బ్యాడ్మింటన్ కొత్త పాయింట్ల విధానంపై గోపీచంద్
బీడబ్ల్యూఎఫ్ ఆలోచనలో అర్థం లేదన్న భారత చీఫ్ కోచ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో వచ్చే ఏడాది నుంచి కొత్త పాయింట్ల పద్ధతి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు 21 పాయింట్లతో కూడిన 3 గేమ్‌లు ఉండగా, ఇకపై 15 పాయింట్లతో 3 గేమ్‌లు నిర్వహిస్తారు. దీనికి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా కూడా ఆమోద ముద్ర వేసింది. ఫార్మాట్‌ను కుదించడం వల్ల ఆటగాళ్లపై తక్కువ భారం పడుతుందని, ఏడాది పాటు వరుసగా టోర్నీలు ఆడే ప్లేయర్లకు ఇది ఊరటనిస్తుందని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. అయితే ఈ మార్పును పూర్తి స్థాయిలో తాను సమర్థించడం లేదని భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు.
ఇది కొందరు ఆటగాళ్లకు ఉపయోగపడవచ్చని, మరికొందరు ప్లేయర్లు పూర్తిగా ఆట నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ప్లేయర్లపై భారత తగ్గించడం అనే బీడబ్ల్యూఎఫ్ ఆలోచనలోనే అర్థం లేదని గోపీచంద్ అన్నారు. ‘కొత్త పాయింట్ల పద్ధతిలో వేగం, బలం, మానసిక దృఢత్వం కీలకంగా మారతాయి. ముఖ్యంగా మ్యాచ్ చివరి క్షణాల్లో ఆట ఇలాగే సాగుతుంది. పాయింట్లు సాధించడంకంటే పాయింట్లు ఇవ్వకుండా ఉండటం కూడా ప్రాధాన్యతగా మారిపోతుంది.
11వ లేదా 12వ పాయింట్ చాలా కీలకంగా మారిపోతుంది. ముఖ్యంగా 13–14, 15–14 లాంటి స్కోరు వద్ద తీవ్ర ఒత్తిడి ఉంటుంది. నా దృష్టిలో కొత్త విధానం వల్ల బ్యాడ్మింటన్ స్వరూపం మారిపోతుంది. అంతా వేగంగా సాగుతుంది. ర్యాలీలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న పద్ధతిలో అయితే కొన్ని మంచి స్ట్రోక్‌లు ఆడేంత సమయం ఉంటుంది. కానీ ఇకపై ఆటంతా ఒకే తరహాలో కనిపిస్తుంది’ అని గోపీచంద్ విశ్లేషించారు.
ఇది భారం తగ్గించే పద్ధతి కాదు!
ఏడాది ఆసాంతం పెద్ద సంఖ్యలో టోర్నీలు జరుగుతుంటాయి కాబట్టి ఆటగాళ్లకు కాస్త విరామం ఇచ్చేందుకే ఈ 15 పాయింట్ల సిస్టంను తెచి్చనట్లు బీడబ్ల్యూఎఫ్ చెబుతోంది. అయితే ఇది కూడా సరైన కారణం కాదని గోపీచంద్ అన్నారు. నిజంగా విరామం కావాలని భావిస్తే అందుకు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
‘ఒకవైపు మ్యాచ్ వ్యవధిని తగ్గిస్తూ మరోవైపు టోర్నీ జరిగే రోజుల సంఖ్యను పెంచడం ఏమిటి. ఇలా రెండు రకాలుగా చేయడంలో అర్థం లేదు. 21 పాయింట్లనే కొనసాగిస్తూ ఒక్కో టోర్నీని వారం రోజులకు బదులుగా రెండు వారాలకు పెంచితే సరిపోయేది. బీడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకోవడంలో కారణమేమిటో తెలియడం లేదు. నా అభిప్రాయం ప్రకారం సీనియర్ ఆటగాళ్లయితే 15 పాయింట్ల పద్ధతి ఉపయోగపడవచ్చు’ అని హెడ్ కోచ్ వెల్లడించారు.
డబుల్స్ భవిష్యత్తుపై సందేహం!
భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. గత కొన్నేళ్లుగా ఎన్నో టైటిల్స్ గెలిచారు. అయితే వీరిద్దరి తర్వాత డబుల్స్‌లో ఎవరికి ఆ స్థాయి ఉందనే విషయంలో తనకూ స్పష్టత లేదని గోపీచంద్ అన్నారు. వెంటనే మంచి ఫలితాలు రాబట్టే డబుల్స్ జంట కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా ఆలోచించాల్సిన అంశమే. కలిసి వచ్చి కలిసి ఆడతామనే ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ళను మనం గుర్తించాల్సి ఉంది.
ఐదేళ్ల క్రితం వరకు నాలుగైదు అకాడమీలే ఉండేవి. ఇప్పుడు 500కు పైగా అకాడమీలు ఉన్నాయి. దాదాపు 5 వేల మంది ప్లేయర్లు ఆడుతున్నారు. అంటే 5 వేల భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. వీరిలోంచి డబుల్స్ జోడీలను తయారు చేయడం అంత సులువు కాదు. సింగిల్స్‌లో బాగా ఆడేవారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయోగాత్మకంగా డబుల్స్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. వారు మారడం చాలా కష్టం. కాబట్టి డబుల్స్ కోసం ప్రత్యేక ప్రతిభ కావాలి’ అని గోపీచంద్ వాస్తవాలను వివరించారు.
మళ్లీ మారుస్తారా!
2001లో గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సమయంలో ‘15 పాయింట్ల’ పద్ధతే అమల్లో ఉంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే బీడబ్ల్యూఎఫ్ ప్రయోగాత్మకంగా 7–5 స్కోరింగ్ పద్ధతిని తీసుకొచి్చంది. ఇది విఫలం కావడంతో ఏడాది లోపే మళ్లీ 15 పాయింట్లకు ఆట మారిపోయింది. ‘నేను ఆల్ ఇంగ్లండ్ గెలిచిన కొద్ది రోజులకే 15 పాయింట్ల ఆటను 7 పాయింట్లుగా మార్చేశారు.
నాలాంటి స్ట్రోక్ ప్లేయర్లు దీనికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. దాదాపు ఏడాది తర్వాత గానీ నాకు ఆటపై మళ్లీ పట్టు చిక్కలేదు. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో మళ్లీ పాయింట్ల ఫార్మాట్ మార్చడంతో మాపై పెద్ద దెబ్బ పడింది. ఒక పద్ధతిలో శిక్షణ తీసుకొని అలవాటు పడిన తర్వాత మళ్లీ పాత ఫార్మాట్‌కు వెళ్లి ఆడటం చాలా కష్టం. కాబట్టి కొత్త పాయింట్ల పద్ధతి వల్ల కచి్చతంగా చాలా మందిపై ప్రభావం పడుతుంది. కొందరు ఆటగాళ్లకు ప్రయోజనం కలిగితే, మరికొందరు ప్లేయర్ల మనుగడ కష్టంగా మారిపోతుంది’ అని ఆయన గుర్తు చేశారు.


