‘తొలగించడంపై కారణం చెప్పండి.. లేదంటే ఊరుకోను’ | Table-Tennis-Star-Manika Batra-Threatens-Legal Action-Over-Asian Games Snub | Sakshi
Sakshi News home page

Manika Batra: ‘తొలగించడంపై కారణం చెప్పండి.. లేదంటే ఊరుకోను’

Jun 24 2026 1:42 PM | Updated on Jun 24 2026 2:02 PM

Table-Tennis-Star-Manika Batra-Threatens-Legal Action-Over-Asian Games Snub

ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టు నుంచి తనను తీసేయడంపై భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్రా అసహనం వ్యక్తం చేసింది. తనను జట్టు నుంచి తొలగించడంపై సరైన కారణం చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్‌ఐ)ని హెచ్చరించింది. 

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ జోక్యం చేసుకోవాలని మనికా బాత్రా మరోసారి కోరింది. తనను జట్టు నుంచి ఎందుకు తీసేశారనేది అడగడం లేదని, ఎంపిక ప్రక్రియలో తనకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని మనికా నొక్కి చెప్పారు.

‘నన్ను ఎంపిక చేయమని నేను అడగడం లేదు. ఎంపిక చేయకపోవడంపై తీసుకున్న నిర్ణయాన్ని మార్చమని కూడా అడగడం లేదు. నన్ను ఏ ప్రాతిపదికన జట్టులో నుంచి తీసేశారో నాకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాను. నన్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాలను ఫెడరేషన్ తెలియజేయలేదు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో నేను 51వ స్థానంలో ఉన్నాను. 

ర్యాంకింగ్స్ ప్రతి వారం మారుతుంటాయి. ఎంపిక సమయంలో ఏ కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకున్నారు? టాప్-50లో ఉన్న ప్లేయర్ ఒకటి లేదా రెండు వారాల్లో 50 నుంచి 51వ స్థానానికి పడిపోతే.. ఆసియా క్రీడలకు అర్హత కోల్పోయినట్టేనా? వీటిపై ఫెడరేషన్ నాకు సమాధానం ఇచ్చి తీరాలి. అయితే నిర్ణయానికి గల కారణాలపై సంతృప్తికర సమాధానాలు రాకపోతే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. పరిష్కార మార్గాలను అన్వేషించడం తప్ప నాకు మరో మార్గం లేదు ’ అని మనికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎంపికకు ఆధారాలెక్కడ?
‘గత ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రాత్మక పతకం అందించిన ఐకా ముఖర్జీకి కూడా ఈసారి చోటు దక్కలేదు. ఇలాంటి విజయాలు సాధించిన ప్లేయర్లను జట్టులోకి తీసుకోకపోతే ఎంపిక ప్రమాణాలపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. 

టీటీఎఫ్ఐలో ప్లేయర్ల ఎంపిక నిర్ణయాలు తీసుకునేది ఎవరు? వారిలో ఎంతమంది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు? ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌ల్లో ఎంతమంది పాల్గొన్నారు? నా ఎంపికపై కూడా ఓటింగ్ జరిగి ఉంటే అవి ప్రదర్శన ఆధారంగానే చేశారా? లేదా వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నన్ను తప్పించారా?’ అని ఫెడరేషన్‌ను ప్రశ్నించింది. కాగా జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి.

Read: స్టేడియం వద్ద తొక్కిసలాట.. మదిలోకి చిన్నస్వామి భయానక ఘటన!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement