హెల్త్
చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదని సామెత. వృద్ధాప్యంలో కాస్త మతిమరుపు రావడం సహజం. అప్పుడు మతిమరపు (డిమెన్షియా) వస్తుంటే బాధపడటం కంటే 40ల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా మేలన్నది డాక్టర్ల మాట. మెదడు తాలూకు మంచి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో పెద్దవయసులో మతిమరపు రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.
నిజానికి మెదడుకు కలిగే నష్టాలు చాలాసార్లు బయటకు కనిపించకుండా మధ్య వయసునుంచే అంటే 40ల నుంచే మొదలవుతాయి. కారణం... చాలామందిలో ఆ వయసు నుంచే హైబీపీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటి జబ్బులు మొదలవుతాయి. దేహానికి వచ్చే ఈ తరహా జీవక్రియలకు సంబంధించిన జబ్బులను (మెటబాలిక్ డిజార్డర్స్)ను తమ మధ్యవయసులోనే... అంటే తమ నలభైల వయసులోనే అదుపులో ఉంచుకుంటే... భవిష్యత్తులో... అంటే... తమ 60లు, 70లలో వచ్చే మతిమరపు (డిమెన్షియా) ముప్పును తగ్గించుకోవచ్చన్నది వైద్య నిపుణులు అభిప్రాయం.
ఒక కేస్ స్టడీ చూద్దాం... 50 ఏళ్ల ఓ వ్యక్తి తాలూకు కుటుంబంలో... అతడి కుటుంబ సభ్యుల్లో కొందరికి వృద్ధాప్యంలో మతిమరపు (డిమెన్షియా) వచ్చిన కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంది. అయితే తన ఈ 50 ఏళ్ల వయసప్పుడు మాత్రం అతడికి జ్ఞాపకశక్తికి సంబంధించిన ఎలాంటి సమస్యా లేదు.
అతడు చేయించుకున్న సాధారణ ఆరోగ్య పరీక్షల్లో (యాన్యువల్ రొటీన్ హెల్త్ టెస్టుల్లో) మాత్రం రక్తపోటు కొద్దిగా ఎక్కువగా ఉండటం, చెడు (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండటం, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం... ఇవన్నీ మొదలవుతున్న దశలు కనిపించాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చునే జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలు కనిపించడం మామూలే.
ఆయన ప్రతిరోజూ వేగంగా నడవాలని, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, తక్కువ కొవ్వు కలిగినప్రోటీన్ ఆహారం తీసుకోవాలని డాక్టర్లు అతడికి సూచించారు. అవసరమైన మందులతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో పెట్టారు.
మూడేళ్లలో ఆయన ఆరోగ్య ప్రమాణాలు సాధారణ స్థాయికి వచ్చాయి. అయితే డాక్టర్లు ఇవన్నీ చేసింది కేవలం మధ్యవయసులో అతడి గుండెనూ, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు... భవిష్యత్తులో మెదడు ఆరోగ్యాన్నీ... భవిష్యత్తులో అతడి జ్ఞాపకశక్తినీ, డిమెన్షియా వంటి మతిమరపుతో పాటు అల్జైమర్స్ వంటి తీవ్రమైన మతిమరపు సమస్యలను నివారించేందుకు తోడ్పడేలా కూడా ఆ మందులు ఇచ్చారు. ఎందుకంటే... మధ్యవయసులో ఎన్నో సమస్యలు నివారించేందుకు డాక్టర్లు తీసుకునే ఎన్నో జాగ్రత్తలు... ఒక వ్యక్తి తాలూకు వృద్ధాప్యంలోనూ అతడి మనసూ, మెదడు ఆరోగ్యాలను కాపాడేలా కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.
మొదలయ్యేది మధ్యవయసులోనే...
చాలామందిలో మధ్య వయసులోనే శరీరంలో ఇన్ ఫ్లమేషన్, జీవక్రియలకు సంబంధించిన మార్పులు మొదలవుతాయి. అయితే ఈ దశలో వాటిని నియంత్రించడం సాధ్యమే. 40లు, 50ల్లోనే అధిక రక్తపోటు (హైబీపీ), అధిక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు (హైపర్ లిపిడేమియా), మధుమేహం (డయాబెటిస్), ఊబకాయం (ఒబేసిటీ) వంటి సమస్యలను అదుపులో పెట్టుకుంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాంతో భవిష్యత్తులో మతి మరపు (డిమెన్షియా) వంటి సమస్యలనూ నివారించుకోవచ్చు. డిమెన్షియా అంటే వృద్ధాప్యంలో తప్పనిసరిగా వచ్చే సమస్య కాదు. కాబట్టి దాని ముప్పును కొన్ని సందర్భాల్లో కొన్ని ముందుజాగ్రత్తలతో ముందునుంచే నివారించుకోవచ్చు.
డిమెన్షియాకు దారితీసే 14 కారణాలు...
‘ద లాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన నిపుణుల కమిషన్ నివేదిక–2024లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కింద పేర్కొన్నవి డిమెన్షియా ముప్పును పెంచేందుకు కారణమయ్యే కొన్ని అంశాలు. జీవనశైలి మార్పుల ద్వారా వాటిని చాలావరకు నియంత్రించవచ్చంటూ కూడా ఆ జర్నల్ పేర్కొంది.
వాటిలో ముఖ్యమైనవి:
- ఊబకాయం (ఒబేసిటీ)
- అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్ / హైబీపీ)
- ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా ఉండటం (హైపర్ లిపిడేమియా)
- మధుమేహం (డయాబెటిస్)
- శారీరక శ్రమ లేకపోవడం (సెడెంటరీ లైఫ్‌స్టైల్)
- పొగతాగే అలవాటు (స్మోకింగ్) ∙మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు
- వినికిడి లోపం ∙చికిత్స చేయించని చూపు సమస్యలు
- డిప్రెషన్
- సామాజికంగా ఒంటరిగా ఉండటం
- వాయు కాలుష్యం
- తలకు తీవ్రమైన గాయం
జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం మెదడు ఆరోగ్యం...
మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది రిటైర్‌మెంట్ తర్వాత ఆలోచించాల్సిన విషయం కాదు. జీవితంలో చాలా ముందుగానే దాని గురించి జాగ్రత్త పడాలి అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ముందే జాగ్రత్తపడుతూ తగిన ఆరోగ్య నియమాలు పాటించడం, కాస్తంత చురుకైన జీవితాన్ని గడుపుతుండటం, ఆహ్లాదకరమైన హాబీలతో ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం, సమస్యలను తీర్చేలా ఎప్పుడూ మెదడుకు పనిచెబుతూ ఉండటం వంటివి తమ మధ్యవయసులో (అంటే 40లలో) చేస్తుంటే... మున్ముందూ మన శరీర సంపూర్ణ ఆరోగ్యం కూడా అన్ని విధాలా బాగుండటంతో పాటు... మెదడు ఆరోగ్యమూ చక్కగా ఉండటమూ, మతిమరపు, అల్జైమర్స్ వంటివి నివారితం కావడమూ జరుగుతుంది.
గుండెను కాపాడుకోవడం అంటే... మెదడుకూ మేలు చేసుకోవడమే!
గుండె ఆరోగ్యం అంటే కేవలం అది గుండె సంరక్షణ మాత్రమే కాదు... గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం అంటే మన మెదడు ఆరోగ్యాన్ని కూడా పదికాలాల పాటు జాగ్రత్తగా చూసుకోవడమే. దీనికి అనేక కారణాలున్నాయి.
గుండె ఆరోగ్యం మెదడుకు ఎలా తోడ్పడుతుందంటే... మెదడు సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం సరైన రీతిలో రక్తప్రసరణ అవసరం. ఏళ్ల తరబడి అధిక రక్తపోటు ఉంటే మెదడులోని క్యాపిల్లరీస్ అనే అత్యంత చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతినవచ్చు. ఇలా జరగడమన్నది ఒక్కసారిగా పెద్ద సమస్యను కలిగించనప్పటికీ... కాలక్రమంలో జ్ఞాపకశక్తినీ, ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. దాంతో ఈ సమస్య కారణంగా మతిమరపు వచ్చే అవకాశమూ ఉండవచ్చు.
ఈ అధ్యయనాలే తార్కాణాలు... ఒక అధ్యయనంలో దాదాపు 3,000 మంది వృద్ధులను పరిశీలించారు. ఇందులో అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారి మెదడులోని 48 వెట్ మ్యాటర్ తాలూకు దారుల్లో 47 చోట్ల మార్పులు ఉన్నట్లు కనిపించాయి.
ఈ మార్పులు ‘ఫోర్నిక్స్’ అనే జ్ఞాపకశక్తికి సంబంధించిన దారుల్లో ఎక్కువగా కనిపించినందున అది భవిష్యత్తులో మతిమరపునకు కారణమయ్యే అంశంగా కనిపించింది. ఎందుకంటే... మెదడులోని వైట్‌మ్యాటర్ అనేది ఒక రకంగా మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచారాన్ని తీసుకెళ్లే కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లా పనిచేస్తుంది. ఈ అధ్యయన వివరాలు ఈ ఏడాదే అంటే... 2026లోనే ‘అల్జైమర్స్ అండ్ డిమెన్షియా’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే మంచి మెదడు ఆరోగ్యం కోసం ముందునుంచే గుండె ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరముందని డాక్టర్లు సూచిస్తున్నారు.
మధ్య యసులో డిప్రెషన్ ఉన్నవారిలో భవిష్యత్తులో డిమెన్షియా వచ్చే అవకాశం 14 శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే... ‘ద లాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన నిపుణుల కమిషన్ నివేదిక–2024 అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసుల్లో తమకు ముప్పు తెచ్చిపెట్టగల అంశాలను గుర్తించి, వాటిని నియంత్రించడం లేదా వాటికి దూరంగా ఉండటం ద్వారా సుమారు 45 శాతం కేసులల్లో మతిమరపు లేదా మెదడు సమస్యలను నివారించడమూ లేదా వీలైనంత ఆలస్యం చేయడం సాధ్యమేనని తేలింది. అందుకే తమ మెదడుకు చేటు తెచ్చిపెట్టగల అంశాలకూ, చెడు జీవనశైలి అలవాట్లుకు మధ్యవయసు నుంచే దూరంగా ఉండటం అన్నది భవిష్యత్తులో మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ‘ద లాన్సెట్’ నివేదిక వల్ల తేటతెల్లమవుతోంది.
మెదడు ఆరోగ్యానికి కళ్లూ, చెవులూ కూడా ముఖ్యమే...
మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మెదడుకు సమాచారం అందించే ప్రధాన మార్గాల్లో చూపుజ్ఞానం, వినికిడి జ్ఞానం ఈ రెండూ ప్రధానమైనవి. అందుకే మన జ్ఞానేంద్రియాల్లో దాదాపు 80% సమాచారం కంటి నుంచి వస్తుండగా... మరో 20% వరకు వినికిడితో వస్తుందని చెప్పవచ్చు. మిగతా జ్ఞానేంద్రియాలైన వాసనలు తెలిపే ముక్కు, స్పర్శ తెలిపే చర్మంతో వచ్చే సమాచారం అన్నది కళ్లు, చెవులతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే మంచి మెదడు ఆరోగ్యం కోసం కళ్లూ, చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. అందుకే వయసు పెరుగుతున్నప్పుడు చూపు కొద్దిగా తగ్గినా, వినికిడి కాస్తంతే తగ్గినా కూడా... అది ‘వయసైపోతోంది కాబట్టి ఈ టైములో ఇలాగే ఉంటుంది’’ అని వదిలేయకూడదు. వినికిడి లేదా చూపు సమస్యలను మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదన్నది డాక్టర్ల మాట.
షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవడమూ మంచిదే...
కొన్ని అధ్యయనాల ప్రకారం షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డిమెన్షియా ముప్పు తక్కువగా కనిపించింది. శరీరంలో నిద్రాణంగా ఉండే వైరస్‌ను నియంత్రించడం వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు మెదడులో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చని ఆ అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ సందర్భంగా డాక్టర్లు మరోమాటకూడా చెబుతున్నారు. అంతమాత్రాన కేవలం షింగిల్స్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అంటూ చెప్పలేమనీ, అది తప్పనిసరిగా డిమెన్షియాను నివారిస్తుందని కూడా చెప్పేటంతటి బలమైన ఆధారాలూ ఇప్పటికి కనిపించడం లేదన్నది కూడా డాక్టర్ల మాట. అది కేవలం ఒక పరిశీలన మాత్రమే అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.
సామాజికంగా కూడా కొన్ని చర్యలు అవసరం...
కేవలం వైద్యపరమైన జాగ్రత్తలూ, ముందస్తు నివారణకు అవసరమైన మందులను వాడటంతో పాటు సామాజికంగా కూడా మార్పు తెచ్చే పనులు చేపట్టడం కూడా మెదడుకు మేలు చేసే అంశమే. నడకకు మంచి దారులూ, సైక్లింగ్‌కు అనువైన రోడ్లు, స్వచ్ఛమైన గాలి కోసం మొక్కల పెంపకం, చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవడం, పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం అవసరం. నగరాల్లో ఉండే పరిస్థితులను మెరుగుపరచడం, మంచి విద్యావకాశాలూ, మేలైన ప్రజా రవాణా సదుపాయాలూ, క్రీడలూ, వ్యాయామానికి అవకాశాలు, వృద్ధులు ఒంటరిగా ఉండకుండా చూసుకోవడం, వారిని నిత్యం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా జాగ్రత్తపడటం వంటి పనున్నీ వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా పెద్దవయసులోనూ వారి ఆరోగ్యాన్ని మరింత బాగుండేలా చేస్తాయి.
చివరగా...
మన 70 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తిని పదిలంగా కాపాడుకోవాలంటే... అవసరమైన చర్యలను 70 ఏళ్లలోనే మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. చాలాముందుగానే అంటూ మన మధ్యవయస్సు 40లు, 50ల్లోనే రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, బరువు, నిద్ర, వ్యాయామం, ఆహారం, వినికిడి, చూపు, మానసిక ఆరోగ్యం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా భవిష్యత్తులో మన మెదడుకు మనమే ఓ మంచి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్టేనని గుర్తించడం అవసరమన్నది డాక్టర్ల మాట. మతిమరుపు వచ్చిన తర్వాత మెదడును కాపాడుకోవడం కంటే... మతిమరుపు వచ్చే అవకాశాలను ముందుగానే తగ్గించుకోవడమే తెలివైన పని అంటూ వైద్యులు
సూచిస్తున్నారు.
40, 50ల్లోనే జాగ్రత్తపడాలి
మెదడులోని చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతినడం, మెదడు కణాలకు నష్టం కలగడం వంటి మార్పులు ఒక్కరోజులో జరగవు. అది ఏళ్ల కొద్దీ నెమ్మదిగా జరిగే ప్రక్రియ. దాంతో మతిమరుపు సమస్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అందుకే జ్ఞాపకశక్తి తగ్గిన తర్వాత చికిత్స మొదలుపెట్టడం కంటే, 40–50 ఏళ్ల వయసులోనే... అందుకు కారణాలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.
సమస్య బయటపడక ముందే మొదలయ్యే అల్జైమర్స్...
డిమెన్షియాకు అత్యంత సాధారణ కారణం అల్జైమర్స్.
అల్జీమర్స్ లక్షణాలు బయటకు కనిపించడానికి ఎన్నో సంవత్సరాల ముందునుంచే మెదడులో వచ్చే కొన్ని మార్పుల కారణంగా / పేరుకుపోయే ప్లాక్ కారణంగా ఇది మొదలయ్యే అవకాశం ఉంది. మెదడులో అమైలాయిడ్–బీటా, టీఏయూ అనే రెండు రకాలప్రోటీన్లు ప్లాక్‌లాగా పేరుకుపోతాయి.
దాంతో మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడి దెబ్బతింటుంది. దాంతో క్రమంగా ఆ నాడీకణాలు దెబ్బతిని నశించిపోవచ్చు. ఇందులో ముఖ్యంగా హిప్పోక్యాంపస్ అనే మెదడులోని భాగం ప్రభావితమవుతుంది. ఇది కొత్త విషయాలను జ్ఞాపకంలో నిలుపుకోవడంలో చాలా ముఖ్యమైనది. అందుకే ఇటీవల జరిగిన విషయాలు గుర్తుండకపోవడం వంటి స్వల్పకాలిక జ్ఞాపకాల ప్రక్రియ (షార్ట్ టర్మ్ మెమరీ) రావచ్చు. ఇది భవిష్యత్తులో రాబోయే మతిమరపునకూ, అల్జైమర్స్ వంటి సమస్యలకూ ఓ మొదటి హెచ్చరిక లాంటి సూచన కావచ్చు.
మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి నిద్ర
మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మెదడులోని ఒక ప్రత్యేకమైన ద్రవ వ్యవస్థ పనిచేసి, పగటిపూట మనలో పేరుకుపోయే కొన్ని వ్యర్థ పదార్థాలూ, హానికరమైనప్రోటీన్లు, రసాయనాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అందుకే తమ తమ దేహ అవసరాలకు తగినట్లుగా ప్రతి ఒక్కరూ రోజూ రాత్రివేళల్లో కంటినిండా నిద్రపోవడం అన్న అంశం కూడా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిద్రలేమితో బాధపడే చాలామందిలో పెద్దవయసు వచ్చాక మతిమరపు రావడం చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. అందుకే నిద్రలేమి (ఇన్‌సామ్నియా), నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి స్లీప్ ఆప్నియా సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సమస్యలు కనిపించినప్పుడు తప్పనిసరిగా చికిత్స తీసుకోవడమే మంచిదన్నది వైద్యనిపుణుల సూచన.
చురుకైన మెదడు కోసం...
- రక్తపోటు (హైబీపీ), రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ మోతాదులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం.
- వారానికి కనీసం 150 నిమిషాలు తగ్గకుండా మైల్డ్ నుంచి ఓ మోస్తరు (మాడరేట్) వ్యాయామాలు చేయడం.
- తమ బరువు ఆరోగ్యకరమైన బీఎమ్‌ఐతో ఉండేలా చూసుకోవడం.
- బేకరీ ఐటమ్స్ వంటి బాగా ్రపాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం.
-కూరగాయలు, పండ్లు, నట్స్, కొవ్వులు తక్కువగా ఉండేప్రోటీన్‌లతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం.
- మద్యం, పొగాకు పూర్తిగా మానేయడం.
- వినికిడి లేదా చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకపోవడం.
- డిప్రెషన్, ఒంటరితనం లేదా ఇతరులతో కలవాలనే ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటే తొలిదశల్లోనే కుటుంబ సభ్యుల లేదా మిత్రుల సహాయం తీసుకుని వైద్య నిపుణులను సంప్రదించడం.
- స్నేహితులను తరచూ కలుస్తూ ఉండటంతో పాటు సామాజిక కార్యకలాపాలూ, కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం.
- తమ మనసును ఆహ్లాదపరిచే అభిరుచుల మేరకు మంచి హాబీలను అలవరచుకొని వాటిని నిత్యం ్రపాక్టీస్ చేయడం.
- నిద్రలేమి, గురక (ఆప్నియా) వంటి సమస్యలకు తగన చికిత్స తీసుకోవడం.
- కొత్త భాషలూ, కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ పజిల్స్ పూర్తి చేయడం...
మన దేశవాసులకు మరింత ముందస్తు జాగ్రత్త అవసరం...
పాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే మన దేశవాసుల్లో అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్) చాలా ముందుగానే మొదలయ్యే అవకాశాలెక్కువ. అంతేకాదు... యూరోపియన్ దేశవాసులతో పోల్చినప్పుడు మన దేశవాసుల రక్తనాళాల అంత వెడల్పుగా ఉండక ఒకింత సన్నగా ఉంటాయి. అందుకే మన దేశవాసుల్లో రక్తనాళాలు సన్నబడటం వల్ల వచ్చే కరొనరీ ఆర్టరీ డిసీజెస్ (సీఏడీ వంటి గుండెజబ్బులు) చాలా త్వరగా వస్తుంటాయన్నది అనేక అధ్యయనాల్లో తేలిన ఒక పరిశీలన.
ఈ నేపథ్యంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ ఏళ్ల పాటు మన శరీరంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వాటి సమగ్ర ప్రభావం అన్నది మెదడుపైనా ఎక్కువ కాలంపాటు కొనసాగవచ్చు. దాంతో పాశ్చాత్యదేశాలవారితో పోలిస్తే మన భారతీయుల్లో భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గేలాంటి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... ఇటీవల మారుతున్న దేశకాలమాన పరిస్థితుల నేపథ్యంలో మన వృత్తుల్లో సైతం శారీరక శ్రమ లేకపోవడం, దాంతో ఊబకాయం పెరగడం, వాయు కాలుష్యం కూడా పెరగడం జరుగుతున్నాయి.
ఇవన్నీ మనదేశవాసుల్లో మెదడు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అంశాలే అన్నది పలువురు వైద్యనిపుణుల అభిప్రాయం. అందుకే మనదేశవాసులు తమ మధ్యవయసు నుంచే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులపై చిన్నవయసునుంచే అవగాహన పెంచుకోవడమే కాకుండా... వీలైతే తమ 40ల నుంచే తరచూ షుగర్ పరీక్షలూ, బీపీని కొలవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం, కుటుంబ చరిత్రలో రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారు డాక్టర్లు సూచించినట్లుగా ప్రతి ఏడాదిగానీ... లేదా డాక్టర్ల సూచించిన వ్యవధుల్లో తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మేలు. నిర్వహణ : యాసీన్
ఇదీ చదవండి: వ్యాయామం తర్వాత కంప్రెషన్ దుస్తులు ఎందుకు ధరిస్తారు?


