భార్యల ప్లే గ్రౌండ్
భర్తలు టెన్నిస్‌కు వెళ్లడం... అపార్ట్‌మెంట్ ఏరియాలో బాడ్మింటన్ ఆడటం... భార్యలు వంట చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం... ఈ రొటీన్ నడ్డి విరగ్గొట్టారు కోయంబత్తూరు స్త్రీలు. ఇక్కడి ‘యమునా నగర్ గ్రౌండ్’ అచ్చంగా పెళ్లయిన స్త్రీల ఆటస్థలం.
కొత్త వధువులతో మొదలు అమ్మమ్మల వరకు అందరూ సాయంత్రమైతే ఆడటానికి వస్తుంటే భర్తలు మైదానం బయట వెయిట్ చేస్తుంటారు. ఆసియన్ గేమ్స్‌లో తెచ్చే మెడల్సు అవసరమే. ఇలాంటి గ్రౌండ్స్ వల్ల వివాహితలు పొందే హ్యాపీనెస్ మెడల్స్ అంతకు తక్కువ కాదు.
సాయంత్రపు చలిగాలి మొదలవుతుండగానే ఆ గ్రౌండ్‌లో వేడి మొదలైపోతుంది. ఫ్లడ్‌లైట్లు వెలుగుతాయి. ఒక కోర్టులో త్రోబాల్, పక్క కోర్టులో షటిల్. ‘ఏయ్, గట్టిగా కొట్టవే’ అని ఒకామె కేక పెడితే, అవతలివైపు నుంచి ఒకామె బంతిని నేలకు బాదుతుంది. పాయింట్ వచ్చినా పోయినా ఒకటే సీన్– కేరింతలు, నవ్వులు, గట్టిగా హైఫైవ్‌లు. ఇక్కడ స్కోర్ బోర్డు లేదు. ఎవరూ ఓడరు. గెలిచినట్టు ఫీలవ్వడమే రూల్. అదే ఈ గ్రౌండ్ మ్యాజిక్.
నుదుటి చెమటను కొంగుతో తుడుచుకుంటూ ముత్తమ్మ అనే ఆమె చెప్పిన మాట– ‘స్కూల్ రోజుల్లో వాలీబాల్ అంటే నాకు ప్రాణం. పెళ్లయ్యాక ఆ కలలన్నీ వంటింటి గోడల మధ్యే మగ్గిపోయాయి. 35 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్‌తో నా నిరీక్షణ తీరింది. నేను, నా కూతురు, నా మనవరాలు ముగ్గురం ఒకే కోర్టులో ఆడుతున్నాం. ఒకే టీమ్‌లో. ఇంతకంటే ఏం కావాలి?’ ఈ మాట అనేవాళ్లు ప్రతి ఊళ్లో వేలమంది ఉన్నారు. కానీ వాళ్లకు ఒక యమునా నగర్ ఉందా... అన్నదే ప్రశ్న.
వంటింటి అలసటకు చెక్
ఆడవాళ్లకు రోజంతా ఒకటే లూప్. ఇల్లు, పిల్లలు, ఆఫీసు, మళ్లీ ఇల్లు. దీంతో చిన్నవయసులోనే డయాబెటిస్, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు, అంతకుమించి ఎవరికీ చెప్పుకోలేని మానసిక ఒంటరితనం. డాక్టర్లు రాసే మందు చీటీల కంటే ఈ గ్రౌండ్ బాగా పని చేస్తుందని యమునా నగర్ నిరూపిస్తోంది.
అక్కడే ఆడుతున్న ఒక వర్కింగ్ ఉమన్ ఏమందంటే– ‘నాలుగున్నరకి గ్రౌండ్‌లోకి అడుగుపెడితే చాలు ఇల్లు, ఆఫీసు, టెన్షన్లన్నీ గేటు బయటే వదిలేస్తాం. రాత్రి తొమ్మిది వరకు ఆడుతాం. బంతిని నెట్ అవతలికి కొట్టిన ప్రతిసారీ బుర్రలోని భారం కూడా అవతల పడినట్టు ఉంటుంది’. నిజమే. నవ్వుతూ, అరుస్తూ, తోటివారితో కలిసి ఆడే ఆట ఇచ్చే ఫిట్‌నెస్, మెంటల్ పీస్ జిమ్‌లో రాదు. ఆరోగ్య నిపుణులు కూడా చెప్పేది అదే కదా.
‘ఈ వయసులోనా?’ బిడియానికి బ్రేక్
మొదట్లో ఈ గ్రౌండ్‌లో ఒకరిద్దరే ఉండేవారు. చాలామంది ఆడవాళ్లకు ఒకటే భయం – ‘ఈ వయసులో షార్ట్స్ వేసుకుని ఆడితే ఏమనుకుంటారు? నా వల్ల అవుతుందా?’ కానీ యమునా నగర్ గ్రౌండ్ ఆ భయాన్ని పోగొట్టింది. ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్లంతా తనలాంటి ఇల్లాళ్లే. జడ్జ్ చేసేవాళ్లు ఎవరూ లేరు. అందుకే ట్రాక్‌సూట్ లేకపోయినా చీరతోనే, కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌తోనే మైదానంలోకి దూకేశారు. గ్రౌండ్‌లోకి రాగానే వయసు, హోదా అన్నీ మర్చిపోయి అందరూ ఒకటే టీమ్ అయిపోతున్నారు.
ఈ గ్రౌండ్ ఎలా పుట్టింది?
దీని వెనుక ఒక 75 ఏళ్ల పెద్దాయన మంచి మనసు ఉంది. ఆయన పేరు ఎస్.ఆర్.అరుచామి. కోయంబత్తూరు యమునా నగర్‌కే చెందిన మాజీ నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్. పెళ్లయ్యాక ఆడవాళ్ల ఆట జీవితం ఎలా ముగిసిపోతుందో ఆయన చాలా దగ్గర్నుంచి చూశాడు. అందుకే తన సొంత స్థలాన్ని గ్రౌండ్‌గా మార్చాడు. రెండు త్రోబాల్ కోర్టులు, ఒక వాలీబాల్ కోర్టు వేశాడు. ఆడవాళ్లు పనులు ముగించుకుని సాయంత్రం వచ్చి ఆడుకునేలా ఫ్లడ్ లైట్లు పెట్టాడు. ఇప్పటికీ లైట్‌బిల్లు, మెయింటెనెన్స్ అంతా తన సొంత ఖర్చుతోనే భరిస్తున్నాడు. రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఒకరిద్దరి తో మొదలైన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు 65 మంది గృహిణుల పెద్ద కుటుంబంగా మారింది.
భర్తలు బయట ఉండాలి
ఈ మైదానంలో అందమైన రూల్ ఒకటుంది. కోర్టులో ఆడేది ఆడవాళ్లే. భర్తలు గ్రౌండ్ బయటే ఉండాలి. పిల్లల్ని చూసుకోవాలి, వాటర్ బాటిల్ అందించాలి. ఇన్నాళ్లూ భర్త ఆడి వస్తే భార్య కాఫీ కప్పుతో ఎదురు చూసేది. ఇప్పుడు భార్య హుషారుగా స్మాష్ కొడుతుంటే భర్త చప్పట్లు కొడుతూ ఎదురు చూస్తున్నాడు. భార్య సంతోషం కోసం భర్త సపోర్ట్‌గా మారడం ఇంతకంటే సమానత్వం ఏముంటుంది? ఒక గృహిణి మనసు హ్యాపీగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. అందుకే యమునా నగర్ లాంటి చిన్న గ్రౌండ్స్ ప్రతి కాలనీ లో, ప్రతి పల్లెలో వెలియాలి. అప్పుడే ప్రతి స్త్రీ మెడలో ఒక హ్యాపీనెస్ మెడల్ పడుతుంది. ∙


