యోకోహామా (జపాన్): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యోకోహామా చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్లు మానవ్ ఠక్కర్, మనుశ్ షా, మనిక బత్రాలకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మానవ్ 11–9, 8–11, 6–11, 11–7, 6–11తో ప్రపంచ 15వ ర్యాంకర్ డార్కో జోర్గిచ్ (స్లొవేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్ మనుశ్ షా 5–11, 5–11, 8–11తో ప్రపంచ 10వ ర్యాంకర్ అలెక్సిస్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 55వ ర్యాంకర్ మనిక 1–11, 7–11, 7–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కువై మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. మానవ్, మనుశ్, మనికలకు 4,500 డాలర్ల (రూ. 4 లక్షల 27 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


