
న్యూఢిల్లీ: దక్షిణాసియా సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత జూడోకాలు పతకాల పంట పండించారు. నేపాల్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో పది బంగారు పతకాలు గెలిచారు. పాల్గొన్న ఏడుగురు మహిళలూ స్వర్ణాలే గెలుపొందడం విశేషం. ఆరుగురు పురుష జూడోకాల్లో ముగ్గురు పసిడి నెగ్గారు. మహిళల కేటగిరీలో లిక్మాబమ్ సుశీలా దేవి (48 కేజీలు), కల్పనా దేవి (52 కేజీలు), అనితా చాను (57 కేజీలు), హిద్రోమ్ సునిబాలాదేవి (63 కేజీలు), గరిమా చౌదరి (70 కేజీలు), చోంగ్తామ్ జినాదేవి (78 కేజీలు), తులికా మాన్ (78 కేజీలు) స్వర్ణాలు గెలిచారు.
పురుషుల విభాగంలో విజయ్ కుమార్ (60 కేజీలు), అజయ్ యాదవ్ (73 కేజీలు), దివేశ్ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. అంకిత్ బిష్త్ (66 కేజీలు), జోబన్‌దీప్ సింగ్ (90 కేజీలు), ఉదయ్ వీర్ సింగ్ (100 కేజీలు) కాంస్యాలు నెగ్గారు. గత చాంపియన్‌షిప్ (2014)లోనూ భారత పది బంగారు పతకాలు నెగ్గింది.