బంతిపూల బొకేలు.. ఇండియాలో ఎందుకు ఉండవు? | Marigold Flowers Bouquet Trend Details | Sakshi
Sakshi News home page

బంతిపూల బొకేలు.. ప‌శ్చిమ దేశాల్లో కొత్త ట్రెండ్‌

Sep 21 2026 7:58 PM | Updated on Sep 21 2026 8:12 PM

Marigold Flowers Bouquet Trend Details

మన పూజా గదులు, పెళ్లి మండపాలు, ద్వార తోరణాలు, రాజకీయ సభల వేదికలు.. ప్రదేశమేదైనా సరే, కనిపించే ఏకైక రంగు ‘బంతిపూల’ప్రకాశవంతమైన కాంతి. మన సంస్కృతిలో, ప్రతి శుభకార్యంలో బంతిపూల ఉనికి తప్పనిసరి. అయితే తాజాగా విదేశాలలో కూడా ఫ్లోరిస్ట్‌ షాపుల్లో బంతిపూలకు లభిస్తున్న గౌరవం, ఒక మోడర్న్‌ ఫ్లోరల్‌ ఆర్ట్‌గా పొందుతున్న గుర్తింపు చూస్తుంటే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! అవును, విదేశాలలో ఇప్పుడు ‘బంతిపూల బొకేలు’సరికొత్త ట్రెండ్‌గా మారాయి. పశ్చిమ దేశాల్లో వీటిని అధునాతన పూలగుచ్ఛాలలో ప్రధాన ఆకర్షణగా ఉపయోగిస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇవి కేవలం సంప్రదాయ వేడుకలకే పరిమితమై, బొకేల సంస్కృతికి దూరంగా ఉండిపోయాయి.

మెక్సికో నుంచి మన ముంగిట్లోకి..! 
బంతిపూలు పక్కా భారతీయ జాతి అనుకుంటే పొరపాటే. ఇవి 16వ శతాబ్దంలో స్పానిష్‌, పోర్చుగీస్‌ వర్తకుల ద్వారా మెక్సికో నుంచి మన దేశానికి వచ్చాయి. ఇక్కడి నేల, వాతావరణం, మన సంప్రదాయాలకు ఇవి ఎంతలా అలవాటు పడ్డాయంటే... ఇవాళ బంతిపూలు లేని భారతీయ వేడుకను ఊహించుకోవడం కూడా కష్టమే.

న్యూజెర్సీలో ‘బంతుల’హంగామా 
న్యూజెర్సీలోని స్థానిక ఫ్లవర్‌ మార్కెట్లను గమనిస్తే.. పాస్టెల్‌–పింక్, సాఫ్ట్‌ ఎల్లో గులాబీలు, లిల్లీలు, పచ్చని ఆకుల నడుమ ప్రకాశవంతమైన నారింజ రంగు బంతిపూలను అమర్చి అద్భుతమైన బొకేలు తయారు చేస్తున్నారు. బంతిపూలలో ఉండే దట్టమైన రేకులు, రిచ్‌ ఎర్తీ లుక్‌ ఆ పూలగుచ్ఛానికే ఒక ప్రత్యేకమైన విలువను, ఎనర్జీని తెచ్చిపెడుతున్నాయి. లేలేత రంగులకు, బంతిపూల నారింజ రంగు ఇచ్చే కాంట్రాస్ట్‌ పాశ్చాత్య దేశాలలో ట్రెండ్‌ సెట్టర్‌గా మారింది.

ఇండియాలో ఎందుకు ఉండవు? 
మనదేశంలో బంతిపూలను మోడర్న్‌ బొకేలలో వాడకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, సాంస్కృతిక మనస్తత్వం. మన ఆలోచనల్లో బంతిపూలు అంటే గుడులు, దండలు, మండపాల డెకరేషన్‌ మాత్రమే. ‘బ్లూమింగ్‌ టేల్స్‌’వ్యవస్థాపకుడు మను మహల్‌వార్‌ తెలిపినట్లు.. ఇవి మతపరమైన భక్తి భావాలతో లోతుగా ముడిపడి ఉన్నాయి. పైగా, ఇవి అతి చౌకగా, ప్రతిచోటా విరివిగా లభించడం వల్ల భారతీయ వినియోగదారులు వీటిని ‘లగ్జరీ మెటీరియల్‌’గా చూడలేకపోతున్నారు. రెండోది, భారతదేశంలోని హోల్‌సేల్‌ మార్కెట్లలో బంతిపూలు కేవలం దండలు అల్లడానికి వీలుగా ‘విడి పూల’రూపంలోనే లభిస్తాయి. బొకేలు చేయడానికి కావలసిన పొడవైన, గట్టి కాడలతో కూడిన బంతిపూలు మార్కెట్లో అసలు దొరకవు.

ఇదీ చ‌ద‌వండి: వ్యాయామం తర్వాత కంప్రెషన్‌ దుస్తులు ఎందుకు ధరిస్తారు?

దండల నుంచి.. గ్లోబల్‌ బొకేల వైపు! 
బంతిపూలలో ఒక అద్భుతమైన కనువిందు చేసే అందం దాగి ఉంది. మనం చూసే కోణాన్ని కొద్దిగా మార్చితే, ఆధునిక ఫ్లోరిస్ట్రీకి (అలంకరణ కళ) ఇదొక కొత్త వన్నె తెచ్చిపెడుతుంది. బంతిపూలను కేవలం దండలకే పరిమితం చేయకుండా, విదేశీ రీతిలో మోడర్న్‌ బొకేలలో అమర్చితే అవి ఇచ్చే రంగుల వెల్లువ అద్భుతంగా ఉంటుంది.  

ఎప్పుడైనా మీ ప్రియమైన వారికి ప్రత్యేకమైన బొకే ఇవ్వాలనుకుంటే... అందులో కాస్త బంతిపూల కళను జోడించి చూడండి, అది తెచ్చే డిజైన్‌ సరికొత్తగా ఉంటుంది!  
– సాక్షి స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement