సెయిలింగ్‌లో భారత్ రెండు పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. ‘స్కిఫ్’ ఓపెనింగ్ రేస్–9 ఈవెంట్ పురుషుల విభాగంలో భారత్‌కు రజతం, మహిళల విభాగంలో కాంస్యం దక్కాయి. పురుషుల విభాగంలో మొత్తం 9 రేస్‌లలో కలిపి 23 పాయింట్లు సాధించిన భారత ద్వయం ప్రిన్స్ నోబుల్ కురిసిన్‌కల్–మను ఫ్రాన్సిస్ రెండో స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం తక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. చైనా 16 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా, హాంకాంగ్‌కు కాంస్యం లభించింది. మహిళల విభాగంలో భారత్ 24 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. హర్షిత తోమర్, శీతల్ వర్మ ఇందులో సభ్యులుగా ఉన్నారు. జపాన్ (11)కు స్వర్ణం దక్కగా, హాంకాంగ్ (15)కు రజతం లభించింది.
బాల్యమిత్రుల కథ
ఒకరికి 20 ఏళ్లు, మరొకరికి 21 ఏళ్లు... ఊహ తెలిసిన దగ్గరి నుంచి ఇద్దరూ కలిసి పడవల్లోనే ప్రయాణిస్తూ పోటీ పడుతున్నారు. పేరుకు వారి మధ్య సోదరసంబంధం (కజిన్స్) ఉంది. కానీ తామిద్దరం అత్యంత ఆత్మీయ స్నేహితులమని వారు చెప్పుకుంటారు. సెయిలింగ్‌లో ప్రదర్శనతో భారత ఆర్మీలో ఉద్యోగం దక్కించుకున్న వీరిద్దరు ఉద్యోగం కూడా ఒకే చోట కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో కలిసి డబుల్స్ జోడీగా రజత పతకం సొంతం చేసుకున్నారు.
వారిద్దరే కేరళలోని కొచ్చికి చెందిన ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్. చేపలు పట్టే వృత్తిలో ఉన్న ప్రిన్స్ తండ్రి చిన్నతనంలోనే వరదల్లో చనిపోయాడు. అయినా సరే అతను నీటితో అనుబంధాన్ని వదులుకోలేదు. వారి ఇంటికి సమీపంలోనే అరేబియన్ సముద్రం ఉండటంతో అతను వాటర్ స్పోర్ట్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. నోబుల్‌కు సోదర మిత్రుడు ఫ్రాన్సిస్ జత కలిశాడు. వీరిద్దరు కలిసి ముందుగా కేరళ బ్యాక్ వాటర్స్‌లో సెయిలింగ్ మొదలు పెట్టగా, గత పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
తామిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఇద్దరూ మాటలకంటే కూడా ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూనే రేస్‌లో సత్తా చాటుతామని ఇద్దరూ చెబుతున్నారు. ఇప్పటికే ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన వీరికి ఆసియా క్రీడల్లో ఇదే తొలి మెడల్. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో నోబుల్, ఫ్రాన్సిస్ ఉన్నారు.


