ఓటమి అంచుల్లో నుంచి... | Manush Shah and Manav Thakkar pair advances to quarterfinals | Sakshi
Sakshi News home page

ఓటమి అంచుల్లో నుంచి...

Aug 13 2026 12:44 AM | Updated on Aug 13 2026 12:44 AM

Manush Shah and Manav Thakkar pair advances to quarterfinals

మనుశ్‌–మానవ్‌ జోడీ విజయనాదం 

క్వార్టర్‌ ఫైనల్లోకి భారత జంట 

మాల్మో (స్వీడన్‌): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యూరోప్‌ స్మాష్‌ లెవెల్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో మనుశ్‌ షా–మానవ్‌ ఠక్కర్‌ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన మూడో సీడ్‌ మనుశ్‌–మానవ్‌ ద్వయం రెండో రౌండ్‌లో 5–11, 6–11, 11–4, 11–8, 11–3తో డేనియల్‌ బెర్జోసా–యువాన్‌ పెరెజ్‌ (స్పెయిన్‌) జంటపై విజయం సాధించింది. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లను కోల్పోయిన భారత జోడీ ఆందోళన చెందకుండా అద్భుత ఆటతీరుతో తేరుకుంది. వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

సొంత సర్వీస్‌లో 27 పాయింట్లు గెలిచిన భారత జోడీ... ప్రత్యర్థి జంట సర్వీస్‌లో 17 పాయింట్లు సొంతం చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో మార్టిన్‌ అలెగ్రో–అడ్రియన్‌ రసాన్‌ఫోస్‌ (బెల్జియం)లతో మనుశ్‌–మానవ్‌ తలపడతారు. మహిళల డబుల్స్‌ విభాగంలో దియా చిటాలె–యశస్విని ఘోర్పడే (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన దియా–యశస్విని రెండో రౌండ్‌లో 12–10, 6–11, 11–8, 9–11, 4–11తో అనెట్‌ కౌఫ్‌మన్‌–సబీనా వింటర్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో మనుశ్‌ షా–దియా చిటాలె ద్వయం 14–12, 9–11, 9–11, 9–11తో అలెక్సిస్‌ లెబ్రున్‌ (ఫ్రాన్స్‌)–సత్సుకి ఒదో (జపాన్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది.  

మానవ్, మనిక, సత్యన్‌ ఓటమి 
సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. మానవ్‌ ఠక్కర్, సత్యన్‌ జ్ఞానశేఖరన్, మనిక బత్రా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌ 9–11, 8–11, 6–11తో టొమోకాజు హరిమోటో (జపాన్‌) చేతిలో... సత్యన్‌ 6–11, 11–8, 6–11, 5–11తో సోరా మత్సుషిమా (జపాన్‌) చేతిలో... మనిక బత్రా 12–14, 7–11, 6–11తో లిలీ జాంగ్‌ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement