జట్టులో చోటు కాదు... జవాబులు కావాలి?
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బత్రా డిమాండ్
ఆసియా క్రీడలకు ఎంపిక చేయకపోవడంపై పలు ప్రశ్నలు
సెలక్షన్ కమిటీపై సందేహాలు లేవనెత్తిన భారత స్టార్
ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తన పేరు లేకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా డిమాండ్ చేస్తోంది. కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించిన మనిక... ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించింది.
ఒలింపిక్స్ క్రీడల్లో రెండుసార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... అర్జున, ఖేల్‌రత్న వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకున్న మనిక... ఏ నిబంధనల ప్రకారం ఆసియా క్రీడలకు జట్టును ఎంపిక చేశారో తెలపాలని కోరుతోంది. తనకు జట్టులో చోటు కల్పించాల్సిన అవసరం లేదని... కానీ ఎంపిక ప్రక్రియపై మాత్రం స్పష్టత ఇవ్వకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతానని అంటోంది. ఈ నేపథ్యంలో మనిక డిమాండ్ పూర్వాపరాలను ఓసారి పరిశీలిస్తే....
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తన పేరు లేకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వకపోతే... చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా హెచ్చరించింది. తనకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటులు అక్కరలేదని... కానీ ఏ లెక్కల ప్రకారం జట్టును ఎంపిక చేశారనే అంశంపై మాత్రం సమగ్ర సమాచారం కావాల్సిందే అని పట్టుబట్టింది.
ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్‌లలో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనుండగా... దాని కోసం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) ఇటీవల జట్టును ప్రకటించింది. అయితే అందులో ప్రపంచ 51వ ర్యాంకర్, భారత మహిళల రెండో ర్యాంకర్ మనికకు చోటు దక్కలేదు. దీంతో తనను ఎంపిక చేయకపోవడానికి గల సహేతుక కారణాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాలను సామాజిక మాధ్యమాల వేదికగా కోరింది.
తనకు ఎలాంటి మినహాయింపులు అక్కరలేదని... కేవలం తన ప్రశ్నలకు జవాబులు కావాలని మనిక అంటోంది. మరోవైపు నిర్దేశిత దేశవాళీ టోర్నీల్లో పాల్గొనలేదనే కారణంగా టీటీఎఫ్‌ఐ మనికను ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన తుది జట్టులో చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మనిక సెలక్షన్ ప్రక్రియపై పలు సందేహాలు లేవనెత్తింది అవి ఆమె మాటల్లోనే....
» జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియలో పారదర్శకత అన్నిటికంటే ముఖ్యం. ప్రతి ఒక్కరికీ జావాబుదారీతనం తప్పనిసరి. నాకు జట్టులో చోటు దక్కలేదనే కారణంగా ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటే పొరబాటే. నన్ను ఎంపిక చేయమని కోరడం లేదు. కేవలం నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని అడుగుతున్నా.
» నన్ను ప్రత్యేకంగా చూడండి అని నేనెప్పుడూ అనలేదు. కానీ జట్టు ఎంపిక ప్రమాణాలు ఏంటి... దేన్ని ఆధారంగా చేసుకొని ఏషియన్ గేమ్స్‌కు టీమ్‌ను ఎంపిక చేశారో మాత్రం అందరికీ తెలియాల్సిందే. సెలక్షన్ ప్రక్రియపై స్పష్టమైన వివరణ ఇస్తారని ఆశిస్తున్నా. సంతృప్తికర సమాధానాలు లభించకపోతే... చట్టపరంగా ముందుకు వెళ్లడం తప్ప నాకు మరో దారిలేదు.
» ప్రస్తుతం నేను ప్రపంచ 51వ ర్యాంక్‌లో ఉన్నాను. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రతీవారం ర్యాంక్‌లను సవరిస్తుంటుంది. మరి ఆసియా క్రీడలకు ఎంపిక చేసేందుకు ఏ మార్క్‌ను పరిగణనలోకి తీసుకున్నారో నాకు తెలియాలి. గత నాలుగేళ్ల ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారా... లేక ఏడాది ప్రదర్శననా... లేక మూడు నెలల ఆటతీరునా... లేక కేవలం గత వారం ర్యాంక్‌లను దృష్టిలో పెట్టుకొని జట్టు ఎంపిక జరిగిందా?
» సుదీర్ఘ కాలంగా టాప్–50లో ఉన్న ప్లేయర్ కేవలం ఒకటీ రెండు వారాల కోసం 51వ ర్యాంక్‌కు చేరితే ఆమెను జట్టుకు ఎంపిక చేయరా? ఈ ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి.
» దేశవాళీ టోర్నీలపై నాకు అపార గౌరవం ఉంది. వాటిలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తా. కానీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం దక్కడం లేదు. గ్లోబల్ క్యాలెండర్, ప్రయాణాలు, గాయాలు, రికవరీ, ప్రతిష్టాత్మక పోటీల కోసం ప్రాక్టీస్... ఇలా తీరిక దొరకడం లేదు. ఇక మీద జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విషయంలో మరింత శ్రద్ధ వహిస్తాను. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను.
» ఆసియా క్రీడల కోసం జట్లను ఎంపిక చేసేటప్పుడు ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని క్రీడా శాఖ సూచిస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే నా ఒక్కదానికే కాదు... ఐహిక ముఖర్జీకి కూడా అన్యాయం జరిగింది. 2022 ఆసియా క్రీడల డబుల్స్‌లో చారిత్రక పతకం నెగ్గిన ఐహికను ఈసారి ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్లకు జట్టులో చోటు కల్పించనప్పుడు... ఎంపిక ప్రమాణాలపై సహజంగానే అనుమానాలు రేకెత్తుతాయి. జట్టు ఎంపిక ప్రక్రియ ఓటింగ్ ద్వారా జరిగిందని తెలిసింది. అదే నిజమైతే... ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన తీసుకున్నారో తెలియాలిలి. ఓ ప్లేయర్ భవితవ్యాన్ని ఓటు ద్వారా నిర్ణయించడం సరైనదేనా అనేది కూడా తేలాలి.
సెలక్షన్ కమిటీకి అర్హత ఉందా?
నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లను ఎవరు ఎంపిక చేస్తున్నారనే అంశంపై స్పష్టత కావాలి. సెలక్షన్ కమిటీలో ఎంతమందికి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఆడిన అనుభవం ఉంది. ప్యానెల్‌లో ఎంతమంది దేశం తరఫున ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు వంటి అత్యున్నత స్థాయి టోర్నీల్లో పాల్గొన్నారు? ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగి ఉంటే... దానికి గల కారణాలు తెలియాలి. అందుకే ఈ ఎంపిక ప్రక్రియపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని కోరుతున్నా. నన్ను ఎంపిక చేయలేదనో, లేక నాకు జట్టులో చోటు దక్కాలనో ఈ ప్రయత్నం చేయడం లేదు. సెలక్షన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నా.


