ఆసియా క్రీడలంటే విహార యాత్ర కాదు
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
ఏషియన్ గేమ్స్‌కు భారత్ నుంచి 600 మంది!
న్యూఢిల్లీ: అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే వారికే అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్నాయి. వేర్వేరు క్రీడాంశాల్లో ఇప్పటికే పలువురు క్రీడాకారులకు ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించారు. అయితే కేవలం ‘పార్టిసిపేషన్ సర్టిఫికెట్’ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే లాంటి వారిని కాకుండా... దేశం కోసం పతకం గెలవగల సత్తా ఉన్నవాళ్లనే ఆసియా క్రీడలకు పంపుతామని మాండవీయ స్పష్టం చేశారు.
‘ఆసియా క్రీడలు కేవలం ప్రచార యాత్ర కాదు. అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు చక్కటి వేదిక. అత్యుత్తమ ఆటతీరు కనబర్చగలిగే వారు మాత్రమే ఏషియన్ గేమ్స్‌కు వెళ్తారు. కేవలం సంఖ్యను భర్తీ చేసేందుకు వచ్చేవారికి అనుమతి ఇవ్వబోం. దేశం నుంచి 600 మందిని మాత్రమే ఆసియా క్రీడలకు పంపాలనుకుంటున్నాం. అంతర్జాతీయ అనుభవం సాధించేందుకు, ఆ సాకుతో ఉద్యోగాలు పొందేందుకు ఆసియా క్రీడలు వేదిక కాకూడదు’ అని మాండవీయ వెల్లడించారు. ఆసియా క్రీడల ఎంపిక ప్రక్రియలో భాగంగా గతేడాదే కేంద్ర క్రీడా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఏ క్రీడాంశంలోనైనా పతకం గెలవగల వాళ్లనే ఎంపిక చేయాలని క్రీడా సమాఖ్యలకు సూచించింది. ఎంపిక ప్రక్రియను వీడియో రూపంలో చిత్రించి పొందుపరచాలని ఆదేశించింది. ‘జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు గతంలో మార్గదర్శకాలు పంపాం. సిఫార్సు చేసిన ఆటగాళ్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి పంపాలని సూచించాం. ఆ పేర్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పరిశీలిస్తుంది. ఆ తర్వాతే క్రీడా శాఖ అమోదం తెలుపుతుంది. గతంలో మాదిరిగా సమాఖ్యలు ఇష్టానుసారంగా వ్యవహరించే పద్ధతికి ఈ సారి స్వస్తి పలికాం’ అని మాండవీయా తెలిపారు.
అనూశ్ అగర్వాలాకు అవకాశం!
ఇప్పటికే దేశంలోని పలు క్రీడా సమాఖ్యలు... ఆసియా క్రీడలకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రయల్స్ అనంతరం జాతీయ క్రీడా సమాఖ్యలు విడుదల చేసే జాబితాలు... ఫెడరేషన్ అంతర్గత ఎంపిక ప్రక్రియ నుంచి సిఫార్సు చేసిన జాబితాగా మాత్రమే పరిగణిస్తాం. దాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు కాదు. వాటిని పరిశీలించిన అనంతరం క్రీడా శాఖ అంగీకారం తెలిపిన అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది మాత్రమే ఆసియా క్రీడల్లో పాల్గొంటారు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈక్వేస్ట్రియన్ అనూశ్ అగర్వాలాను ఆసియా క్రీడలకు ఎంపిక చేయకపోవడంపై కూడా క్రీడా శాఖ పునరాలోచనలో పడింది.
అనూశ్‌ను ఆసియా క్రీడల జట్టు నుంచి తొలగించాలని భారత ఈక్వేస్ట్రియన్ సమాఖ్య తాత్కాలిక కమిటీ నిర్ణయించగా... దీనిపై అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కనీస అర్హత ప్రమాణాలు పాటించకుండా... సెలెక్షన్ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని అగర్వాలా ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనూశ్‌కు ఆసియా క్రీడల్లో అవకాశం దక్కొచ్చని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు సెలెక్షన్ ప్రక్రియపై తొలుత ప్రశ్నలు లేవనెత్తి ఆ తర్వాత వెనక్కి తగ్గిన స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా అంశాన్ని మాత్రం క్రీడా శాఖ పరిగణించలేదు.


