నావి.. బిగ్‌ బాస్‌ కళ్లు! | Surprising Facts About Dragonflies And Stone Flowers, Nature’s Amazing Survival Adaptations | Sakshi
Sakshi News home page

నావి.. బిగ్‌ బాస్‌ కళ్లు!

May 29 2026 11:22 AM | Updated on May 29 2026 12:52 PM

Surprising Facts About Dragonflies And Stone Flowers

అచ్చం చిన్న చిన్న రాళ్లలాగే కనిపిస్తున్న రాతిపూలు!

తూనీగ తన వెనుక ఏం జరుగుతుందో కూడా ఈజీగా చూసేయగలదు! ఎందుకంటే దాని తల మొత్తం కళ్లతోనే నిండి ఉంటుంది. మనకు రెండు కళ్లు ఉంటాయి కదా? కానీ తూనీగకు ఒక్కో కంటిలో దాదాపు 30,000 చిన్న కళ్లు ఉంటాయి. అంటే దానికి మొత్తం 60,000 కళ్లు ఉన్నట్లే! దీనినే కాంపౌండ్‌ ఐ అంటారు.

ఈ ఏర్పాటు వల్లే తూనీగ తన తల తిప్పకుండానే ఒకేసారి చుట్టూ చూడగలదు. అందుకే దానిని పట్టుకోవడం చాలా కష్టం. మీరు వెనుక నుంచి వెళ్లినా అది మిమ్మల్ని కనిపెట్టేస్తుంది! అంతే కాదు తూనీగలు మనకు కనిపించని ఎన్నో అద్భుతమైన రంగులను చూడగలుగుతాయి. మనకంటే తూనీగలు చాలా వేగంగా ప్రపంచాన్ని చూడగలవు.

మనం చూసే ప్రతిదీ వాటికి ‘స్లో మోషన్‌’ సినిమా లాగా కనిపిస్తుంది. అందుకే గాల్లో ఎగిరే దోమలను, ఈగలను అవి అంత ఈజీగా పట్టుకోగలవు. వీటికి రాత్రి పూట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తూనీగలు అంత వేగంగా ఎగరడానికి, వాటి ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ అద్భుతమైన కళ్లే వాటికి హెల్ప్‌ చేస్తాయి!

రాతిపూలు!
అచ్చం చిన్న చిన్న రాళ్లలాగే కనిపిస్తున్న ఈ మొక్కలను ‘లివింగ్‌ స్టోన్స్‌’ (బతికుండే రాళ్లు), లేదా లిథాప్స్‌ అని పిలుస్తారు. జంతువులు వీటిని చూసి  తినకుండా వదిలేయడానికే ఇవి ఇలా రాళ్లలా నటిస్తాయి. ఈ మొక్కలకు మిగతా మొక్కల్లా పొడవాటి కాడలు, ఆకులు ఉండవు. కేవలం రెండు మందపాటి ఆకులు కలిసిపోయి ఒక రాయిలా కనిపిస్తాయి. ఆఫ్రికాలోని ఎడారుల్లో పెరిగే ఈ మొక్కలకు చాలా తక్కువ నీరు అవసరం.


తమ మందపాటి ఆకుల్లో నీటిని దాచి పెట్టుకుని, నీరు లేకపోయినా చాలా రోజులు బతికేస్తాయి. ఎడారిలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇవి ఎండదెబ్బ తగలకుండా భూమి లోపలికి కొద్దిగా ముడుచుకుంటాయి. కేవలం వాటి పైభాగం మాత్రమే బయటకు కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు లేదా శరదృతువు వచ్చినప్పుడు వీటినుంచి అందమైన పువ్వులు పూస్తాయి. రెండు ఇంచులు మాత్రమే పెరిగే వీటిని చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement