శుభవార్త చెప్పిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ | Glenn Maxwell and wife Vini Raman welcome second child | Sakshi
Sakshi News home page

శుభవార్త చెప్పిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌

Aug 18 2026 7:24 PM | Updated on Aug 18 2026 7:24 PM

Glenn Maxwell and wife Vini Raman welcome second child

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. తాను రెండోసారి తండ్రిని అయ్యానని.. వినీ, పాప క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు.

కాగా భారత సంతతికి చెందిన వినీ రామన్‌.. 2013లో తొలిసారి మాక్స్‌వెల్‌ను కలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. 2017లో తమ బంధాన్ని ప్రకటించిన మాక్సీ- వినీ.. 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే.. 2022లో వివాహం చేసుకున్నారు.

మెల్‌బోర్న్‌ వేదికగా తమిళ బ్రాహ్మణ, క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతిలో వినీ- మాక్సీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు 2023లో తొలి సంతానంగా కుమారుడు లోగాన్‌ మార్వెరిక్‌ మాక్స్‌వెల్‌ జన్మించాడు. తాజాగా కుమార్తె జన్మించగా.. ఆమెకు మియా మాక్స్‌వెల్‌గా నామకరణం చేసినట్లు వినీ దంపతులు తెలిపారు.

కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఇప్పటి వరకు ఏడు టెస్టులు, 149 వన్డేలు, 130 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 339 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డేల్లో 3990, టీ20లలో 2897 పరుగులు సాధించాడు.

ఇక ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌ ఖాతాలో ఎనిమిది టెస్టు, 77 వన్డే, 51 టీ20 వికెట్లు ఉన్నాయి. కాగా 2017లోనే తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఇటీవలే వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ 141 మ్యాచ్‌లు ఆడిన మాక్సీ.. 2819 పరుగులు చేయడంతో పాటు.. 41 వికెట్లు తీశాడు. గతేడాది చివరగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆడిన అతడు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్‌లతో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement