తొలి ఇన్నింగ్స్‌లో 460/9
ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీ
రెండో రోజు సగం ఆట వర్షార్పణం
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.
సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.
రిషభ్ పంత్ (39), మానవ్ సుతార్ (24) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కుల్దీప్ యాదవ్ (12 బ్యాటింగ్), ప్రసిధ్ కృష్ణ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టగా... కుషారా నువాంతా 175 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండగా... మూడో రోజు ఇక్కడ బ్యాటింగ్ మరింత కష్టం కానుంది.
ఆదుకున్న జురేల్...
భారీ వర్షం కారణంగా ఆదివారం రెండు సెషన్‌ల ఆట తుడిచిపెట్టుకుని పోయింది. మధ్యాహ్నం తర్వాత మైదానం ఆటకు అనుకూలంగా మారగా... తొలి రోజుతో పోలిస్తే
రెండో రోజు లంక మెరుగ్గా బౌలింగ్ చేసింది. పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... కండరాలు పట్టేయడంతో తొలి రోజు మైదానాన్ని వీడిన రాహుల్ క్రీజులోకి వచ్చాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అతడు అదనపు బౌన్స్‌కు దొరికిపోయాడు.
12 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరగగా... ఈ దశలో జురేల్ సంయమనం పాటించాడు. మరో ఎండ్‌లో పడిక్కల్ 150 పరుగుల మార్క్ దాటగా... జురేల్ వేగంగా ఆడాడు. భారీ ఇన్నింగ్స్ అనంతరం పడిక్కల్ స్టంపౌట్ కాగా... రవీంద్ర జడేజా (13) విఫలమయ్యాడు. అయినా వీలు చిక్కినప్పుడల్లా షాట్‌లు ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అర్ధశతకం అనంతరం ధనంజయ డిసిల్వా పట్టిన చక్కటి క్యాచ్‌కు జురేల్ పెవిలియన్ చేరాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 32; రాహుల్ (సి) ఫెర్నాండో (బి) కేషారా 82; పడిక్కల్ (స్టంప్డ్) డిక్‌వెల్లా (బి) ప్రభాత్ జయసూర్య 167; గిల్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 16; పంత్ (సి) దినుషా (బి) కేషారా 39; జురేల్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ప్రభాత్ జయసూర్య 51; జడేజా (ఎల్బీ) (బీ) కేషారా 13; మానవ్ సుతార్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 24; సిరాజ్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ఫెర్నాండో 11; కుల్దీప్ (బ్యాటింగ్) 12; ప్రసిధ్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 460.
వికెట్ల పతనం: 1–47, 2–236, 3–307, 4–319, 5–357, 6–377, 7–432, 8–447, 9–447.
బౌలింగ్: అషిత ఫెర్నాండో 17–1–61–1; లహిరు కుమార 13–1–76–0; కేషారా నువాంతా 39–1–175–3; ప్రభాత్ జయసూర్య 39–6–109–4; ధనంజయ డిసిల్వా 4–0–15–0; సోనల్ దినుషా 4–0–17–0.


