పట్టుదలే పెట్టుబడిగా... | Inunganbi Takhellambam won bronze medal Asian Judo Championships | Sakshi
Sakshi News home page

పట్టుదలే పెట్టుబడిగా...

May 1 2026 4:11 AM | Updated on May 1 2026 4:11 AM

Inunganbi Takhellambam won bronze medal Asian Judo Championships

భారత జూడోలో కొత్త కెరటం ఇనున్‌గన్‌బీ తఖెల్లంబం

13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మణిపూర్‌ జూడో స్టార్‌

ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం

తదుపరి లక్ష్యం కామన్వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ గేమ్స్‌  

విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో జూడో ఒకటి. జపాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, మంగోలియా దేశాలు ఈ క్రీడలో ఎంతోమంది ప్రపంచ చాంపియన్‌లను అందించాయి. భారత్‌ విషయానికొస్తే ప్రాతినిధ్యమే తప్ప పతకాల గురించి ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. కానీ ప్రతిభావంతులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఈ క్రీడలోనూ భారత ప్లేయర్లు మెరిపిస్తారని మణిపూర్‌ అమ్మాయి ఇనున్‌గన్‌బీ తఖెల్లంబం నిరూపించింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా సీనియర్‌ జూడో చాంపియన్‌షిప్‌లో ఇనున్‌గన్‌బీ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం రూపంలో పతకాన్ని అందించింది.

భారత్‌ నుంచి చివరిసారి అనితా చాను రూపంలో ఆసియా జూడో చాంపియన్‌షిప్‌ మెడలిస్ట్‌ను చూశాము. 2013లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె కూడా కాంస్య పతకం సాధించింది. 13 ఏళ్ల తర్వాత అనితా చాను కోచ్‌ హోదాలో హాజరైన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మళ్లీ పతకం లభించింది. మహిళల 70 కేజీల విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇనున్‌గన్‌బీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. 

కాంస్య పతక పోరులో మంగోలియా జూడోకాపై ఇనున్‌గన్‌బీ నెగ్గింది. ఇక ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని మణిపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఇనున్‌గన్‌బీ వెల్లడించింది. చాన్నాళ్లుగా జాతీయ జట్టు బ్లేజర్‌ వెంట తీసుకెళ్తున్న అనిత ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలిసారి దానిని ధరించింది.

 ‘కోచ్‌ అనిత మొదటి టోర్నీ నుంచి బ్లేజర్‌ వెంట పెట్టుకొని వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దాన్ని వేసుకునే సందర్భం రాలేదు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఆమె నన్ను అడిగారు. ఈ సారైనా బ్లేజర్‌ వేసుకోనిస్తావా అని. నేను అప్పుడే చెప్పా తప్పకుండా అని. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత నేను కాంస్యం సాధించడం ద్వారా పతక ప్రదానోత్సవం సందర్భంగా ఆమె బ్లేజర్‌ వేసుకున్నారు’ అని వెల్లడించింది.

 జూడోలో సాధారణంగా కోచ్‌లు ట్రాక్‌ సూట్‌లే ధరిస్తారు. పతక ప్రదానోత్సవంలో బ్లేజర్‌ వేసుకుంటారు. ‘భారత్‌ తరఫున చివరిసారిగా అనిత మేడమ్‌ ఈ పతకం నెగ్గారని నాకు తెలియదు. ఆమె 2013 కంటే చాలా ముందే మెడల్‌ గెలిచి ఉంటారని అనుకున్నా. ఆమె తర్వాత పతకం నెగ్గిన తొలి భారతీయురాలిని నేనే అని కోచ్‌లు చెప్పినప్పుడు నా ఆనందరం రెట్టింపు అయింది. 2021 నుంచి భారత సీనియర్‌ జట్టులో ఉన్నా. ఇప్పటి వరకు పాల్గొన్న ఏ టోర్నమెంట్‌లోనూ తొలి రౌండ్‌ దాటి ముందుకు వెళ్లలేకపోయా. ఇది నా కెరీర్‌లోనే అతిపెద్ద విజయం. ఈ ఫలితం నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది.  

గాయాల నుంచి కోలుకొని... 
దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్, మేటి వెయిట్‌లిఫ్టర్‌ కుంజారాణి దేవి వంటి సూపర్‌స్టార్స్‌ వచ్చిన నేల మణిపూర్‌ నుంచే ఇనున్‌గన్‌బీ వెలుగులోకి వచి్చంది. ఇతర ప్లేయర్ల లాగే ఆమె కూడా కెరీర్‌ తొలి నాళ్లలో అనేక ఆటలు ప్రయత్నించి చివరకు జూడోను ఎంచుకుంది. ‘చిన్నప్పటి నుంచి కుంజారాణి దేవి, మేరీకోమ్‌ వంటి వారు సాధించిన ఘనతల గురించి చాలా విన్నాను. వాళ్లలాగే దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకునేదాన్ని. వారి బాటలోనే క్రీడలను ఎంచుకోవాలని ముందే భావించా. ఫుట్‌బాల్‌ సహా చాలా ఆటలు ఆడా... కానీ జూడో నా దృష్టిని ఆకర్షించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది.

 కెరీర్‌ ఆరంభంలో మణిపూర్‌లోని జాతీయ స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె... ఆ తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. 2018లో ప్రాక్టీస్‌ సమయంలో తీవ్రంగా గాయపడిన ఇనున్‌గన్‌బీ... శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తిగా చిక్కిపోయింది. ‘నా శరీరం పెన్సిల్‌ లాగా అయిపోయింది’ అని ఒక సందర్భంలో ఈ మణిపూర్‌ జూడోకా తెలిపింది.

 ఆ తర్వాత 2024లో అదే కాలికి మరోసారి గాయం కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైంది. అయితే కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవడం అలవర్చుకున్న ఈ మణిపూర్‌ ముత్యం... ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో అది్వతీయ ప్రదర్శనతో చరిత్ర లిఖించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ షిరిన్‌జోన్‌ యుల్డోషోవా చేతిలో ఇనుంగాన్బి పరాజయం పాలైంది. అయితే ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ ఫైనల్‌కు చేరడంతో... మన బాక్సర్‌కు రెపిచాజ్‌ అవకాశం దక్కింది. ‘క్వార్టర్‌లో ఓడి నిరాశగా ఉన్నప్పుడు మరో అవకాశం వచి్చంది. కాంస్య పతక పోరుకు ముందు ఈ చాన్స్‌ వదిలి పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని ఇనున్‌గన్‌బీ వెల్లడించింది.  

ఫుట్‌బాల్‌ వద్దనడంతో... 
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇనున్‌గన్‌బీకి బాక్సింగ్, రెజ్లింగ్‌లో కూడా ప్రవేశం ఉంది. తండ్రి ఫుట్‌బాల్‌ ఆడేందుకు నిరాకరించడంతో ఆమె తన దృష్టిని ఇండోర్‌ గేమ్స్‌ వైపు మరల్చుకుంది. రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో పక్కనే జూడో శిక్షణ సాగుతుంటే దాన్ని నిశితంగా పరిశీలించేంది. అందులో కొందరు ప్లేయర్లు నల్ల బెల్ట్‌లు, కొందరు తెల్ల బెల్ట్‌లు వేసుకునే వారు. అది ఆమెను బాగా ఆకర్షించింది. అందులోనూ తన ప్రత్యేకత చాటుకోవాలని భావించిన ఇనున్‌గన్‌బీ చివరకు జూడోలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. 

ఆరంభంలో నాలుగేళ్ల పాటు ప్రాథమిక దశను దాటలేకపోయిన ఇనున్‌గన్‌బీ... ఆ తర్వాత నిలకడ కనబర్చింది. తొలిసారి 2021 ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఈ మణిపూర్‌ ప్లేయర్‌ మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత గాయాలు వేధించినా... పట్టుదలే పెట్టుబడిగా పెట్టి... మొక్కవోని దీక్షతో ముందుకు సాగి... తాజాగా కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. గతేడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఓపెన్‌ జూడో పోటీల్లో ఇనున్‌గన్‌బీ పసిడి పతకం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్న ఇనున్‌గన్‌బీకి మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం!   

–సాక్షి క్రీడా విభాగం  

Advertisement
 
Advertisement
Advertisement