ఫస్ట్ టైమ్
పన్నెండేళ్ల వయసులో ఒక సెలూన్‌కు వెళ్లిన సుచికను చూసి అక్కడ పనిచేసే వ్యక్తి వెకిలిగా నవ్వాడు. అసభ్యకరంగా తాకాడు. ఆ చేదు అనుభవం సుచికను మార్షల్ ఆర్ట్స్ వైపు నడిపించడం ఒక ఎత్తయితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా దూసుకెళ్లడం మరో ఎత్తు.
తాజాగా... ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో... మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుధానాలో పుట్టిన సుచికా తరియాల్ హరియాణాలోని రోహ్‌తక్‌లో పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చినా ఆ తరువాత ఒప్పుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోకి అడుగు పెట్టడంతో తన సత్తా చాటే అవకాశం సుచికకు వచ్చింది. జూడో, కురాష్, జూజిట్స్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఎనిమిది సార్లు నేషనల్ జూడో ఛాంపియన్‌గా నిలిచింది.
ఆర్థిక కష్టాలు
సుచిక తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తన క్రీడా ప్రయాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ‘నాకు ఆర్థికంగా సమస్యలు ఉండేవి. అలాంటి సమయంలో నా భర్త సహాయం చేసేవారు. ధైర్యం చెప్పేవారు. అందుకే ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, భర్తకు అంకితం చేస్తున్నాను’ అంటుంది 36 ఏళ్ల సుచిక.
జర్నీ ఉమెన్
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో 2017లో అరంగేట్రం చేసింది సుచిక. ఆ తరువాత జూడో, జూజిట్స్ క్రీడలలో విజయవంతంగా రాణిస్తూనే ‘ఎంఎంఏ’కు కొన్ని సంవత్సరాల పాటు విరామం ఇచ్చింది. 2024లో బహ్రేయిన్‌లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92 ఈవెంట్ ద్వారా ‘ఎంఎంఏ’లోకి తిరిగి అడుగు పెట్టింది. సుచికను ‘జర్నీ ఉమెన్’ అని కూడా పిలుస్తుంటారు. జూడో నుండి కురాష్, జూ–జిట్స్ మీదుగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లోకి మారింది.
ఆరాధ్య దేవత
‘నాకు చిన్నప్పటి నుంచి అక్కడ మేరీ కోమ్ అక్క అంటే చాలా ఇష్టం. భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిక్షణ శిబిరంలో ఆమెను చూశాను. ఆమె వేసుకున్న దుస్తులు, ప్రవర్తించే తీరు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. ఆమె నా ఆరాధ్యదేవత. నేను ఆమెతో ఎప్పుడూ వ్యక్తిగతం గా మాట్లాడలేదు. ఒకవేళ అవకాశం దొరికితే ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను’ అంటుంది సుచిక.
యస్... రాణించగలను...సాధించగలను!
ఎంఎంఏలో ప్రత్యేక శిక్షణ, ఆ క్రీడలో మునపటికంటే మెరుగైన నైపుణ్యంతో ఆసియా గేమ్స్ బరిలోకి దిగి కాంస్యాన్ని సాధించింది సుచిక. క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్ చిమెగ్‌ను ఓడించింది.
బరువైన నిర్ణయం!
కంబాట్ స్పోర్ట్స్‌లో పోటీకి ముందు ప్రతి అథ్లెట్ బరువు తూచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రిఫరీలు నిర్వహిస్తారు. బరువు తూచడానికి ఒక గంట ముందు వరకు ట్రయల్ వెయిట్–ఇన్‌ల కోసం అధికారిక తూనిక యంత్రాలను ఉపయోగించుకునే హక్కు అథ్లెట్‌లకు ఉంటుంది. బరువు ఎక్కువైనా, బరువు తూచడంలో పాల్గొనకపోయినా పోటీ నుండి అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ బరువు తూచడాలు ఆటలో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రా అయిన పోటీలో ఇవి అంతిమంగా విజేతను నిర్ణయిస్తాయి. తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా నిర్ణయిస్తారు.
ఎందుకలా?!
ఫైనల్‌లోకి అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో తలపడింది సుచిక. హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది.
ఇద్దరు ఫైటర్‌లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు. రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అంటుంది సుచిక.
రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్‌లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆసియా క్రీడలలో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.
‘ ఇది నా జీవితం కంటే విలువైనది. జపాన్‌కు వచ్చి నా దేశానికి పతకం తీసుకువెళుతున్నానన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోలేను. ఇక నేను సంతోషంగా చనిపోవచ్చు. ఆసియా గేమ్స్ తరువాత ఎంఎంఏకి స్వప్తి పలకాలని అనుకున్నాను. అయితే ఇప్పటికీ నాలో శక్తి ఉందని అనిపిస్తోంది. ఈరోజు నా పెర్‌ఫార్మెన్స్‌ను విశ్లేషించుకున్న తరువాత ఇంకా రాణించగలనని అనిపిస్తోంది’ భావోద్వేగంతో... ఆత్మవిశ్వాసంతో నిండిన గొంతుతో అంటుంది సుచికా తరియాల్.
– యాకుబ్ పాషా


