వ్యాధినిరోధక శక్తిలో తిరుగులేని దేశీ గోజాతులు
108 పశువుల జీనోమ్ విశ్లేషణతో శాస్త్రవేత్తల నిర్ధారణ
పాల దిగుబడి కోసమని ఎంచుకుంటున్న విదేశీ, సంకరజాతి పశువుల కంటే భారతీయ దేశవాళీ ఆవులే అన్ని విధాలా మేలని ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక ‘నేచర్ ఇండియా’ ప్రచురించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పులను, ప్రాణాంతక వ్యాధులను తట్టుకునే అద్భుతమైన రోగనిరోధక శక్తి మన దేశవాళీ ఆవుల జన్యువుల్లోనే సహజసిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు.
పరిశోధన ఫలితాలు
జాతీయ పాడి పరిశోధనా సంస్థ (ఎన్‌డీఆర్‌ఐ), శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ పరిశోధకులు మొత్తం 108 పశువుల సంపూర్ణ జన్యుక్రమాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందులో నాలుగు ప్రముఖ భారతీయ జాతులు (గిర్, సాహివాల్, థార్పార్కర్, కాంగేయం), విదేశీ జాతి (హోల్‌స్టీన్ ఫ్రీసియన్– హెచ్‌ఎఫ్), అలాగే భారతదేశంలో ఎక్కువగా పెంచే సంకరజాతి కరణ్ ఫ్రీస్ ఆవులను పోల్చి చూశారు.
దేశవాళీ జాతుల్లో బాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్లను ఎదుర్కొనే ‘సీఏఆర్‌డీ9’, ‘ఎన్‌ఎల్‌ఆర్‌పీ8’, ఎఫ్‌సీఏఆర్ వంటి కీలక రోగనిరోధక జన్యువులు అత్యంత శక్తిమంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సంకరజాతి, విదేశీ పశువుల్లో ఈ జన్యు రక్షణ తక్కువగా ఉండటం వల్ల అవి ఎక్కువగా పొదుగు వాపు, పేను/దోమల ద్వారా వచ్చే సంక్రమణ వ్యాధులబారిన పడుతున్నాయి. త్వరగా అధిక వేడి ఒత్తిడికి గురవుతున్నాయి.
అధికంగా పాలిచ్చినా..
దేశవాళీ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని సులభంగా తట్టుకోగల జన్యు రూపాంతరాలను కలిగి ఉన్నట్లు కూడా తేలింది. విదేశీ, సంకరజాతి ఆవులు అధికంగా పాలిచ్చినప్పటికీ.. వాటి నిర్వహణ, దాణా ఖర్చులు, పదే పదే వచ్చే రోగాలకు అయ్యే వైద్య ఖర్చులతో రైతులకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయి. మరోవైపు దేశవాళీ ఆవుల్లో సహజ రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల మందుల ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. అంతేకాకుండా దేశవాళీ పాలలోని ‘ఏ2’ పోషక విలువలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ లభిస్తోంది. స్థానిక వాతావరణానికి అనుకూలమైన స్వదేశీ జాతుల పోషణే పాడి రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
4 దేశీ, 2 హైబ్రిడ్ పశువుల సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ


