చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..! | Sagubadi: Gardenia gummifera Ayurvedic Uses, Benefits And Healing | Sakshi
Sakshi News home page

చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..!

Sep 11 2026 1:57 PM | Updated on Sep 11 2026 2:14 PM

Sagubadi: Gardenia gummifera Ayurvedic Uses, Benefits And  Healing

అల్లోపతి వైద్యం అందుబాటులో లేనప్పుడు వృక్ష వైద్యమే శరణ్యమనే రోజుల్లో చిటిమిటి పండ్ల చెట్లకు అపారమైన ఆదరణ ఉండేది. ఈ చెట్టుకు ప్రాంతాల వారీగా పైన తెలిపిన పేర్లున్నాయి. ఈ పండు చెట్టు అన్ని భాగాలు ఉపయోగపడతాయి. గార్డినియా జినస్‌లో దాదాపు 250 పుష్పించే జాతులులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి.  

ఉనికి...  
చిటిమిటి స్వస్థలం భారత ఉప ఖండం ముఖ్యంగా ఉష్ణ మండలపు ఆకులు రాల్చే అడవులలో విరివిగా పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, మడగాస్కర్, పసిఫిక్‌ ద్వీపాలు, ఆస్ట్రేలియాలో ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు అంత పెద్దగా పెరగదు. నేలను బట్టి దాదాపు 3–5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కాబట్టి పెరటిలో పెంచుకోవటానికి అనుగుణంగా ఉంటుంది. 

చిటిమిటి చెట్లు తెలుగు రాష్ట్రాలలోని అడవులు ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూల్, విశాఖపట్టణం, తెలంగాణలోని నాగరకర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల అడవుల్లో ముఖ్యంగా నల్లమల అడవుల్లో విరివిగా ఉన్నాయి. కర్ణాటకలో (అన్ని జిల్లాల్లో), ఒరిస్సా (గంజాం, మయూర్‌ బంగ్, అంగూల్, కాలహండి, సంబాల్‌పూర్‌ జిల్లాల్లో), తమిళనాడు (ఇంచుమించు అన్ని జిల్లాల్లో) ఉన్నాయి. కేరళ (ఇడుక్కు జిల్లాలో) ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ తక్కువ.

చిటిమిటి ప్రయోజనాలు  
చిటిమిటి చెట్టు అన్ని భాగాలూ ఉపయోగపడతాయి. కాబట్టి నిరంతర పరిశోధన ప్రాంతాల వారీగా చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే దేశం నలుమూలల అడవుల్లో దీని ఉనికి ఉన్నది. కలప వంట చెరకుగా వాడొచ్చు. వాసాలు (పోల్స్‌) గా పందిళ్ళకు వాడవచ్చు. దీని బెరడు, జిగురు ఆయుర్వేదంలో అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండ్లను ఆయుర్వేద వైద్యంలో వాడతారు. పండు రుచిగా ఉంటుంది, నేరుగా తినవచ్చు. పండ్ల గుజ్జులో యాంటిమైక్రోబియల్, యాంటి రాడికల్, కీటకనాశిని గుణాలు ఉన్నాయి. 

ఆకుల కషాయంలో కూడా కీటక నాశిని, యాంటీ మైక్రోబియల్‌ విలువలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు ముఖ్యంగ రక్త విరేచనాలకు, విరేచనాలకు ఈ చెట్టు భాగాలను ఉపయోగిస్తారు. మందులు బాగా పనిచేస్తాయి.  కడుపు ఉబ్బరానికి దీనితో చేసిన మందు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. 

కడుపులో మంటకు కూడా దీనితో చేసిన మందులు వాడితే నయమతుంది. అజీర్తిని కూడా దూరం చేస్తుంది. ఆకులు, పండ్లను ఆరనిచ్చి, పొడి చేసి దాన్ని వాడితే విత్తనం ద్వారా సోకే ఫంగస్‌ను అరికట్టవచ్చని నిరూపితమైంది. కీటకాల మీద మంచి ప్రభావం చూపించటం వల్ల దీన్ని కీటకనాశినిగా కూడా వాడవచ్చు (ఇజ్చిnఛీట్చ – ఝ్చజ్ఛిటజి, 2013).

ఔషధ గుణాలు
చిటిమిటి చెట్టు భాగాలతో చేసిన మందు యాంటిసెప్టిక్‌ గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా కఫం, వాత దోషాలను దూరం చేస్తుంది. ఇది మంచి పెయిన్‌ కిల్లర్‌. పుండ్లను నయం చేయటంలో దోహదకారిగా పని చేస్తుంది. చర్మ రోగాలను నయం చేస్తుంది. నట్టలను పారదోలుతుంది. దగ్గు నుంచి ఉపశమన పరుస్తుంది, ఆస్తమాను దూరం చేస్తుంది. ఇది గుండె, లివరు, ప్లీహాన్ని ఉత్తేజపరిచి చక్కటి దారిలో ఉంచుతుంది. 

జ్వరాలను తగ్గించి శరీర ఉష్ణోగ్రతలను లయబద్ధంగా ఉంచుతుంది. ఈ చెట్టు నుంచి జిగురు వస్తుంది. దాన్ని వైద్యం, ఇతర మందుల్లో పనికి వస్తుంది. జిగురుతో చేసిన చూర్ణాన్ని తేనెలో కలుపుకొని పండ్లు తోముకుంటే పంటి, చిగుళ్ళ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. చూర్ణం పుండ్లపైన రాస్తే పైన చీము పట్టకుండా చేసి పుండ్లు త్వరగా మానటానికి దోహదం చేస్తుంది. ఈ పండ్లను మధుమేహం ఉన్న వారు కూడా తినవచ్చు. చిటిమిటి పండ్లు అందరూ తినదగినవి, రుచికరమైనవి.  

ఆటుపోట్లను తట్టుకున్న జాతులు
చిటిమిటి చెట్లు అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికి నల్లమల అడవుల్లో ఉన్న చిటమిటికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడి వాతావరణంలో మార్పులు ఇక్కడ పెరుగుతున్న వృక్షజాలాన్ని ఎన్నో ఆటుపోట్లకు గురిచేశాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొన్న ఈ జాతి చెట్లను కాపాడుకోవటం అత్యవసరం. 

వీటిలో మెరుగైన పోషక, ఔషధ విలువలు ఉన్నందున వీటి పండ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా పరిశోధనలు చేపట్టాలి. ఈ అరుదైన అటవీ పండ్ల జాతుల సంపదను పెంచగలిగితే లాభసాటిగా ఉంటుంది. చిటిమిటి పెరటి చెట్టుగా మారితే ఆ ఇంట్లో వారి ఒంట్లో పోషక లోపాలు తీరినట్లే భావించవచ్చు.  

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

(చదవండి: పురుగులను అరికట్టే జిగురు అట్టలు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement