breaking news
judo championship
-
ఫైటర్ విత్ ఫైర్
పన్నెండేళ్ల వయసులో ఒక సెలూన్‌కు వెళ్లిన సుచికను చూసి అక్కడ పనిచేసే వ్యక్తి వెకిలిగా నవ్వాడు. అసభ్యకరంగా తాకాడు. ఆ చేదు అనుభవం సుచికను మార్షల్ ఆర్ట్స్ వైపు నడిపించడం ఒక ఎత్తయితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా దూసుకెళ్లడం మరో ఎత్తు.తాజాగా... ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో... మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుధానాలో పుట్టిన సుచికా తరియాల్ హరియాణాలోని రోహ్తక్లో పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చినా ఆ తరువాత ఒప్పుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోకి అడుగు పెట్టడంతో తన సత్తా చాటే అవకాశం సుచికకు వచ్చింది. జూడో, కురాష్, జూజిట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఎనిమిది సార్లు నేషనల్ జూడో ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్థిక కష్టాలుసుచిక తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తన క్రీడా ప్రయాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ‘నాకు ఆర్థికంగా సమస్యలు ఉండేవి. అలాంటి సమయంలో నా భర్త సహాయం చేసేవారు. ధైర్యం చెప్పేవారు. అందుకే ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, భర్తకు అంకితం చేస్తున్నాను’ అంటుంది 36 ఏళ్ల సుచిక.జర్నీ ఉమెన్మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో 2017లో అరంగేట్రం చేసింది సుచిక. ఆ తరువాత జూడో, జూజిట్స్ క్రీడలలో విజయవంతంగా రాణిస్తూనే ‘ఎంఎంఏ’కు కొన్ని సంవత్సరాల పాటు విరామం ఇచ్చింది. 2024లో బహ్రేయిన్లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92 ఈవెంట్ ద్వారా ‘ఎంఎంఏ’లోకి తిరిగి అడుగు పెట్టింది. సుచికను ‘జర్నీ ఉమెన్’ అని కూడా పిలుస్తుంటారు. జూడో నుండి కురాష్, జూ–జిట్స్ మీదుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లోకి మారింది.ఆరాధ్య దేవత‘నాకు చిన్నప్పటి నుంచి అక్కడ మేరీ కోమ్ అక్క అంటే చాలా ఇష్టం. భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిక్షణ శిబిరంలో ఆమెను చూశాను. ఆమె వేసుకున్న దుస్తులు, ప్రవర్తించే తీరు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. ఆమె నా ఆరాధ్యదేవత. నేను ఆమెతో ఎప్పుడూ వ్యక్తిగతం గా మాట్లాడలేదు. ఒకవేళ అవకాశం దొరికితే ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను’ అంటుంది సుచిక.యస్... రాణించగలను...సాధించగలను!ఎంఎంఏలో ప్రత్యేక శిక్షణ, ఆ క్రీడలో మునపటికంటే మెరుగైన నైపుణ్యంతో ఆసియా గేమ్స్ బరిలోకి దిగి కాంస్యాన్ని సాధించింది సుచిక. క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్ చిమెగ్ను ఓడించింది.బరువైన నిర్ణయం!కంబాట్ స్పోర్ట్స్‌లో పోటీకి ముందు ప్రతి అథ్లెట్ బరువు తూచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రిఫరీలు నిర్వహిస్తారు. బరువు తూచడానికి ఒక గంట ముందు వరకు ట్రయల్ వెయిట్–ఇన్ల కోసం అధికారిక తూనిక యంత్రాలను ఉపయోగించుకునే హక్కు అథ్లెట్లకు ఉంటుంది. బరువు ఎక్కువైనా, బరువు తూచడంలో పాల్గొనకపోయినా పోటీ నుండి అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ బరువు తూచడాలు ఆటలో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రా అయిన పోటీలో ఇవి అంతిమంగా విజేతను నిర్ణయిస్తాయి. తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా నిర్ణయిస్తారు.ఎందుకలా?!ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో తలపడింది సుచిక. హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు. రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అంటుంది సుచిక. రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆసియా క్రీడలలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.‘ ఇది నా జీవితం కంటే విలువైనది. జపాన్‌కు వచ్చి నా దేశానికి పతకం తీసుకువెళుతున్నానన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోలేను. ఇక నేను సంతోషంగా చనిపోవచ్చు. ఆసియా గేమ్స్ తరువాత ఎంఎంఏకి స్వప్తి పలకాలని అనుకున్నాను. అయితే ఇప్పటికీ నాలో శక్తి ఉందని అనిపిస్తోంది. ఈరోజు నా పెర్ఫార్మెన్స్ను విశ్లేషించుకున్న తరువాత ఇంకా రాణించగలనని అనిపిస్తోంది’ భావోద్వేగంతో... ఆత్మవిశ్వాసంతో నిండిన గొంతుతో అంటుంది సుచికా తరియాల్.– యాకుబ్ పాషా -
పట్టుదలే పెట్టుబడిగా...
విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో జూడో ఒకటి. జపాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, మంగోలియా దేశాలు ఈ క్రీడలో ఎంతోమంది ప్రపంచ చాంపియన్లను అందించాయి. భారత్ విషయానికొస్తే ప్రాతినిధ్యమే తప్ప పతకాల గురించి ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. కానీ ప్రతిభావంతులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఈ క్రీడలోనూ భారత ప్లేయర్లు మెరిపిస్తారని మణిపూర్ అమ్మాయి ఇనున్‌గన్‌బీ తఖెల్లంబం నిరూపించింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో ఇనున్‌గన్‌బీ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు కాంస్యం రూపంలో పతకాన్ని అందించింది.భారత్ నుంచి చివరిసారి అనితా చాను రూపంలో ఆసియా జూడో చాంపియన్‌షిప్ మెడలిస్ట్‌ను చూశాము. 2013లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె కూడా కాంస్య పతకం సాధించింది. 13 ఏళ్ల తర్వాత అనితా చాను కోచ్ హోదాలో హాజరైన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మళ్లీ పతకం లభించింది. మహిళల 70 కేజీల విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇనున్‌గన్‌బీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. కాంస్య పతక పోరులో మంగోలియా జూడోకాపై ఇనున్‌గన్‌బీ నెగ్గింది. ఇక ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని మణిపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఇనున్‌గన్‌బీ వెల్లడించింది. చాన్నాళ్లుగా జాతీయ జట్టు బ్లేజర్ వెంట తీసుకెళ్తున్న అనిత ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలిసారి దానిని ధరించింది. ‘కోచ్ అనిత మొదటి టోర్నీ నుంచి బ్లేజర్ వెంట పెట్టుకొని వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దాన్ని వేసుకునే సందర్భం రాలేదు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఆమె నన్ను అడిగారు. ఈ సారైనా బ్లేజర్ వేసుకోనిస్తావా అని. నేను అప్పుడే చెప్పా తప్పకుండా అని. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత నేను కాంస్యం సాధించడం ద్వారా పతక ప్రదానోత్సవం సందర్భంగా ఆమె బ్లేజర్ వేసుకున్నారు’ అని వెల్లడించింది. జూడోలో సాధారణంగా కోచ్‌లు ట్రాక్ సూట్లే ధరిస్తారు. పతక ప్రదానోత్సవంలో బ్లేజర్ వేసుకుంటారు. ‘భారత్ తరఫున చివరిసారిగా అనిత మేడమ్ ఈ పతకం నెగ్గారని నాకు తెలియదు. ఆమె 2013 కంటే చాలా ముందే మెడల్ గెలిచి ఉంటారని అనుకున్నా. ఆమె తర్వాత పతకం నెగ్గిన తొలి భారతీయురాలిని నేనే అని కోచ్‌లు చెప్పినప్పుడు నా ఆనందరం రెట్టింపు అయింది. 2021 నుంచి భారత సీనియర్ జట్టులో ఉన్నా. ఇప్పటి వరకు పాల్గొన్న ఏ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటి ముందుకు వెళ్లలేకపోయా. ఇది నా కెరీర్లోనే అతిపెద్ద విజయం. ఈ ఫలితం నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది. గాయాల నుంచి కోలుకొని... దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, మేటి వెయిట్‌లిఫ్టర్ కుంజారాణి దేవి వంటి సూపర్‌స్టార్స్ వచ్చిన నేల మణిపూర్ నుంచే ఇనున్‌గన్‌బీ వెలుగులోకి వచి్చంది. ఇతర ప్లేయర్ల లాగే ఆమె కూడా కెరీర్ తొలి నాళ్లలో అనేక ఆటలు ప్రయత్నించి చివరకు జూడోను ఎంచుకుంది. ‘చిన్నప్పటి నుంచి కుంజారాణి దేవి, మేరీకోమ్ వంటి వారు సాధించిన ఘనతల గురించి చాలా విన్నాను. వాళ్లలాగే దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకునేదాన్ని. వారి బాటలోనే క్రీడలను ఎంచుకోవాలని ముందే భావించా. ఫుట్‌బాల్ సహా చాలా ఆటలు ఆడా... కానీ జూడో నా దృష్టిని ఆకర్షించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది. కెరీర్ ఆరంభంలో మణిపూర్‌లోని జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె... ఆ తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. 2018లో ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడిన ఇనున్‌గన్‌బీ... శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తిగా చిక్కిపోయింది. ‘నా శరీరం పెన్సిల్ లాగా అయిపోయింది’ అని ఒక సందర్భంలో ఈ మణిపూర్ జూడోకా తెలిపింది. ఆ తర్వాత 2024లో అదే కాలికి మరోసారి గాయం కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైంది. అయితే కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవడం అలవర్చుకున్న ఈ మణిపూర్ ముత్యం... ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో అది్వతీయ ప్రదర్శనతో చరిత్ర లిఖించింది. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ షిరిన్జోన్ యుల్డోషోవా చేతిలో ఇనుంగాన్బి పరాజయం పాలైంది. అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఫైనల్‌కు చేరడంతో... మన బాక్సర్‌కు రెపిచాజ్ అవకాశం దక్కింది. ‘క్వార్టర్లో ఓడి నిరాశగా ఉన్నప్పుడు మరో అవకాశం వచి్చంది. కాంస్య పతక పోరుకు ముందు ఈ చాన్స్ వదిలి పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని ఇనున్‌గన్‌బీ వెల్లడించింది. ఫుట్‌బాల్ వద్దనడంతో... నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇనున్‌గన్‌బీకి బాక్సింగ్, రెజ్లింగ్‌లో కూడా ప్రవేశం ఉంది. తండ్రి ఫుట్‌బాల్ ఆడేందుకు నిరాకరించడంతో ఆమె తన దృష్టిని ఇండోర్ గేమ్స్ వైపు మరల్చుకుంది. రెజ్లింగ్ ప్రాక్టీస్ సమయంలో పక్కనే జూడో శిక్షణ సాగుతుంటే దాన్ని నిశితంగా పరిశీలించేంది. అందులో కొందరు ప్లేయర్లు నల్ల బెల్ట్‌లు, కొందరు తెల్ల బెల్ట్‌లు వేసుకునే వారు. అది ఆమెను బాగా ఆకర్షించింది. అందులోనూ తన ప్రత్యేకత చాటుకోవాలని భావించిన ఇనున్‌గన్‌బీ చివరకు జూడోలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. ఆరంభంలో నాలుగేళ్ల పాటు ప్రాథమిక దశను దాటలేకపోయిన ఇనున్‌గన్‌బీ... ఆ తర్వాత నిలకడ కనబర్చింది. తొలిసారి 2021 ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఈ మణిపూర్ ప్లేయర్ మొదటి రౌండ్లోనే పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత గాయాలు వేధించినా... పట్టుదలే పెట్టుబడిగా పెట్టి... మొక్కవోని దీక్షతో ముందుకు సాగి... తాజాగా కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. గతేడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఓపెన్ జూడో పోటీల్లో ఇనున్‌గన్‌బీ పసిడి పతకం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్న ఇనున్‌గన్‌బీకి మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం! –సాక్షి క్రీడా విభాగం -
ప్రపంచ చాంపియన్ లింథోయ్
సరజెవో (బోస్నియా అండ్ హెర్జిగొవినా): ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి లింథోయ్ చనంబమ్ సంచలనం సృష్టించింది. క్యాడెట్ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్ శుక్రవారం జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్ బియాంకా (బ్రెజిల్)ను ఓడించింది. 8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్ కూడా స్వర్ణం సాధించింది. -
జూడో చాంపియన్‌షిప్ విజేత హైదరాబాద్
కరీంనగర్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు విజేతగా అవతరించింది. బాలుర విభాగంలో మాత్రం హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. రెండు రోజులుగా జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలకు తెలంగాణలోని 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర విభాగంలో వరంగల్ 33 పాయింట్లతో ఓవరాల్ టైటిల్ సాధించింది. హైదరాబాద్ 26 పాయింట్లతో ద్వితీయ స్థానం పొందింది. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 28 పాయింట్లతో చాంపియన్‌గా... వరంగల్ జట్టు 24 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ట్రోఫీలను అందజేశారు. othe -
ఓవరాల్ చాంపియన్ నిజాం కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి జూడో టోర్నమెంట్లో నిజాం కాలేజి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. జీహెచ్ఎంసీ సలార్–ఎ–మిలత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిజాం కాలేజి ప్లేయర్లు 4 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. 60 కేజీల విభాగంలో బి. పున్నం చంద్ర, 66 కేజీల విభాగంలో నిజాముద్దీన్, 81 కేజీల విభాగంలో కె. శివ, 90 కేజీల విభాగంలో ముజాహిద్ రోస్ఖాన్ నిజాం కాలేజి తరఫున పసిడి పతకాలను దక్కించుకున్నారు. 55 కేజీల విభాగంలో సయీద్ జుంబాలి (బద్రుకా), ఎం.ఏ హనన్ (అన్వర్–ఉల్–ఉలూమ్), ఎస్. రామాంజనేయ (సెయింట్ మేరీస్), కె. ఉదయ్ కిరణ్ (సీబీఐటీ) వరుసగా తొలి నాలుగు స్థానాలను సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా జూడో సంఘం అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శులు ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్, కె.దీప్లా తదితరులు పాల్గొన్నారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 60 కేజీలు: 1. బి. పున్నం చంద్ర (నిజాం కాలేజి), 2. అబ్దుర్ రషీద్, 3. మొహమ్మద్ అర్ఫత్ అలీ (అరోరా డిగ్రీ కాలేజి). 66 కేజీలు: 1. నిజాముద్దీన్ (నిజాం కాలేజి), 2. కె. సాయి కుమార్ (ఐఐఎంసీ), 3. ఎం. శరణ్ బసప్ప (బీజేఆర్ కాలేజి). 73 కేజీలు: 1. సాజిద్ అలీ ఖాన్ (అన్వర్– ఉల్–ఉలూమ్), 2. షేక్ మొయిన్ (బీజేఆర్ డిగ్రీ కాలేజి), 3. షేక్ మొహమ్మద్ అబ్దుల్లా (టీఎంఎస్‌ఎస్). 81 కేజీలు: 1. కె. శివ కుమార్ (నిజాం కాలేజి), 2. బి. సాయి తరుణ్ (బీజేఆర్ కాలేజి), 3. అలీ అమూదీ (టీఎంఎస్‌ఎస్). 90 కేజీలు: 1. ముజాహిద్ రోస్ఖాన్ (నిజాం కాలేజి), 2. సైఫుద్దీన్ మొహమ్మద్ ఖాజా (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి), 3. మొహమ్మద్ షానవాజ్ (అన్వర్– ఉల్– ఉలూమ్). 100 కేజీలు: 1. కె. కేశవ్ కుమార్ (బద్రుకా), 2. జునైద్ మొహమ్మద్ యూసుఫ్ (విద్యా దాయని), 3. మొహమ్మద్ అమీర్ ఖాన్ (అన్వర్– ఉల్–ఉలూమ్). -
దక్షిణాసియా జూడోలో ‘స్వర్ణాలు’ పండాయి
న్యూఢిల్లీ: దక్షిణాసియా సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత జూడోకాలు పతకాల పంట పండించారు. నేపాల్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో పది బంగారు పతకాలు గెలిచారు. పాల్గొన్న ఏడుగురు మహిళలూ స్వర్ణాలే గెలుపొందడం విశేషం. ఆరుగురు పురుష జూడోకాల్లో ముగ్గురు పసిడి నెగ్గారు. మహిళల కేటగిరీలో లిక్మాబమ్ సుశీలా దేవి (48 కేజీలు), కల్పనా దేవి (52 కేజీలు), అనితా చాను (57 కేజీలు), హిద్రోమ్ సునిబాలాదేవి (63 కేజీలు), గరిమా చౌదరి (70 కేజీలు), చోంగ్తామ్ జినాదేవి (78 కేజీలు), తులికా మాన్ (78 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. పురుషుల విభాగంలో విజయ్ కుమార్ (60 కేజీలు), అజయ్ యాదవ్ (73 కేజీలు), దివేశ్ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. అంకిత్ బిష్త్ (66 కేజీలు), జోబన్‌దీప్ సింగ్ (90 కేజీలు), ఉదయ్ వీర్ సింగ్ (100 కేజీలు) కాంస్యాలు నెగ్గారు. గత చాంపియన్‌షిప్ (2014)లోనూ భారత పది బంగారు పతకాలు నెగ్గింది. -
ఓటమి విజయానికి నాంది కావాలి
పరకాల, న్యూస్‌లైన్ : పోటీల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశకు గురికాకుండా గెలుపునకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. పట్టణంలోని ఎఫ్‌జే ఫంక్షన్హాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీలను బుధవారం సాయంత్రం ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పోరాటాల పురిటిగడ్డ పరకాలలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచ దేశాల సరసన మనదేశం నిలబడేలా ఈ ప్రాంతంలోని క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించాలని కో రారు. పరకాలలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రెండోరోజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సమావేశంలో జూడో రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బైరుపాక కైలాస్‌యాదవ్, ప్రోగ్రాం ఆర్గనైజర్ బండి సారంగపాణి, కాంగ్రెస్ నాయకులు సాంబారి సమ్మారావు, వీర్ల విజయ్, అజయ్‌కుమార్, దేవాదానం, కేఎల్. బాబు, నాగరాజు, వీరస్వామి పాల్గొన్నారు. రెండో రోజు విజేతలు వీరే..... 20కేజీల(ప్లస్) విభాగంలో బాలికలు : నికిత(వరంగల్) ప్రథమ, బి. వైష్ణవి (అనంతపురం) ద్వితీయ, జే. వైదేవి (చిత్తూరు), రుచిత (మహబూబ్‌నగర్) తృతీయ. 30కేజీల(మైనస్) విభాగం : జి.నవ్య (అనంతపురం) ప్రథమ, బి.అర్చన ద్వితీయ(తూర్పుగోదావరి), ఓ. రచన(నిజామాబాద్), జి.నయా(ఖమ్మం) తృతీయ. 30కేజీల(ప్లస్) విభాగం : పి.తేజస్వీని (అనంతపురం)ప్రథమ, వి.రమ్యశ్రీ(వరంగల్) ద్వితీయ, టి. పూజిత (నిజామాబాద్), బి. స్నేహా (నల్గొండ) తృతీయ. 25కేజీల(ప్లస్) విభాగంలో బాలుర విభాగం : డి.దేవేంద్ర(అనంతపురం) ప్రథమ, బి.అజయ్(కృష్ణా) ద్వితీయ, ఎం. సందీప్(తూర్పుగోదావరి), ఎం. సాయికిరణ్(నల్గొండ)లు తృతీయ. 35కేజీల(మైనస్) విభాగం : సీహెచ్. హరీష్(వరంగల్) ప్రథమ, టి. ఉదయ్‌కుమార్(చిత్తూరు) ద్వితీయ, ఏ. సంపత్‌కుమార్(నల్గొండ), డి.కల్యాణ్( అనంతపురం)లు తృతీయ. 35కేజీల(ప్లస్) విభాగం : వంశీకృష్ణ(మెదక్) ప్రథమ, ఆర్. సాయిప్రకాష్ (రంగారెడ్డి) ద్వితీయ, విక్రమ్(మహబూబ్‌నగర్), శ్రావణ్ (వరంగల్) తృతీయ గెలుపొందారు.


