కొన్ని పూలకే వాసనెందుకు? | A Fragrance Of Jasmine, Rose And Mandarin Flowers | Sakshi
Sakshi News home page

కొన్ని పూలకే వాసనెందుకు?

May 30 2026 11:51 AM | Updated on May 30 2026 12:28 PM

A Fragrance Of Jasmine, Rose And Mandarin Flowers

సైన్స్‌ సంగతి

మల్లెపూలు గుప్పుమంటాయి. గులాబీలు ఘుమఘుమలాడతాయి. కానీ మందారం, పొద్దుతిరుగుడు పూలకు వాసన ఉండదు. ఎందుకో తెలుసా? పూలు ఊరికే వానసనను వెదజల్లవు. తమ వంశం పెరగాలి కదా! అందుకే వాసనను ’పెర్‌ఫ్యూమ్‌’లా వాడతాయి.

పువ్వు లోపల సూక్ష్మమైన ‘సుగంధ తైలాలు’ ఉంటాయి. ఎండ వేడికి అవి ఆవిరై గాలిలోకి వస్తాయి. ఆ వాసనకు సీతాకోకచిలుకలు, తేనెటీగలు ‘అబ్బా, తేనె ఉంది‘ అని ఎగిరి వస్తాయి. అవి తేనె తాగుతూ ఒక పువ్వు పుప్పొడిని ఇంకో పువ్వుకు అంటిస్తాయి. దాన్నే ‘పరాగ సంపర్కం’ అంటారు. దానివల్లే కాయలు, విత్తనాలు వస్తాయి.

మరి మందారానికి వాసన ఎందుకు లేదు? దాని రంగే పెద్ద సిగ్నల్‌ బోర్డు. ఎర్రగా, పెద్దగా ఉంటుంది కదా. పక్షులు, సీతాకోకచిలుకలు దూరం నుంచే చూసి వాలిపోతాయి. వాటికి ముక్కు కంటే కన్నే గట్టిది. అందుకే వాసన అవసరం లేదు. పొద్దుతిరుగుడు కూడా అంతే. 

కొన్ని పూలు రాత్రిపూట మాత్రమే వాసన వస్తాయి. బ్రహ్మకమలం, రాత్రిరాణి లాంటివి. ఎందుకంటే వాటికి పరాగ సంపర్కం చేసేది రాత్రి తిరిగే మాత్‌లు, గబ్బిలాలు. చీకట్లో రంగు కనిపించదు కాబట్టి, వాసనే వాటి అడ్రస్‌. అంటే వాసన ఉండడం పువ్వు తెలివి. ఎవరిని పిలవాలో దానిని బట్టి పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకుంటుంది. ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లేసియా’. దానికి వాసన ఉంటుంది కానీ... కుళ్లిన మాంసం వాసన! ఎందుకంటే దానికి కావాల్సింది సీతాకోకచిలుక కాదు, ఈగలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement