా సహాయం చేయాలి, ఏదైనా సమాచారం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వారు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషాదం చాలా మారుమూల ప్రాంతంలో, భారీ స్థాయిలో చోటుచేసుకోవడంతో సమాచారం అందడానికి చాలా ఆలస్యం అవుతోంది” అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement